Sakshi News home page

రిటైర్డ్ జడ్జితో విచారణ

Published Thu, Dec 17 2015 2:26 AM

రిటైర్డ్ జడ్జితో విచారణ - Sakshi

‘కాల్‌మనీ’పై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
♦ ఫైనాన్స్ సంస్థల నిరోధానికి మనీల్యాండరింగ్ చట్టం
♦ ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతి
♦ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులు
♦ ‘స్విస్ చాలెంజ్’కు అనుకూలంగా లీజు విధానం మార్చుతూ
♦ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు
♦ అంగన్‌వాడీలకు జీతాల పెంపుపై పునఃపరిశీలన!
 
 సాక్షి, విజయవాడ బ్యూరో:  అన్ని వైపులనుంచి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో విజయవాడ కాల్‌మనీ ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జికి ఈ బాధ్యత అప్పగించాలని బుధవారమిక్కడ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై పోలీసు విచారణ, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, విజయవాడ పోలీసు కమిషనర్లను కేబినెట్ ఆదేశించింది.రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘట నలు ఇకపై జరగకుండా నిరోధించేందుకు, ఫైనాన్షియర్ల ఆగడాల్ని అరికట్టేందుకు మనీల్యాండరింగ్ చట్టాన్ని తేవాలని తీర్మానించింది.

గురువారం నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు.

 ఇతర కీలక నిర్ణయాలివీ..
► రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయం. దేశంలోని టాప్-20, విదేశాల్లోని టాప్-15 వర్సిటీల్ని రాష్ట్రంలో తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆహ్వానించాలని తీర్మానం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు.
► స్విస్ చాలెంజ్ విధానానికి అనుకూలంగా లీజు విధానాన్ని మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చాలని నిర్ణయం. 33 ఏళ్ల లీజు స్థానంలో 99 ఏళ్లు లేదా సంబంధిత భూమిని అమ్మకానికి అనుమతివ్వాలని కేబినెట్ నిర్ణయం. ఈ బిల్లునూ ఈ సమావేశాల్లోనే  ఆమోదింపజేయాలని తీర్మానం.
► చక్కెర కర్మాగారాలపై వ్యాట్, సీఎస్‌టీని ఎత్తివేసేందుకు వీలుగా వాణిజ్య పన్నులశాఖ చట్టంలో మార్పులు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం.

 ప్రస్తుతం మనీల్యాండరింగ్ చట్టం ఉందో లేదో తెలియదు: యనమల
 మంత్రివర్గ సమావేశ వివరాల్ని యనమల రామకృష్ణుడు వివరిస్తూ.. ప్రస్తుతం తెలంగాణలో మనీల్యాండరింగ్ చట్టం ఉందని, మన రాష్ట్రంలో ఉందో, లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఈ చట్టంకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని, అది ఏమైందో తెలియలేదన్నారు. దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో అడ్డగోలు ఫైనాన్స్ వ్యవహారాల్ని అరికట్టేందుకు మనీల్యాండరింగ్ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో కాల్‌మనీతోపాటు సెక్స్‌స్కాండల్ కూడా ఉందని, ఇటువంటి తప్పుడు వ్యవస్థలను నిరోధించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.

విజయవాడ కాల్-సెక్స్‌మనీ వ్యవహారంలో నిందితులు ఎంతపెద్ద స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తోపాటు ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, అందరిపైనా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. బాధితులకు న్యాయం చేసి, పీడించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాల్ని మంత్రివర్గం ఇచ్చిందన్నారు. కాల్‌మనీ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామన్నారు. త్వరలో న్యాయవిచారణ కమిటీ ఏర్పాటవుతుందన్నారు.

 ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లకు చెల్లు..
 మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుతో రాష్ట్రంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రమాణాలు, అర్హతలేని వర్సిటీల ఏర్పాటుకు అవకాశం లేనివిధంగా బిల్లును రూపొందించామన్నారు. ఏర్పాటుచేసే ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్లను వాటి యాజమాన్యాలే చేసుకుంటాయని, కాబట్టి రిజర్వేషన్ల అమలు ఇక్కడ వర్తించదని స్పష్టం చేశారు. ఈ సంస్థల్లో అడ్మిషన్లు పొం దిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు వర్సిటీలవల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, వాటిల్లో ఖాళీల్ని భర్తీచేసి మౌలిక సదుపాయాల్ని కల్పించి పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
 
 అంగన్‌వాడీలకు షాక్!
 తమ జీతాల పెంపు జీవోపై రాష్ట్ర మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న అంగన్‌వాడీల ఆశలు వమ్మయ్యాయి. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంగన్‌వాడీలకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. వారి జీతాల పెంపుపై పునఃపరిశీలన చేయాలని నిర్ణయించింది. జీతాలు పెంచాలని గతంలో నిర్ణయించినప్పటికీ దీనికి కేంద్రప్రభుత్వమిచ్చే వాటా 30 శాతం మేరకు తగ్గిపోయిన నేపథ్యంలో ఏంచేయాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యత అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు మూడు కేటగిరీలుగా జీతాలు పెంచాలని గతంలో నిర్ణయించామని, ఇందుకు రూ.329 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో నిర్ధారించామని చెప్పారు.

అంగన్‌వాడీలకోసం ఖర్చుచేసే నిధుల్లో మొన్నటివరకూ 90 శాతాన్ని కేంద్రం, పదిశాతాన్ని రాష్ట్రప్రభుత్వం భరించేవన్నారు. అయితే కేంద్రంలో నీతి ఆయోగ్ ఏర్పడ్డాక ఈ ఖర్చులో 60 శాతాన్ని కేంద్రం, 40 శాతాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాలని నిర్ణయించారని, దీనివల్ల రాష్ట్రప్రభుత్వంపై అదనంగా 30 శాతం భారం పడిందన్నారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినప్పుడు రూ.329 కోట్లు ఖర్చవుతుందని భావించగా ఇప్పుడది రూ.1,200 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ భారాన్ని రాష్ట్రప్రభుత్వం మోసే పరిస్థితిలో లేదని, అందుకే ఈ మొత్తం వ్యవహారంపై పునఃపరిశీలన జరపాలని దీనిపై ఏర్పడిన కేబినెట్ ఉపసంఘానికి మంత్రివర్గం సూచించిందని ఆయన తెలిపారు. ఉపసంఘమిచ్చే నివేదికను బట్టి దీనిపై ఏంచేయాలో నిర్ణయిస్తామన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement