Sakshi News home page

డిపాజిట్లపై వడ్డీకోత

Published Fri, Nov 18 2016 12:21 AM

డిపాజిట్లపై వడ్డీకోత

పావుశాతం వరకూ తగ్గించిన
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు...
నోట్ల రద్దుతో భారీగా డిపాజిట్ల నమోదు ఎఫెక్ట్

న్యూఢిల్లీ: డిపాజిట్లపై వడ్డీరేట్లను రెండు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు పావుశాతం తగ్గించారుు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌లో దాదాపు రూ.4,00,000 కోట్ల డిపాజిట్ల నేపథ్యంలో ఈ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిపాజిట్ల రేటు తగ్గింపు నేపథ్యంలో వచ్చే కొద్ది రోజుల్లో రుణ రేటును కూడా తగ్గించే వీలుందన్న అంచనాలు వెలువడుతున్నారుు. తగ్గింపు డిపాజిట్ రేటును చూస్తే...

ఐసీఐసీఐ బ్యాంక్...
390 రోజుల నుంచి రెండేళ్ల మధ్య స్థిర డిపాజిట్ రేటు 0.15 శాతం తగ్గింది. ఇప్పటివరకూ ఈ రేటు 7.25 శాతం కాగా తాజాగా 7.10 శాతానికి దిగివస్తుంది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలా...
రూ.1 నుంచి రూ.5 కోట్ల మధ్య బల్క్ టెన్యూర్స్ అన్నింటిపై వడ్డీరేటు 0.25 శాతం తగ్గుతుంది. గురువారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది స్థిర డిపాజిట్ రేటు 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గుతుంది. మూడేళ్ల ఒక్కరోజు నుంచి ఐదేళ్ల మధ్య రేటు 6.75 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గుతుంది.

 ఇప్పటికే ఎస్‌బీఐ...
కొన్ని మెచ్యూరిటీపై బుధవారమే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 0.15 శాతం వరకూ డిపాజిట్ రేటును తగ్గించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత బుధవారం వరకూ ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు కూడా ఎస్‌బీఐ పేర్కొంది.  కాగా ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం నుంచి 0.20 శాతం వరకూ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement