Sakshi News home page

మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే

Published Mon, Apr 28 2014 4:21 PM

మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే - Sakshi

న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి అత్యధిక  ఓట్లు వస్తే ఆమె గెలిచినట్టుగా ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అలాంటి సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఈవీఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. గత బుధవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ శోభా నాగిరెడ్డిని తొలుత నంద్యాలలో చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్ తరలించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.

కాగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థి ఎవరైనా మరణిస్తే అక్కడి ఎన్నికలను వాయిదా వేస్తారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ఆళ్లగడ్డ ఎన్నికలను వాయిదా వేయబోమని, శోభానాగిరెడ్డికి ఓట్లు వేసినా ఆ ఓట్లు లెక్కలోకి రావని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఇంతకుముందు ప్రకటించారు. ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓట్లకు విలువ ఉండదని, నోటాగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తరువాత పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే గెలిచినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది.

Advertisement

What’s your opinion

Advertisement