Sakshi News home page

బెజవాడ.. గజ గజలాడ!

Published Mon, Jun 17 2019 10:34 AM

Police Department Failed to Controle Non Functional Activities Vijayawada - Sakshi

బెజవాడ నేరాలకు అడ్డాగా మారుతోంది. రౌడీలు.. కేడీలు కాలరెగరేస్తున్నారు. పోలీసుల నిఘా నిద్రలోకి జారుకుంది. పోలీసులు పట్టుకోల్పోవడంతో అరాచక శక్తులు హడలెత్తిస్తున్నాయి. నగరంలో సామాన్య ప్రజలు నిర్భయంగా రాత్రి వేళలో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. బ్లేడ్‌బ్యాచ్‌ ఘోరాలు.. రౌడీ బ్యాచ్‌ల గ్యాంగ్‌వార్‌లతో విజయవాడ నగరం మౌనంగా శోకిస్తోంది. పోలీసుల ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తోంది.                 

సాక్షి, విజయవాడ : బెజవాడలో ఘరానా నేరాలు విస్తరిస్తున్నాయి. బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు.. చివరకు హత్యలు చేసేస్థాయికి చేరుకున్నాయి. పక్కా ప్రణాళికలతో కొందరు రౌడీషీటర్లు తమ ప్రత్యర్థులను హతమారుస్తుండగా.. పోలీసులు మాత్రం వ్యక్తిగత కక్షలే అంటూ సాధారణంగా తీసుకుంటున్నారు. రాజధాని విజయవాడలో అసాంఘిక శక్తుల అధికారిక చిట్టా ప్రకారం.. నగరంలో నలుగురు నగర బహిష్కృతులు.. 443 మంది రౌడీషీటర్లు.. 30 మంది కేడీలు..  70 మంది బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు ఉన్నారు.

అనధికారికంగా ఇంకా చాలా మందే ఉన్నారు. ఇంతమంది నేరచరితులు ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ విజయవాడలో అదే కొరవడుతోంది.  పోలీసు వ్యవస్థ ఉదాసీనతతో శనివారం అర్ధరాత్రి టూటౌన్‌ ప్రాంతంలో రౌడీషీటర్‌ సురేష్‌ను అతడి ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. విజయవాడలోని 20 పోలీస్‌ ఠాణాల పరిధుల్లో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి? రౌడీషీటర్లలో ఎవరెవరు అల్లర్లు సష్టిస్తున్నారు? కొత్తగా ఎవరైనా నేరాలకు పాల్పడుతున్నారా? అన్న అంశాలపై పోలీసులు లోతుగా పరిశోధించకపోవడంతో రౌడీషీటర్లు, వారి అనుచరుల ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

బహిష్కృతులు నలుగురూ నగరంలోనే.. 
బహిష్కృతులైన నలుగురు నేరస్తులు నగరంలోనే దర్జాగా తిరుగుతున్నా పట్టించుకునేంత తీరిక పోలీసులకు లేకుండాపోయింది. అందుకు ఉదాహరణే ఖల్‌ నాయక్‌ ఉదంతం. ఖల్‌ నాయక్‌తో పాటు కోతల శివ, ముక్కల రవి, ముక్కల కోటేశ్వరరావు అనే నలుగురికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. నగర బహిష్కరణకు గురైన వారు నిజంగానే నగరాన్ని విడిచి వెళ్లారా? అనధికారికంగా నగరంలోనే ఉంటున్నారా? అనే కోణంలో పోలీసులు నిఘా వేసి ఉంచాలి. కానీ నగర పోలీసులు కీలకమైన ఆ విషయన్నే గాలికి వదిలేశారు. నగర బహిష్కృతుడిగా ఉన్న ఖల్‌ నాయక్‌ నగరంలోనే దర్జాగా కార్యకలాపాలు సాగించాడు. 2017లో అతడిపై నాలుగు కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం ఫలితం ఖల్‌ నాయక్‌ చేతిలో ఒకరు హత్యకు గురయ్యారు. అప్పుడుగానీ పోలీసులు మేల్కొనలేదు.   

రౌడీషీటర్లపై నిఘా ఏదీ? 
ఎక్కడాలేని రీతిలో విజయవాడలో 443 మంది రౌడీషీటర్లు, 30 మంది వరకు కేడీలు ఉన్నారు. నిబంధనల ప్రకారం రౌడీషీటర్లు నియమిత కాలవ్యవధి ప్రకారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలి. పోలీసు అధికారులు రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్‌ చేస్తుండాలి. తద్వారా వారి ప్రవర్తన, కదలికలపై తాము ఓ కన్నేసి ఉంచామనేది స్పష్టం చేస్తుండాలి. రెండేళ్లుగా నగరంలో రౌడీషీటర్ల వ్యవహారాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడమే లేదు. 

బెంబేలెత్తిస్తున్న బ్లేడ్‌బ్యాచ్‌..
విజయవాడలో దాదాపు 70 మంది బ్లేడ్‌బ్యాచ్‌ ముఠా సభ్యులు ఉన్నారు. వారు తమదైన శైలిలో దొంగతనాలు చేస్తూ అవసరమైతే దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న కేసులు, గ్యాంగ్‌వార్‌ కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. అవన్నీ బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలేనని స్పష్టమవుతున్నా పోలీసులు మాత్రం కఠిన చర్యలు చేపట్టనే లేదు. ఈ ఏడాది సాక్షాత్తూ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం ఎదురుగానే నలుగురు బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ఒకరిపై ఒకరు బ్లేడ్లతో దారుణంగా దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ రహదారిపై వెళ్తున్న సామాన్య ప్రజలు భయంతో హడలిపోయారు. ఆ ఘటనలో శనివారం మృతి చెందిన రౌడీషీటర్‌ సురేష్‌ ఉండటం గమనార్హం.  

బైండోవర్లు అంతంతే..   
విజయవాడ నగర కమిషనరేట్‌లోని నాలుగు జోన్లలో టూటౌన్, నున్న పోలీసుస్టేషన్ల పరిధిలోనే రౌడీషీటర్లు ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా వీరు దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. రౌడీషీటర్లు, కేడీలు, ఇతర అసాంఘిక శక్తుల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు వారితో సన్నిహితంగా ఉంటూ సెటిల్‌మెంట్లు, దందాల్లో భాగస్వాములు అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఖల్‌ నాయక్‌ ఉదంతం. అతడి ఆగడాలపై బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా సింగ్‌నగర్‌ పోలీసులు పట్టించుకోలేదు.

ఓ వ్యక్తి హత్య తరువాతే ఉన్నతాధికారులు మేల్కొని అప్పట్లో సింగ్‌నగర్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఒక్క సింగ్‌ నగరే కాదు.. నగరంలో సగానికిపైగా పోలీస్‌ స్టేషన్లలో పరిస్థితి అలానే ఉంది. ఎన్నికలు, ఇతర పండుగలప్పుడు శాంతిభద్రతల కోణంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్లను బైండోవర్‌ చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం కూడా ఓ తంతుగా కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్లను బైండోవర్‌ చేశారు. ఎన్నికల పోలింగ్‌ (11–4–19) ముగిసిన మూడు నెలల్లోనే రౌడీషీటర్లు గ్యాంగ్‌వార్‌ మొదలు పెట్టారంటే పోలీస్‌ అంటే వారికి ఏమాత్రం భయం లేదని అర్థమవుతోంది.   

Advertisement

What’s your opinion

Advertisement