బ్యాలెన్సా..? లేక డైనమిక్కా..? | Sakshi
Sakshi News home page

బ్యాలెన్సా..? లేక డైనమిక్కా..?

Published Mon, May 30 2016 3:06 AM

బ్యాలెన్సా..? లేక డైనమిక్కా..?

తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు
మ్యూచువల్ ఫండ్స్ వాటి ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని బట్టి విభిన్న రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకునే అగ్రసివ్ ఫండ్స్‌తో పాటు... ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయాల్సినఅవసరం లేని ఇండెక్స్ ఫండ్లూ ఉన్నాయి. ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా ఇవి ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాయి. అదే డైనమిక్, డైవర్సిఫైడ్ ఈక్విటీ వంటి అగ్రసివ్ ఫండ్స్ వ్యూహాలు మాత్రం మార్కెట్ కదలికలను బట్టి వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందిన ఇలాంటి రెండు రకాల ఫండ్స్ బ్యాలెన్స్‌డ్, డైనమిక్ ఫండ్స్ గురించి చూద్దాం.
 
మార్పులు అక్కర్లేని బ్యాలెన్స్‌డ్...
పేరుకి తగ్గట్టు ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65-70 శాతం ఈక్విటీలకు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి పోర్ట్‌ఫోలియోలో ఎప్పటికప్పుడు పెద్దగా మార్పులు చేయాల్సిన పని ఉండదు. ఈక్విటీ, డెట్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణ వ్యయం తక్కువ. కానీ ఇదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ కంటే నిర్వహణ వ్యయం ఎక్కువ. ఇక వీటి రాబడులు చూస్తే... ఈక్విటీ, డెట్ పథకాల రాబడులకు మధ్యలో ఉంటాయి.

గడిచిన ఏడాదిలో డెట్ ఫండ్స్ 11 శాతం, ఈక్విటీ ఫండ్స్ 25 నుంచి 30 శాతం రాబడినందించాయి. కానీ ఇదే సమయంలో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ 17 నుంచి 20 శాతం లాభాలనిచ్చాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో 60 శాతం పైగా ఈక్విటీలకే కేటాయిస్తారు కాబట్టి పన్ను విషయాల్లో వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే వీటిలో ఇన్వెస్ట్ చేసి ఏడాది దాటితే ఎలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. డెట్, ఈక్విటీ రెండింట్లో ఇన్వెస్ట్ చేస్తారు కనక తక్కువ రిస్క్‌తో మధ్యస్థాయిలో లాభాలను అందిస్తాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ విధానమే ఉత్తమం.
 
డైనమిక్ ఫండ్స్
వివిధ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో సహజ సిద్ధంగా ఉండే ఒడిదుడుకులను డైనమిక్ ఫండ్స్ స్వల్ప కాలానికి ఒడిసి పట్టుకుంటాయి. ఇవి తప్పనిసరిగా ఈక్విటీ, డెట్ పథకాల నుంచి మారుతుండాలి. అంటే.. ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయిస్తే నెలరోజుల్లో ఈ మొత్తాన్ని విక్రయించి డెట్ పథకాల్లోకి తప్పకుండా మార్చాలి. ఈ మార్పు అనేది ప్రతి ఫండ్ హౌస్‌కి మారుతుంటుంది. కొన్ని ఫండ్ హౌస్‌లు చాలా అగ్రసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుస్తాయి. మరికొన్ని ఇండెక్స్ ఫండ్స్‌లా చాలా నెమ్మదిగా మారుస్తాయి.

అందుకే డైనమిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు నిబంధనల ప్రకారం ఈక్విటీల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్ కంటే రాబడి తక్కువగా ఉంటుంది. కానీ తిరిగి ప్రవేశించడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే డైనమిక్ ఫండ్స్‌లో రిస్క్ అధికమే అయినా అధిక రాబడి పొందే అవకాశముంది. ఇవి దీర్ఘకాలానికి అంటే కనీసం 5 ఏళ్ల దృష్టిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిప్ విధానం కంటే మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచింది.
 
ఈ అంశాలు గుర్తుంచుకోండి...
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ పథకాలు రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తాయి.
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తక్కువ రిస్క్‌ను, తక్కువ రాబడిని కలిగి ఉంటాయి.
డైనమిక్ ఫండ్స్ పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే పూర్తిగా వైదొలగుతాయి కూడా.
డైనమిక్ ఫండ్స్‌కు అధిక రిస్క్, అధిక రాబడిని అందించే లక్షణాలున్నాయి
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో, డైనమిక్ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచిది.
- అనిల్ రెగో
సీఈవో,రైట్ హొరెజైన్స్

Advertisement
Advertisement