Sakshi News home page

చైనా వైపు మోదీ చూపు

Published Wed, Feb 4 2015 1:06 AM

Narendra Modi looks to better relations with China

అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చివెళ్లాక మన దేశం ఇప్పుడు చైనాతో సంబంధాలపై దృష్టిపెట్టింది. అగ్ర రాజ్యాలతో చెలిమి ముఖ్యమే అయినా... అందుకోసమని ఇరుగు పొరుగు దేశాలతో సాన్నిహిత్యాన్ని విస్మరించలేం. కనుకనే వచ్చే మే నెలలో ఉండబోయే ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సంబంధించిన ఎజెండాను ఖరారు చేయడానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా వెళ్లారు. ఒబామా భారత పర్యటన తర్వాత, మరీ ముఖ్యంగా ఆసియా- పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో  వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంటుందని ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన తెలియజేశాక భారత్ కదలికలపై చైనా కలవరపాటుకులోనైన మాట వాస్తవం. ఆ సంగతి గమనించే భారత్‌తో తమ సంబంధాలు పెంపొందడంపై ఆందోళనపడనవసరం లేదని ఒబామా చైనాకు హామీ ఇచ్చారు. ఆ సంగతలా ఉంచి భారత-చైనాల మధ్య మరింతగా పెంపొందాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికా-చైనాలు చాలా విషయాల్లో ఉత్తర-దక్షిణ ధ్రువాలుగా ఉన్నా ఆ దేశాలమధ్య  ద్వైపాక్షిక వాణిజ్యం 56,000 కోట్ల డాలర్ల పైమాటే. కానీ ఇరుగుపొరుగు దేశాలైన భారత్-చైనాల వాణిజ్యం 6,500 కోట్ల డాలర్లు మించడం లేదు. ఈ ఏడాది ఆఖరుకు దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలన్నది ఇరు దేశాల లక్ష్యమైనా ఆ విషయంలో మరింత వివరంగా చర్చించాల్సి ఉంది. ఇరు దేశాల మధ్యా ఇప్పుడున్న పరస్పర అపనమ్మకం, సందేహాలు తొలగిపోవాలని... నిర్మాణాత్మకమైన సంబంధాలు ఏర్పడాలని చైనా అధినేతలు కూడా ప్రగాఢంగా కోరుకుంటున్నారు. బహుశా అందువల్లనే కావొచ్చు... ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. అంతేకాదు... తన సొంత రాష్ట్రమైన షాంగ్జీకి మోదీ రావాలని కోరుకుంటున్నట్టు జిన్‌పింగ్ ఆమెకు తెలిపారు. మొన్న సెప్టెంబర్‌లో జిన్‌పింగ్ మన దేశంలో మూడు రోజుల పర్యటనకొచ్చినప్పుడు మోదీ స్వస్థలం అహ్మదాబాద్‌నే ఆయన తన తొలి మజిలీగా ఎంచుకున్నారు. అయితే, ఇరు దేశాలమధ్యా దీర్ఘకాలంగా సరిహద్దు సమస్యలున్నాయి. ఆ దేశంతో మనకున్న 4,057 కిలోమీటర్ల పొడవు సరిహద్దులో తరచుగానే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆఖరికి జిన్‌పింగ్ మన దేశ అతిథిగా ఇక్కడ పర్యటిస్తున్న సమయంలో కూడా చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం హడావుడి సృష్టించింది. లడఖ్ ప్రాంతంలోని డోమ్‌చోక్ వద్ద సాగుతున్న కాల్వ పనులను అడ్డుకోవడం కోసం చైనా పౌరులను సమీకరించింది. దౌత్యపరమైన మర్యాదలను పాటించాల్సిన సమయంలో ఇలాంటి చేష్టలు ఎంత ఇబ్బందికరమో చైనా సైనికాధికారులకు అర్ధంకాలేదు. సరిహద్దులవద్ద ఎవరి భూభాగం ఎంతన్న విషయంలో రెండు దేశాలకూ మధ్య వివాదం ఉన్నది. ముఖ్యంగా లడఖ్, ఆక్సాయ్‌చిన్ ప్రాంతాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం చైనా ఆక్రమణలో ఉన్నదని మన దేశం అంటుంటే...తమ భూభాగమే 90,000 చదరపు కిలోమీటర్లు భారత్ అధీనంలో ఉన్నదని ఆ దేశం చెబుతోంది. ఈ వివాదంపై శాంతియుత పరిష్కార సాధనకు చర్చించుకుంటూనే... వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచు కుందామని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాదు...ఇరు దేశాలూ తుది ఒప్పందం సమయంలో ఇప్పటికే జనావాస ప్రాంతాలుగా ఉన్న భూభాగాలపై పట్టుబట్టరాదన్న అంగీకారానికి కూడా వచ్చాయి. అయితే, దీన్ని చైనా ఉల్లంఘిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్‌ను తరచు వివాదాస్పదం చేయడానికి ప్రయత్నించడం...ఏదో ఒకచోట మన భూభాగంలోకి చొచ్చుకురావడం చైనాకు నిత్యకృత్యమైంది. సరిహద్దుల్లో చోటుచేసుకునే చొరబాట్లు ఇంతవరకూ కాల్పుల వరకూ వెళ్లకపోవడం ఉన్నంతలో నయమే అయినా అవి సృష్టించే అపనమ్మకం ద్వైపాక్షిక సంబంధాలపై పడుతుందన్న సంగతిని చైనా గ్రహించలేకపోతున్నది.
 
 చైనాతో చర్చల సమయంలో ఈసారి మనవైపు నుంచి ‘భిన్నమైన ప్రతిపాదనలు’ వెలువడే అవకాశం ఉన్నదని సుష్మా స్వరాజ్ చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలేమిటన్నది పక్కనబెడితే సరిహద్దు వివాదం వంటి సున్నితమైన అంశాలను పరిష్కరించడంలో చొరవ ప్రదర్శించడం బీజేపీ వంటి జాతీయవాద పార్టీ నేతృత్వంవహిస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందన్నది నిజం. సరిహద్దు విషయంలో మనం మెక్‌మెహన్ రేఖపై పట్టుబట్టకుండా వాస్తవాధీన రేఖనే అంగీకరించాలన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇక మొన్న నవంబర్‌లో బీజింగ్‌లో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (ఎపెక్) సమావేశాల్లో పాల్గొనాలని చైనా కోరినా మన దేశం అంతగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఆ సంస్థలో ఇప్పటికే అమెరికా, ైచె నా, జపాన్‌తోసహా 21 దేశాలున్నాయి. ఇప్పుడు అందులో సభ్యత్వం తీసుకోవడానికి భారత్ సిద్ధపడటాన్ని చైనా హర్షిస్తున్నది. అలాగే 2001లో ఏర్పడిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లో క్రియాశీలంగా పాల్గొనాలని అటు చైనా, ఇటు రష్యా కూడా ఎప్పటినుంచో కోరుతున్నాయి. అందులో ఇప్పటికే తజికిస్థాన్, కజఖ్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్, చైనా, రష్యాలు సభ్యదేశాలు. ఇప్పుడు అందులో సైతం మన దేశం సభ్యత్వం తీసుకుంటున్నది. ఇది కూడా చైనాకు ఊరట కలిగించే పరిణామం. ఇప్పటికే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో ఉన్న చైనా ఇటువంటి ప్రాంతీయ కూటములతో, ద్వైపాక్షిక సంబంధాలతో మరింత ఎదగాలని ఆశిస్తున్నది. అమెరికాతో మన చెలిమివల్ల ఇలాంటి అంశాల్లో తన ప్రయోజనాలు దెబ్బతింటాయేమోనని చైనా ఆందోళన పడినా భారత్ తాజా నిర్ణయాలు ఆ దేశానికి ఉపశమనం కలిగించి ఉంటాయి. చైనాలో మోదీ జరపబోయే పర్యటన నూతనాధ్యాయానికి నాంది పలకాలని... ముఖ్యంగా సరిహద్దు వివాదం పరిష్కారానికి ఎంతో కొంత దోహదపడాలని ఎందరో ఆశిస్తున్నారు. అది నెరవేరాలని కోరుకుందాం.
 

Advertisement

What’s your opinion

Advertisement