Sakshi News home page

సబ్‌ ట్రెజరీల్లో రేషనలైజేషన్‌

Published Thu, May 18 2017 11:14 PM

సబ్‌ ట్రెజరీల్లో రేషనలైజేషన్‌

మారుతున్న పరిధులు
 
ఇంతవరకూ విద్యాశాఖలో అమలు చేసిన రేషనలైజేషన్ ఇప్పుడు ట్రెజరీల పరమైంది. దీంతో సబ్‌ ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. దీనివల్ల సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని, ప్రజలకు మరింత అందుబాటులోకి ట్రెజరీ సేవలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
 
రాయవరం (మండపేట): ఖజానా శాఖలో రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం జీఓ-65ను ప్రభుత్వం గత నెల 25న విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాలో ఉన్న సబ్‌ట్రెజరీల పరిధిలో ఉండే మండలాలను మార్పు చేశారు. కొన్ని సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచగా, మరికొన్నింటిలోని మండలాలను సమీపంలోని సబ్‌ట్రెజరీలకు బదిలీ చేశారు. దీని వల్ల ఖజానా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని, సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త జీఓ ప్రకారం  డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో)లు, గ్రామ పంచాయతీలు ఒక సబ్‌ట్రెజరీ పరిధిలోకి వస్తారు. జిల్లాలో కాకినాడ  కేంద్ర సబ్‌ట్రెజరీతో కలిపి 20 సబ్‌ట్రెజరీలు ఉన్నాయి.............. సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచి, మిగిలిన సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. రేషనలైజేషన్‌ కారణంగా రాయవరం సబ్‌ట్రెజరీ కార్యాలయం రామచంద్రపురంలో కలుస్తుంది. ఇక్కడి సిబ్బందిని రావులపాలెం సబ్‌ట్రెజరీకి బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయవరం సబ్‌ట్రెజరీలో కేవలం రాయవరం మండలం మాత్రమే ఉంది. రాయవరం సబ్‌ట్రెజరీలో రాయవరం, అనపర్తి, బిక్కవోలు మండలాలు ఉండగా గతంలోనే అనపర్తి, బిక్కవోలు మండలాలకు అనపర్తిలో సబ్‌ట్రెజరీని ఏర్పాటు చేశారు. 
పరిపాలనా సౌలభ్యం కోసమే..
పరిపాలనా సౌలభ్యం కోసమే సబ్‌ట్రెజరీల రేషనలైజేషన్‌ జరుగుతోంది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మారుతున్న సబ్‌ట్రెజరీల స్వరూపంపై డీడీవోలు, గ్రామ పంచాయతీలకు సమాచారం ఇస్తున్నాం. వారి వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. 
-పీవీ భోగారావు, జిల్లా ట్రెజరీ అధికారి, కాకినాడ

Advertisement

What’s your opinion

Advertisement