Sakshi News home page

అమ్మో.. జూన్‌

Published Fri, Jun 9 2017 1:10 AM

అమ్మో.. జూన్‌ - Sakshi

ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు
జీవో నం.1కి తూట్లు
అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం
పట్టించుకోని విద్యాశాఖ
పేదలకు భారమవుతున్న విద్య

ఆదిలాబాద్‌టౌన్‌: పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు సర్వస్వం ధార పోస్తున్నారు. ఎంత ఖర్చుయినా తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో నిలపాలని ఆశిస్తున్నారు. వారి ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల యాజమన్యాలు ‘క్యాష్‌’ చేసుకుంటున్నాయి. వేలాది రూపాయలు ఫీజుల పేరిట వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ, ఈ టెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, ఐఐటీ, ఈ టెక్నో, గ్రామర్‌ అంటూ కొత్త పేర్లు స్కూళ్లకు తగిలించి ఫీజులు, డొనేషన్ల పేరిట అందినంతా దండుకుంటున్నారు.

ఫలితంగా పాఠశాల విద్య పోషకులకు భారంగా మారుతోంది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో అందరిలో ఫీజుల భయం మొదలైంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం జారీ చేసిన జీవో నంబర్‌ 1 అటకెక్కింది. జీవో అమలుకు ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్‌ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో అనుకూలమైన పేరెంట్స్‌ను సభ్యులుగా నియామించుకుని ఫీ‘జులుం’ చేస్తున్న పాఠశాలలే అత్యధికం.

ఫీ‘జులుం’..
పదేళ్ల క్రితం జిల్లాలో ఒకటి, రెండు మాత్రమే కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఉండగా ప్రస్తుతం వీధికొకటి వెలిసాయి. జిల్లా కేంద్రంలో కార్పొరేట్‌ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.21 వేలు వసూలు చేస్తుండడం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10 వేలు ఖర్చువుతుంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్‌ అండ్‌ హాస్టల్‌కు రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ముట్టజెప్పాల్సిందే. వీటితోపాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు రూ.20 వేలు అదనం. స్థానికంగా పేరుగాంచిన పాఠశాలల్లో ఫీజుల వివరాలు వింటే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

దీనికి తోడు కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు ఐఐటీ, ఈ టెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్, డిజిటల్‌ అంటూ కొత్త కొత్త పేర్లు తగిలించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. ఇక అడ్మిషన్‌ ఫీజు పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. తరగతి ఆధారంగా అడ్మిషన్‌ ఫీజు రూ.4వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫీజు అంశాన్ని పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనిని డీఈవో దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది.

కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 90 శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్‌ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. కనీస వసతులైన తాగునీరు, విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలోనూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయి. అర్హులైన బీఈడీ, డీఎడ్‌ చదివిన ఉపాధ్యాయులను నియామించాల్సి ఉన్నా.. చాలా పాఠశాలల్లో వీరి జాడ లేదు. అర్హతలు లేనివారితో బోధన చేయించి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు.

విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది..
► ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు.
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు.
అర్హత కలిగిన టీచర్లచే విద్యాబోధన చేపట్టాలి.
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌(పైవేటు పాఠశాలలు) పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, బడి నుంచి తీసేయడం నిషేధం. బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి.


సర్కార్‌ బడుల్లో చేర్పించండి
తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్‌ బడుల్లో చేర్పించాలి. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్‌ ఫీజు తీసుకోవద్దు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
కె.లింగయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement

What’s your opinion

Advertisement