Sakshi News home page

పారిశ్రామిక పెట్టుబడుల బాధ్యత ‘ప్రైవేటు’కు

Published Wed, Oct 21 2015 3:17 AM

పారిశ్రామిక పెట్టుబడుల బాధ్యత ‘ప్రైవేటు’కు - Sakshi

♦ రీజినల్ డెస్కుల నిర్వహణ అప్పగించే యోచన
♦ మార్గదర్శకాల ఖరారు తర్వాత ఏజెన్సీల ఎంపిక
♦ ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీలకు ప్రచార బాధ్యతలు
 
 సాక్షి, హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) ద్వారా పెట్టుబడులను రాబట్టే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే టీఎస్ ఐపాస్‌ను విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు వీలుగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా విదేశాల్లో ఏర్పాటు చేయ తలపెట్టిన కంట్రీ/రీజినల్ డెస్కుల నిర్వహణ బాధ్యత కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేసి, సంస్థల ఎంపికపై దృష్టి సారిస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తేనే సత్వర అభివృద్ధి, ఉపాధి కల్పన సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన అనంతరం విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు రీజినల్/కంట్రీ డెస్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా వున్న దేశాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి గ్రూపులో చైనా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, రెండో గ్రూపులో కెనెడా, మెక్సికో, పశ్చిమ దేశాలు, మూడో గ్రూపులో భారత్, గల్ఫ్ దేశాలు వున్నాయి. ఒక్కో గ్రూపులోని దేశాల్లో టీఎస్‌ఐపాస్‌పై విస్తృత ప్రచారం చేయడం, ఆయా దేశాల్లోని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు.

విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఏర్పాటయ్యే కార్యాలయాల నిర్వహణ బాధ్యతను పరిశ్రమల శాఖ అధికారులకే అప్పగిస్తారని తొలుత భావించారు. కానీప్రస్తుతం ప్రైవేటు సంస్థలకు కార్యాలయాల నిర్వహణ అప్పగించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అయితే ప్రైవేటు కన్సల్టెన్సీల ఎంపిక ఎలా చేయాలనే అంశంపై పూరిత స్పష్టత వచ్చిన తర్వాత బిడ్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

 ప్రచార బాధ్యత కూడా ప్రైవేటుకే..!
 నూతన పారిశ్రామిక విధానం అమల్లో భాగంగా అందులోని అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రోచర్లు, సీడీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారానికి సంబంధించిన ప్రకటనల రూపకల్పన తదితరాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. రోడ్‌షోలు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు, పారిశ్రామిక వర్గాలతో సదస్సులు, సమావేశాలు తదితరాల నిర్వహణ బాధ్యత కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమాలకు అయ్యే వ్యయాన్ని టీఎస్‌ఐఐసీ భరిస్తుంది. ఈ నేపథ్యంలో మీడియా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుంచి త్వరలో కొటేషన్లు, బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించారు.

ప్రైవేటు ఏజెన్సీల ఎంపిక బాధ్యతను పరిశ్రమల శాఖ కమిషనర్ చైర్మన్‌గా, అదనపు డెరైక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే కమిటీకి అప్పగించారు. అయితే పెట్టుబడులు, ప్రచార బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ యోచనపై పరిశ్రమల శాఖలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యయం తో విదేశాల్లో కార్యాలయాలు నిర్వహించే సంస్థలు స్వలాభం కోసం ఇతర రాష్ట్రాలతో కూడా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని పెట్టుబడులు మళ్లించే అవకాశముంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement