పొదుపా..! మీ వయసెంత? | Sakshi
Sakshi News home page

పొదుపా..! మీ వయసెంత?

Published Mon, Jul 6 2015 12:24 AM

పొదుపా..! మీ వయసెంత?

♦ వయసును బట్టి పొదుపు పద్ధతి మారాల్సిందే
♦ పెద్దయ్యేకొద్దీ ఇన్వెస్ట్‌మెంట్లలో రిస్క్ తగ్గాలి
♦ ఎంత త్వరగా పొదుపు ఆరంభిస్తే అంత బెటర్

 
 నరేష్ పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు. మంచి జీతం కావటంతో చేరిన నాటి నుంచే నెలకు రూ.5,000 పొదుపు చేయటం మొదలెట్టాడు. అందుకోసం చక్కని రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకున్నాడు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయని, దాంతో పాటే ఖర్చులూ పెరుగుతాయనే ఉద్దేశంతో పెళ్లి కాకముందే పొదుపు మొదలుపెట్టాడు. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకు నరేష్‌కు పెళ్లయింది. రెండేళ్లకు పిల్లలు. దీంతో ఖర్చులు పెరిగాయి.

ఖర్చులన్నీ తగ్గించుకుంటూ పొదుపు చేయటం సరికాదనుకున్నాడు. దీంతో పొదుపు ప్రారంభించిన ఏడేళ్లకు... ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేశాడు. కాకపోతే... అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మాత్రం ముట్టుకోలేదు. తనకు 60 ఏళ్లు వచ్చేదాకా అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లోనే వదిలేశాడు. కాకపోతే వాటిని అప్పుడప్పుడూ సమీక్షించటం, కొన్ని ఫండ్స్‌ను మార్చటం మాత్రం చేసేవాడు.

 సురేష్‌ది కూడా ఇలాంటి కథే. పాతికేళ్లకే ఉద్యోగంలో చేరాడు. స్వతహాగా విలాస పురుషుడు కావడం... ఆర్థికంగా ఎటువంటి బాదరబందీలు లేకపోవడంతో మొత్తం జీతాన్ని ఎంచక్కా ఖర్చు పెట్టేసేవాడు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, తరచూ కార్లు మార్చటం వంటివి చేసేవాడు. నరేష్ మాదిరే 30 ఏళ్లకు పెళ్లి చేసుకుని... ఆ తరవాత రెండేళ్లకు తండ్రయ్యాడు. అప్పుడు చూసుకుంటే తెలిసింది... తాను పైసా వెనకేయలేదని. పిల్లల భవిష్యత్ గుర్తుకురావటంతో 32 ఏళ్ల వయసులో  పొదుపు మొదలెట్టాడు. రిటైర్మెంట్ భయంతో నెలకు రూ.5,000 చొప్పున... 60 ఏళ్లు వచ్చేవరకూ... అంటే దాదాపు 28 ఏళ్లపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు.

 ఇద్దరూ ఇన్వెస్ట్ చేసింది నెలకు రూ.5వేలే. కాకపోతే సురేష్ 32వ ఏట నుంచి 60వ సంవత్సరం వచ్చేదాకా ప్రతినెలా ఇన్వెస్ట్ చేశాడు. నరేష్ మాత్రం 25వ ఏట నుంచి ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి మానేశాడు. మ్యూచువల్ ఫండ్స్‌పై రాబడి 14 శాతం వరకూ సగటున గిట్టుబాటయ్యే అవకాశం ఉంది. కానీ కనీసంగా ఏడాదికి ఇద్దరి పొదుపు మొత్తంపై 12 శాతం రాబడిని అంచనా వేసుకుంటే ఇద్దరికీ 60వ ఏట చేతికి ఎంత వచ్చిందో తెలుసా?

 - ఏడేళ్లలో కేవలం రూ.4.2 లక్షలు ఇన్వెస్ట్ చేసిన నరేష్‌కు 1.52 కోట్లు అందాయి.
 - 28 ఏళ్ల పాటు రూ.16.8 లక్షలు ఇన్వెస్ట్ చేసిన సురేష్‌కు మాత్రం రూ.1.2 కోట్లే వచ్చాయి.
 చిన్న వయసులో పొదుపు మొదలుపెడితే వచ్చే లాభమిది. కాంపౌండింగ్ వడ్డీ మహాత్మన్ మిది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందొకటే. ఆలస్యమయ్యేకొద్దీ ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరుగుతుంది. రాబడి తగ్గుతుంది.
 
 ఒక్కసారి 45 ఏళ్లు దాటాయంటే దృష్టంతా రిటైర్మెంట్ మీదకి మళ్లుతుంది. ఆదాయం ఆగిపోయాక ఇదే విధమైన జీవితాన్ని కొనసాగించగలమా? అన్న ప్రశ్న వెంటాడుతుంటుంది. ఈ సమయంలోనే పిల్లలకు ఉన్నత చదువులు, పెళ్లి వంటి భారీ ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రిస్క్ సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. కానీ భారీ అవసరాల దృష్ట్యా కొంత మేర రిస్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే రిస్క్ ఉండే ఈక్విటీ పథకాలకు గరిష్టంగా 40% మించకుండా చూసుకోండి.
 
 రిటైరయ్యాక సంపాదన ఉండదు. పెన్షన్‌తోనే జీవితాన్ని కొనసాగించాలి. వీరికి ప్రతి రూపాయి చాలా విలువైనది. అసలు రిస్క్ చేయలేరు. సంపాదిస్తున్న కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని కూడా రిస్క్‌లేని పథకాల్లోకి మార్చుకోవాలి. కాకపోతే భవిష్యత్తులో పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే కొంత మొత్తం ఈక్విటీలకు కేటాయించాల్సి వస్తుంది. అందుకే పోర్ట్‌ఫోలియోలో కనీసం 20 శాతం ఈక్విటీలకు కేటాయించడం ద్వారా ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించొచ్చు.
 
 ముందే మొదలుపెడితే మేలు
 అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు అంతగా ఆర్థిక ఇబ్బందులుండవు. వారి సంపాదనలో అధిక భాగం విలాసాలకే కేటాయిస్తారు. పొదుపు ఆలోచనే ఉండదు. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. పొదుపు అవసరాలు తెలుస్తాయి. 50ల్లోకి రాగానే భవిష్యత్తుపై ఆందోళన మొదలవుతుంది. ఇలా వయసును బట్టి ఆర్థిక అవసరాలు మారుతాయి. దానికి అనుగుణంగానే పొదుపు-మదుపులో మార్పులు చేసుకోవాలి. పొదుపు సామర్థ్యం అనేది వారి రిస్క్‌ను బట్టి మారుతుంటుంది. అందుకే వయసును బట్టి పోర్ట్‌ఫోలియోను మార్చుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 
 ఈ వయసు వారు అప్పుడే ఉద్యోగంలో చేరి ఉంటారు. చాలామందికి పెళ్లి కూడా అయి ఉండదు కనక ఖర్చులు తక్కువే. భవిష్యత్తు కోసం సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టాల్సింది ఇప్పుడే. ఈ వయసులో ఏటా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంటుంది. అలాగే వీరి రిస్కు సామర్థ్యమూ ఎక్కువే. మున్ముందు పెళ్లి, పిల్లలు, సొంతిల్లు వంటి ఆర్థిక అవసరాలుంటాయి కనక వీటికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వయసు వారు వారి రిస్క్ సామర్థ్యాన్ని బట్టి సాధ్యమైనంత వరకు అధిక మొత్తం ఈక్విటీలకు కేటాయించేలా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకుంటే బాగుంటుంది.
 
 ఎంత జీతం ఉన్నా సరిపోని విధంగా వీరికి ఖర్చులు చాలా ఎక్కువ. పెళ్లయిన తర్వాత ఇంటికి సామాన్లు సమకూర్చుకోవడం, పిల్లల చదువులు, గృహ, వాహన ఈఎంఐలు ఇలా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి కనక రిస్క్ సామర్థ్యమూ తగ్గుతుంది. అందుకే ఈక్విటీలకు కొద్దిగా తగ్గించుకొని ఆ మొత్తాన్ని స్థిరాదాయానికి ఇచ్చే వాటికి కేటాయిస్తే సరిపోతుంది.

Advertisement
Advertisement