Sakshi News home page

సౌదీలో ఆర్థిక సంక్షోభం

Published Sun, Jul 31 2016 12:40 AM

సౌదీలో ఆర్థిక సంక్షోభం

మోర్తాడ్‌: సౌదిలో ముదిరిన ఆర్థిక సంక్షోభంతో కొన్ని కంపెనీలు మూత పడుతుండటంతో మన రాష్ట్రానికి చెందిన కార్మికులు వీధినపడుతున్నారు. సౌది అరేబియాలో ప్రధానంగా జెద్దాలో నాలుగు రోజుల కింద ప్రముఖ కంపెనీలు లాకౌట్‌ ప్రకటించడంతో భారతదేశానికి చెందిన కార్మికులు పనులు కోల్పొయారు. ఇందులో ఎక్కువ మంది తెలుగు కార్మికులే ఉన్నారు. అయిల్‌ కంపెనీలతో పాటు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, వాణిజ్య వ్యాపార సముదాయాలకు సంబంధించిన కంపెనీలు సైతం నష్టాల బారిన పడటంతో కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నాయి. కంపెనీలు మూత పడటంతో కంపెనీ క్వార్టర్స్‌ సైతం మూసివేతకు గురైతున్నాయి. దీంతో కార్మికులు వీధిన పడి తమ కడుపు నింపుకోవడం కోసం తమ శ్రేయిభిలాషులను ఆశ్రయిస్తున్నారు. కంపెనీల నుంచి తొలగించబడిన కార్మికులు తమకు తెలిసిన వారి వద్ద తలదాచుకుంటున్నారు. కంపెనీలు మూతబడటంతో కార్మికులు ఇంటికి వచ్చే అవకాశం ఉన్నా ఇంటికి వచ్చినా ఉపాధి లభించే అవకాశం లేక పోవడంతో అక్కడే ఉండి ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశ్యంతో కార్మికులు తమ మిత్రులను ఆశ్రయిస్తున్నారు. ఏ అండ లేని కార్మికులు మాత్రం జెద్దా వీధుల్లో తిరుగుతున్నారు. అయితే కంపెనీలు మూత పడిన సమాచారం అందుకున్న సౌది పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో కొంత మంది కార్మికులు పట్టుబడినట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో బక్రీద్‌ పండుగ ఉండటంతో సౌదిలో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. దీంతో సరైన అకామా లేని కార్మికులను అక్కడి పోలీసులు బందిస్తున్నారు. మూత బడిన కంపెనీలకు సంబంధించిన కార్మికులు మాత్రం స్వదేశాలకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జెద్దాలో వీధినపడిన దాదాపు 800 మంది కార్మికుల విషయంలో కొందరు విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ను సౌది అరేబియాకు పంపించింది. వీధిన పడిన కార్మికుల్లో ఎక్కువ మంది నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. విదేశీ వ్యవహారాల సహాయం మంత్రి వీకే సింగ్‌ సౌది పర్యటన వల్ల భారతీయులకు ప్రయోజనం కలుగాలని పలువురు భావిస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement