అమ్మ కావాలి..! | Sakshi
Sakshi News home page

అమ్మ కావాలి..!

Published Tue, May 23 2017 3:02 PM

అమ్మ కావాలి..!

► భార్య ఆచూకీ తెలియక వేదనతో తనువు చాలించిన భర్త
►నానమ్మ, తాతయ్యల వద్ద తలదాచుకుంటున్న చిన్నారులు
►ప్రస్తుతం మంచానికే పరిమితమైన తాతయ్య
►పిల్లల భారంతో అర ఎకరా పొలాన్ని అమ్మి పోషిస్తున్న నానమ్మ
►ఆచూకీ తెలుపాలని పోలీసుస్టేషన్ కు వెళ్లినా పట్టించుకోని వైనం
►అమ్మతో మాట్లాడించండి..లేదా ఆచూకీ తెలపండి....
►కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న నానమ్మ, చిన్నారులు



కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని కువైట్‌కు వెళ్లింది తల్లి..  దాదాపు 18 నెలల క్రితం వెళ్లిన ఆమె నుంచి ఇప్పటివరకు ఎలా ఉందో సమాచారం లేదు.. నలుగురు పిల్లలను, భర్తను, కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఆమె ఆ తర్వాత కనిపించడం లేదు. ఏమైందో తెలియని పరిస్థితి. అసలు బతికి ఉందో లేదో కూడా తెలియడం లేదు. కువైట్‌కు పంపిన ఏజెంటును అడిగితే సరైన సమాధానం లేదు. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మ కావాలంటూ రెండేళ్ల నుంచి కన్నీరు పెడుతూనే ఉన్నారు.  అదే మనోవేదనతో అనారోగ్యం పాలై భర్త  రెండు నెలల క్రితం కన్నుమూశాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు చిన్నారులను పోషించడం నానమ్మ, తాతయ్యకు రోజురోజుకు కష్టతరంగా మారుతోంది. అయినా మనవళ్లు, మనవరాళ్లను అల్లారుముద్దుగా పెంచుకుంటూనే తల్లి ఆచూకీ కోసం కనిపించిన అందరినీ అడుగుతూ ప్రాధేయపడుతోంది. అధికారులను కలిసినా.. చివరికి పోలీసు స్టేషన్  మెట్లెక్కినా ఎవరూ కనికరించలేదు. ఈ నేపథ్యంలో చిన్నారులు ‘‘ మాకు అమ్మ కావాలి’’ అంటూ కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు.

కడప :   గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతి రెండేళ్ల క్రితం కుటుంబ పోషణ కోసం కువైట్‌కు వెళ్లింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంటు ఆమెను కువైట్‌కు పంపాడు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెలలు గడిచినా పార్వతి నుంచి ఫోన్ కాల్‌ లేదు...సమాచారం లేదు.....అసలు ఉందో, లేదో తెలియని పరిస్థితి. ఏజెంటును అడిగితే పంపించామని, మాకు తెలియదని సమాధానం చెబుతున్నట్లు పార్వతమ్మ అత్త రామసుబ్బమ్మ పేర్కొంటోంది.

చివరకు గాలివీడు పోలీసుస్టేషన్ లో కూడా ఆరు నెలల క్రితమే రెండుమార్లు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ న్యాయం చేసేటోళ్లు లేక అవస్థలు పడుతున్నామంటూ చిన్నారులతో సహా నానమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్నిచోట్ల తిరుగుతూ అమ్మను పిలిపించండం టూ పిల్లలు వేడుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది.


తనవు చాలించిన నాగేంద్ర
పార్వతమ్మ రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లడం, తర్వాత సమాచారం లేకపోవడంతో భర్త రెడ్డి నాగేంద్ర కుంగిపో యాడు. కువైట్‌కు వెళ్లిన భార్య డబ్బు పంపకపోవడం...నలుగురు పిల్లలతోపాటు కుటుంబాన్ని పోషించడం గగనంగా మారి మనోవేదనతో ఇటీవలే నాగేంద్ర మంచం పట్టి మృతి చెందాడు. దీంతో భారమంతా నాన్నమ్మ రామసుబ్బమ్మ, తాతయ్య (అబ్బ) వెంకట రమణప్పనాయుడులపై పడింది. అయితే ఇటీవలే తాత కూడా అనారోగ్యంతో మంచం పట్టడంతో ఇక కష్టాలన్నీ నానమ్మపైనే పడ్డాయి.

చిన్నారుల వేదన
ఒకవైపు తల్లి కనిపించకపోవడం.. మరోవైపు ఇటీవలే తండ్రి మరణించడంతో చిన్నారుల వేదన అంతా ఇంతా కాదు. ఆలనా పాలనా చూడాల్సిన తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ఆ భారమంతా నాగేంద్ర తల్లిదండ్రులపైనే పడింది. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి మరణంతో తల్లి కోసం ఎక్కని గడప లేదు. అనుక్షణం  అమ్మ కావాలంటూ వారు ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికే నానమ్మ ఉన్న అర ఎకరా పొలాన్ని రూ. 50 వేలకు అమ్మి పిల్లల ఆలనా, పాలన చూస్తోంది. అనాథలుగా మిగిలిన ఆ పిల్లలను ఆదుకునే వారే లేరు. అయినవారో, కానివారో అంతో ఇంతో ఇస్తే వారిని ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఇప్పుడు నానమ్మే వారి ఆలనా, పాలన చూస్తోంది.

మిస్టరీగా మారిన అదృశ్యం
కుటుంబ అవసరాల నిమిత్తం కువైట్‌కని బయలుదేరిన పార్వతమ్మ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. కువైట్‌కు వెళ్లే వరకు బాగానే ఉన్నా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదు. వీసా సమస్యలతో జైలు పాలైందా? లేక అక్కడి యజమాని ఆమెను నిర్బంధించాడా? లేక ఏమైనా సమస్యలతో సమాచారం లేకుండా పోయిందా? అన్న దానిపై కువైట్‌కు పంపిన ఏజెంటును ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. పోలీసులు, ఇమిగ్రేష¯ŒS అ«ధికారులు స్పందిస్తే  ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్వతమ్మ ఎక్కడుంది? ఎవరి వద్ద పనిచేస్తుందన్న సమాచారం తెలుసుకుంటే ఆచూకీ లభిస్తుందని నాగేంద్ర బంధువులు పేర్కొంటున్నారు.

అమ్మ కోసం కలెక్టర్‌ను కలిసిన చిన్నారులు
గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నానమ్మ రామసుబ్బమ్మతో కలిసి చిన్నారులు వనజ (10), రెడ్డి నాగశంకర్‌నాయుడు (9), శైలజ (6), సునీల్‌కుమార్‌నాయుడు (3) లు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమ్మ ఆచూకీ తెలుపాలని..చూడాలని ఉందని కలెక్టర్‌కు వారు వివరించారు. అమ్మ గురించి ఎక్కడ...ఎవరిని అడిగినా సమాచారం చెప్పడం లేదని.. కనీసం మీరైనా స్పందిస్తే తమకు న్యాయం జరుగుతుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
Advertisement