Sakshi News home page

నిఫ్టీ కొత్త రికార్డు

Published Wed, Aug 2 2017 1:32 AM

నిఫ్టీ కొత్త రికార్డు - Sakshi

మరికాస్త దూరంలో సెన్సెక్స్‌
ఆర్‌బీఐ పాలసీవైపు చూపు


ముంబై: ఒకవైపు కార్పొరేట్‌ ఫలితాలు ప్రోత్సాహాన్ని అందిస్తుండగా, మరోవైపు ఆటోమొబైల్‌ అమ్మకాలు మెరుగ్గావున్నట్లు గణాంకాలు వెలువడటంతో వరుసగా రెండోరోజు మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో కొత్త రికార్డులు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ జూలై 27 నాటి 10,115 పాయింట్ల గరిష్టస్థాయిని దాటి...10,128.60 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయిని చేరి రికార్డు సృష్టించింది. చివరకు 37.55 పాయింట్ల లాభంతో 10,114.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీకి రికార్డు ముగింపు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 32,632 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత..చివరకు 60 పాయింట్ల లాభం 32,575 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో జూలై 27నాటి 32,672 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్‌ ఇంకా అధిగమించనప్పటికీ, ఈ స్థాయి వద్ద సూచీ ముగియడం ఇదే ప్రధమం. రిజర్వుబ్యాంక్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగురూకత వహించడంతో మార్కెట్‌ లాభాలు పరిమితంగా వున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఆటోమొబైల్‌ కంపెనీల జూలై నెల అమ్మకాలు మార్కెట్‌ అంచనాల్ని మించడం, కొన్ని బ్లూచిప్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండటంతో సూచీలు పెరిగాయని ఆయన వివరించారు.

ఆటో కంపెనీల జోరు...
జూలై అమ్మకాల గణాంకాలతో ఆటోమొబైల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. 21 శాతం అమ్మకాలు పెంచుకున్న మారుతి సుజుకి 1.35 శాతం పెరిగి రికార్డు గరిష్టస్థాయి రూ. 7,855 వద్ద ముగిసింది. నిఫ్టీలో భాగమైన ఐషర్‌ మోటార్స్‌ 4 శాతంపైగా పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ. 31,505 వద్ద క్లోజయ్యింది. మహింద్రా, హీరో మోటో కార్ప్‌లు 1–2 శాతం మధ్య ఎగిసాయి. ఇతర రంగాల షేర్లలో విప్రో, హెచ్‌యూఎల్, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్, కోల్‌ ఇండియాలు 1–2 శాతం మధ్య ర్యాలీ సాగించాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్, అంబూజా సిమెంట్‌ షేర్లు 1–2 శాతం మధ్య క్షీణించాయి.

Advertisement

What’s your opinion

Advertisement