Sakshi News home page

ప్రసవానికి వెళ్తే గెంటేశారు...

Published Tue, Aug 23 2016 8:07 PM

government hospital employees cruel mentality in nizamabad

పసిబిడ్డతో వచ్చి ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఇందూరు: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల తీరును నిరసిస్తూ పచ్చి బాలింత కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ప్రసవానికి వెళ్తే వెనక్కి పంపించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన నిషాత్ పర్వీన్ (సబియా)కు నెలల నిండడంతో సోమవారం అర్ధరాత్రి తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రి మెట్లు ఎక్కుతుండగానే సిబ్బంది, నర్సులు డెలివరీ చేయబోమని స్పష్టం చేశారు.  ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసి.. బయటకు పంపేశారు.

గర్భిణి తల్లి బిస్మిల్లా షేక్ సిబ్బందిని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని గత్యంతరం లేక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పసిబిడ్డ, బాలింతతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.

కార్యాలయంలోఅధికారులు ఎవరూ లేనందున కలెక్టర్ సీసీ సూచన మేరకు డీఆర్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేసి వెళ్లారు. ప్రవసం చేయకుండా తిప్పి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement