మెట్రో బండి.. కదలదండి! | Sakshi
Sakshi News home page

మెట్రో బండి.. కదలదండి!

Published Tue, Apr 11 2017 9:12 AM

మెట్రో బండి.. కదలదండి! - Sakshi

► మెట్రో ప్రాజెక్ట్‌కు అన్నీ అడ్డంకులే..
► కొలిక్కిరాని భూసేకరణ
► అరకొరగా నిధుల కేటాయింపు
► రుణం ఇచ్చేందుకు ముందుకు రాని విదేశీ సంస్థలు
► రెండేళ్లలో టెండర్లు కూడా ఖరారు చేయని వైనం
► నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం


సాక్షి, విజయవాడ : అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి.. అన్న చందంగా మారింది. తొలుత ఈ ప్రాజెక్టును 2015లో ప్రారంభించి 2018 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ కూడా ముగియలేదు. రెండు నెలల్లో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పడం... వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కనీసం 2020వ సంవత్సరానికి అయినా మెట్రో పనులు పూర్తి చేయాలని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే 2025 నాటికి కూడా విజయవాడలో మెట్రో రైలు నడవడం కష్టమనే సూచనలు కనిపిస్తున్నాయి.

ముందుకు సాగని భూసేకరణ : ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో కలిపి 26.03 కిలో మీటర్లలో మెట్రో రైలు ప్రాజె క్టును నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణకు రూ.400 కోట్ల వరకు అవసరం. ప్రస్తుతానికి కార్పొరేషన్‌ అధికారుల వద్ద అంత నిధులు లేవు. మరోవైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో అధికారులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.

వేధిస్తున్న నిధుల కొరత: మెట్రో రైలు ప్రాజెక్టును నిధుల కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా రూ.7,063 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరకొరగానే నిధులు కేటాయించాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క పైసా విదల్చలేదు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఆధారపడటంతో నిధులు రావడంలో జాప్యం జరుగుతోంది. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన ఆర్థిక సంస్థల ప్రతినిధులు వచ్చినా నిధులు ఇచ్చే విషయంలో ఆయా సంస్థల నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో మెట్రో ప్రాజెక్ట్‌ ముందుకు సాగడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

టెండర్ల ఖరారులో జాప్యం...: మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఐదు నెలల క్రితం రెండు దశల్లో టెండర్లు పిలిచారు. తొలి దశలో టెక్నికల్‌ బిడ్, తర్వాత ఫైనాన్షియల్‌ బిడ్‌ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అధికారులు టెండర్లు ఖరారు చేయలేదు. టెక్నికల్‌ బిడ్‌ టెండర్లలో ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్‌కాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సింపుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు అర్హత సాధించాయి. అయితే ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరవకుండా అధికారులు నాన్చుతున్నారు. ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరిస్తే అర్హత పొందిన కంపెనీకి మెట్రో ప్రాజెక్టు పనులు చేసేందుకు స్థలం అప్పగించడంతోపాటు టెండర్లు ఖరారు చేసిన వెంటనే 10శాతం నిధులు అడ్వాన్స్‌ చెల్లించాలి. ఈ లెక్కన కనీసం రూ.700 కోట్లు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం స్థల సేకరణ జరగలేదు. మరోవైపు 10శాతం అడ్వాన్స్‌ ఇచ్చేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్‌ వద్ద నిధులు లేవు. అందువల్ల ఫైనాన్షియల్‌ బిడ్‌ టెండర్ల ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు.

అంచనాలు పెరిగే ప్రమాదం...: మెట్రో ప్రాజెక్ట్‌ కోసం 2015లో డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌) రూపొం దిం చారు. అప్పటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.రూ.7,063 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కాబట్టి పనులు ప్రారంభించే సమయానికి అంచనా వ్యయం భారీగా పెరిగే అకాశం ఉంది. అప్పుడు మళ్లీ పెరిగిన ఖర్చుల ప్రకారం నిధులు సమకూర్చుకోవడం కష్టమేనని ఓ అధికారి తెలిపారు.

ఆత్మహత్యలకు అయినా సిద్ధం. కానీ మెట్రో రైలు కోచ్‌ డిపోకు భూములు మాత్రం ఇచ్చేలేదు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది. – ఇదీ నిడమానూరు గ్రామ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

Advertisement
Advertisement