రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తెస్తే..బీజేపీకే ఓటు వేస్తా | Sakshi
Sakshi News home page

రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తెస్తే..బీజేపీకే ఓటు వేస్తా

Published Tue, Jan 5 2016 7:29 AM

రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తెస్తే..బీజేపీకే ఓటు వేస్తా - Sakshi

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలకు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత సవాల్
 
 హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొస్తే వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాను బీజేపీకే ఓటు వేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని సాగర్ సొసైటీ చౌరస్తాలో ఖైరతాబాద్ నియోజక వర్గం జీహెచ్‌ఎంసీ ఎన్నికల శంఖారావంతో పాటు మహిళా గర్జన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి కవిత మాట్లాడుతూ రూ.వేలాది కోట్లను కేంద్రం నుంచి తెస్తున్నామని కేంద్రమంత్రి దత్తన్నతోపాటు కిషన్‌రెడ్డి కూడా అంటున్నారని మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు.

జీవో 59 కింద కొంత మందికి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని వారు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని ఆ జీవో కిందనే పట్టాలు ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదే నియోజక వర్గంలో ఉంటున్న తాను  అందరికీ చెల్లిగా అండగా ఉంటానన్నారు. సంపన్నులు, పేదలు సమాన సంఖ్యలో ఉన్న ప్రత్యేక నియోజక వర్గం ఖైరతాబాద్ అని అన్నారు. గత సర్కార్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.

కొంత మంది హైటెక్ సిటీ కట్టించామని గొప్పలు చెప్పుకుంటారని అయితే ఆ చుట్టుపక్కల నీళ్లు, డ్రెయినేజీ, రోడ్ల సమస్య గాలికి వదిలేశారని ఇప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యతను తాము తీసుకున్నట్లు తెలిపారు. గ్రేటర్‌లో ఆంధ్రోళ్లైనా, గుజరాతీలైనా, బిహారీలైనా అందరినీ తమ ప్రభుత్వం సమానంగా చూస్తోందనీ ఎవరిని వెళ్లగొట్టడం లేదన్నారు. గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో గోవర్దన్‌రెడ్డి, పి. విజయారెడ్డిల మధ్య మనస్పర్థలు ఉన్నాయని వాటిని పక్కనబెట్టి కార్పొరేటర్లందరినీ గెలిపించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్దన్‌రెడ్డి, పి. విజయారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement