Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Published Fri, Jul 20 2018 3:57 AM

8 Naxalites killed in Chhattisgarh encounter - Sakshi

చర్ల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.  కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు నక్సలైట్లు  పారిపోయినట్టు తెలుస్తోంది. వారికోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. బైలాడిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో దండకారణ్య సబ్‌ జోనల్‌ హెడ్‌ గణేష్‌ ఉయికే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే సమాచారం మేరకు సుమారు 200 మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, డీఎఫ్‌ బలగాలకు చెందిన జవాన్లు రెండ్రోజుల క్రితం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది బృందాలుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జవాన్లకు దంతెవాడ, బీజాపూర్‌ సరిహద్దుల్లోని తీమ్‌నార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం 6 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.  ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌) పి.సుందర్‌రాజ్‌ తెలిపారు. ఘటనాస్థలం నుంచి రెండు ఇన్‌సాస్‌ రైఫిళ్లు, రెండు .303 రైఫిళ్లతో సహా 12 బోర్‌ గన్స్, మరికొన్ని మజిల్‌ లోడింగ్‌ గన్స్‌ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ సంఘటన నుంచి సబ్‌ జోనల్‌ హెడ్‌ గణేశ్‌ వుయికే తప్పించుకున్నట్లుగా తెలుస్తోందని బస్తర్‌ ఐజీ వివేకానంద్‌ సిన్హా తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించి గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement