Sakshi News home page

జబ్బు రాకున్నా ఉన్నట్లే... వ్యాధి లేకున్నా ఇక్కట్లే!

Published Tue, Sep 17 2013 11:42 PM

జబ్బు రాకున్నా ఉన్నట్లే... వ్యాధి లేకున్నా ఇక్కట్లే!

జానకి 42 ఏళ్ల గృహిణి. ఆమె వల్ల ఆమె కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. వాళ్లంతా కలిసి జానకిని తీసుకుని ఇటీవలి కాలంలో దాదాపు 15 మంది డాక్టర్లను కలిసుంటారు. డాక్టర్ల ఫీజు, వైద్య పరీక్షలూ కలుపుకొని కొద్దికాలంలోనే దాదాపు రూ. రెండున్నర లక్షలకు పైగానే ఖర్చుచేసి వుంటారు. తనకు కచ్చితంగా నాలుక క్యాన్సర్ ఉందేమోనని జానకి అనుమానం. అలాంటిదేమీ లేదంటూ వాళ్ల ఫ్యామిలీ ఫిజీషియన్‌తో పాటు అందరూ చెప్పిచూశారు. వాళ్లను నమ్మక ఆమె ఈఎన్‌టీ, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్... ఇలా అన్నిరకాల స్పెషలిస్టులను కలిసింది. కలిసినప్పుడల్లా వాళ్లకు ఆమె చెప్పే సమస్య సైతం కొద్దికొద్దిగా మారుతుంటుంది.
 
  ఉదాహరణకు మొదట నాలుక మీద పుండు (అల్సర్) వచ్చిందని చెబుతుంది. ఆ తర్వాత నాలుక వాచిందనీ, మింగడానికి రావడం లేదనీ, గొంతు నొప్పిగా ఉందనీ, గొంతుకు ఇరుపక్కల ఉన్న గ్రంథుల వాపు కనిపిస్తోందంటూ ఫిర్యాదులు చేస్తుంటుంది. ఆమె చెప్పిన లక్షణాలతో వచ్చే సమస్యను అనుమానిస్తూ డాక్టర్లు రకరకాల వైద్యపరీక్షలు చేయించారు.  ఒక్కోసారి అదే పరీక్షను వేర్వేరు ల్యాబుల్లో చేయించింది. అన్నింట్లోనో తేలిందేమీ లేదు. దాంతో ఆమె డాక్టర్లను మారుస్తోంది తప్ప తన అభిప్రాయాన్ని కాదు. ఆమె సమస్యతో ఆమె మాత్రమే కాదు... కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. చివరగా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుళ్లారు. దాంతో సమస్యేమిటో తేలింది. జానకికి ఉన్న సమస్య పేరే... ‘హైపోకాండ్రియాసిస్’. అంటే తనకు తెలిసిన ప్రతి జబ్బూ తనకు ఉందేమోనంటూ అనుమానించే విచిత్రవ్యాధి. ఇంతకీ జానకికి ఈ జబ్బుకు రావడానికి అంతకుమునుపు చోటుచేసుకున్న మూడు సంఘటనలు దోహదం చేశాయి.
 
  అవి... ఇటీవలే జానకి తల్లి గొంతుక్యాన్సర్‌తో చనిపోయారు. దాంతో కుటుంబమంతా షాక్‌కు గురైంది. 
 టీవీల్లో వచ్చే ఆరోగ్యకార్యక్రమాలు, పత్రికల్లో వచ్చే ఆరోగ్య కథనాలను జానకి విపరీతంగా చూస్తుంటుంది. 
  ఆమె చదివిన లేదా చూసిన ప్రతిదాన్నీ తనకు ఆపాదించుకుని చూసుకునే మనస్తత్వం (సజెస్టిబిలిటీ) ఉంది. దాంతో ఆమె విపరీతంగా ప్రభావితమయ్యేది. ఈ మూడు అంశాలతో తన అమ్మగారికి ఉన్న జబ్బు తనకూ వచ్చిందేమోనని ఆందోళనపడుతూ దాన్ని రూలవుట్ చేసుకోడానికి పరీక్షలు చేయిస్తూ, మళ్లీ అనుమానిస్తూ మళ్లీ పరీక్షలు చేయిస్తూ... మనశ్శాంతి లేకుండా చేసుకుంది. జానకిలోనే కాదు... ఇటీవల చాలామందిలో ఈ తరహా రుగ్మత ఎక్కువగా చోటుచేసుకుంటోంది. 
 
 రుగ్మతకు దోహదపడుతున్న అంశాలు... 
  ఇటీవల వైద్యవిజ్ఞానంలో వేగంగా వస్తున్న పురోగతి, ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో, ఒకనాడు లోతైనదిగా భావించిన పరిజ్ఞానం ఇటీవల చాలా ప్రాథమికమైనదిగా మారుతూ సామాన్యులకూ తెలిసిపోయేంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. దాంతో చాలామందిలో ఉండే గుణమైన ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దంలో చూసి ఆందోళనపడే పరిస్థితి వచ్చింది.  వ్యాధి నిర్ధారణ విషయంలోనూ అందుబాటులోకి వస్తున్న అధునాతన పరీక్ష ప్రక్రియలతో... ఖరీదైన పరీక్ష చేయిస్తేనే గాని దేనినీ నమ్మకపోవడం, డాక్టర్లు సైతం రోగి కోరిన వెంటనే వాటిని సిఫార్సు చేయడం.  ఎలాంటి ఛాన్సూ తీసుకోవడానికి ఇష్టపడని వైద్యులు సైతం 100 శాతం నమ్మకం కోసం ఎలాంటి అంశాలూ తప్పిపోవడానికి అవకాశం లేకుండా అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటినీ చేయిస్తూ ఉండటం. 
 
  మిగతా సాధారణ జబ్బులకు ఉండే లక్షణాల్లాంటివే క్యాన్సర్ వంటి జబ్బుల్లోనూ ఉండటంతో చిన్నచిన్న లక్షణాలను పెద్ద జబ్బుగా అనుమానించి మథనపడుతుండటం.  ఆరోగ్యస్పృహ కాస్తా పెచ్చుమీరిపోయి జాగ్రత్త కాస్తా అతి జాగ్రత్తగా మారడం.  కుటుంబంలోని అతి సన్నిహితమైన వ్యక్తులు, ముఖ్యంగా చాలా చిన్న వయసులోని వారు తమ సమస్యను తొలి దశలో నిర్లక్ష్యం చేసి, వ్యాధి ముదిరాక ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లడం లేదా మృతి చెందడం.  ఇటీవల టీవీల్లో, పత్రికల్లో వస్తున్న కథనాల్లో కేవలం ప్రాథమిక అంశాలను చెబుతూ... స్థలాభావం, సమయాభావం కారణంగా మొత్తం సమాచారాన్ని ఇవ్వలేకపోతుండటంతో ప్రేక్షకులు/పాఠకులు తమకు లభ్యమైన కొద్దిపాటి సమాచారంతో ఆందోళనకు/అయోమయానికి గురవ్వడం. 
 
 అసలు హైపోకాండ్రియాసిస్ అంటే ఏమిటి? 
 ఇదొక మానసిక పరిస్థితి. ఇదో భయం-ఆందోళనలు కలగలసిన వ్యాధి (ఫోబిక్-యాంగ్జైటీ డిజార్డర్). దీన్ని డిసీజ్ ఫోబియా లేదా హెల్త్ ఫోబియా అని కూడా పిలుస్తారు. ఇందులో రోగి తానొక వ్యాధితో బాధపడుతున్నట్లు నమ్ముతాడు. దానికి సంబంధించిన వైద్యపరీక్షలను తరచూ చేయిస్తుంటాడు. ఆ పరీక్షల ఫలితాలను సైతం నమ్మకుండా వాటిల్లో ఏదైనా పొరబాటు జరిగి ఉండవచ్చేమోనని మళ్లీ నమ్ముతుంటాడు. ఇలా మళ్లీ మరో డాక్టర్ దగ్గరకు వెళ్లి మళ్లీ పరీక్షలు చేయిస్తుంటాడు. ఇలాంటి రోగులు ఈ క్రమంలో చివరగా డిప్రెషన్‌కు లోనై తమను తాము బాధపెట్టుకోవడమే గాక కుటుంబసభ్యులనూ బాధపెడుతుంటారు. 
 
 అన్నీ భయాలే... అన్నింటా అనుమానాలే... 
 ఈ రోగులకు ప్రతి చిన్న విషయమూ భయం గొలిపే అంశమే. ఉదాహరణకు మనకు ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో భాగంగా పేగుల్లో కదలికలు, గుడగుడలు వినిపించడం చాలా సాధారణమైన విషయం. కానీ వీరు దాన్ని కూడా ఏదైనా భయంకరమైన వ్యాధికి సూచికగా అనుమానిస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటుంటారు. ఇలాంటివారు తమలో కనిపించే ఒక చిన్న లక్షణంపై ఆధారపడుతూ తమ వాదనకు బలం చేకూర్చుకుంటూ ఉంటారు. తనకు అలాంటి వ్యాధి ఏదీ లేదంటూ డాక్టర్/ఫిజీషియన్ ఎంతగా చెప్పినా నమ్మరు. ఒకవేళ జబ్బు లేనప్పుడు ఆ లక్షణం ఎందుకుందని, ఎంతకూ ఎందుకు తగ్గడం లేదనీ వాదిస్తుంటారు.
 
 కొత్త సమస్యలకు దారితీసే హైపోకాండ్రియా... 
 హైపోకాండ్రియా కండిషన్ అన్నది కొత్తసమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు రోగుల్లో రక్తపోటు పెరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఉద్వేగాలకు, ఆందోళనకు, వ్యాకులతకు గురవుతుంటారు. ఒకదశలో డాక్టర్‌ని, వైద్యసిబ్బందిని చూసినా ఆందోళనకు గురవుతూ రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీన్నే ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఒక్కోసారి డాక్టర్ తమకు ఎలాంటి భయంకరమైన జబ్బు ఉందని చెబుతారో, తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనన్న ఆందోళనతో అసలు ఆసుపత్రికి వచ్చేందుకే నిరాకరిస్తుంటారు. 
 
 ఉన్న సమస్యకు తోడు అదనంగా ఇది మరో సమస్య. 
 చికిత్స: రోగి తనకు ఉన్న లక్షణాలను పేర్కొంటూ వాటికి సంబంధించిన అన్ని వైద్యపరీక్షలూ నార్మల్‌గా ఉన్నప్పటికీ వ్యాధి లేదన్న విషయాన్ని నమ్మకుండా ఉన్నప్పుడు అతడికి నిజంగానే సమస్య ఉందని, సైకియాట్రిస్ట్‌తో చికిత్స చేయిస్తే అది తగ్గుతుందని కూడా విశ్వసించాలి. రోగికి జబ్బు వల్ల కలిగే మానసిక ఒత్తిడిని, యాంగ్జైటీని తొలగించడానికే సైకియాట్రిస్ట్‌ను కలుస్తున్నామనీ, రోగికి ఉన్న (అతడు అనుమానిస్తున్న) వ్యాధికీ, అతడి మానసికస్థితికీ ఈ రెండింటికీ ఏకకాలంలో చికిత్స చేయిస్తున్నామనే విశ్వాసాన్ని పాదుగొల్పాలి. అలా రోగిని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లడానికి ఒప్పించి, తగిన చికిత్స అందించాలి. ఇక సైకియాట్రిస్టులు అతడికి మాటిమాటికీ కలిగే భయాలను తొలగించే ఎస్‌ఎస్‌ఆర్‌ఐ అనే మందులను (పారోగ్జిటిన్, సెర్ట్రాలైన్ వంటివి) ఇస్తారు. 
 
 అవి మెదడులోని భయాలను కలిగించే న్యూరోట్రాన్స్‌మిటర్లపై పనిచేసి రోగిలోని ఆందోళనలను, తమకు జబ్బు ఉందని అనుమానించే లక్షణాన్ని తగ్గిస్తాయి. ఇక దానితో పాటు రోగిలోని యాంగ్జైటీని తగ్గించడానికి కూడా మందులు ఇస్తారు. ఎక్స్‌పోజర్ థెరపీ: హైపోకాండ్రియా రోగులకు ఎక్స్‌పోజర్ థెరపీ అనే మరో చికిత్స ప్రక్రియను కూడా ఇస్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా రోగి తన విషయంలో అనుమానిస్తున్న వ్యాధితో బాధపడుతున్న ఇతర రోగిని చూపుతారు. ఆ రోగికి కనిపించే లక్షణాలకూ, మన రోగి లక్షణాలకూ సామ్యం లేకపోవడాన్ని ప్రత్యక్షంగా చూపుతారు. దాంతో సదరు వ్యాధి తనకు లేదని రోగిలో నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా హైపోకాండ్రియా రోగి పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో అతడికి రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్‌తో ఆందోళనను అధిగమించడం కూడా నేర్పుతారు. దాంతో హైపోకాండ్రియా పరిస్థితి నుంచి వేగంగా బయటపడేందుకు అవకాశం ఉంది.
 
 సానుభూతి పొందే మరో జబ్బుతో పోలికలు
 సాధారణంగా కొందరు తమకు ఎలాంటి జబ్బూ లేకపోయినా సమాజం నుంచి తమకు సానుభూతి, ఆదరణ, తమపై అందరూ దృష్టి నిలిపి, తమ సంరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలనే కోరికతో లేని జబ్బును కల్పించుకుంటారు. ఈ జబ్బు పేరు ‘మంఛూహాసెన్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారిలో  వైద్యవిజ్ఞానంలో విశేషమైన ప్రవేశం ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. తాము కోరుకునే సానుభూతి, అటెన్షన్ కోసం తమలో ఏవేవో లక్షణాలన్నీ కనిపిస్తున్నాయంటూ వైద్యులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన వైద్యపరీక్షలు చేయిస్తూ, సుదీర్ఘకాలం ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉండేలా చూసుకుంటుంటారు. ఒక్కోసారి ఖరీదైన ఆపరేషన్లు చేయించుకోడానికీ వెనుకాడరు. హైపోకాండ్రియాసిస్ ఉన్నట్లు నిర్ధారణ చేసేముందు ఒకవేళ రోగికి వైద్యవిజ్ఞాన శాస్త్రంలో ఏదైనా ప్రవేశం ఉందా, లేని లక్షణాలన్నింటినీ ఉటంకిస్తూ వారు ‘మంఛూహాసెన్ సిండ్రోమ్’ తో బాధపడుతున్నారా అని వైద్యులు సరిచూసుకోవాల్సి ఉంటుంది. 
 
 ఇది వైద్య విద్యార్థుల జబ్బు కూడా... 
 దీన్ని వైద్య విద్యార్థుల జబ్బు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వైద్య విద్యను అభ్యసించే సమయంలో వారు చదివే కొన్ని లక్షణాలు తమలోనూ ఉన్నాయేమోనని కొందరు వైద్యవిద్యార్థులు అనుమానిస్తుంటారు. అందుకే వారు చదువుతున్న కోర్సు / వారు చదివే ఏడాదిని బట్టి దీన్ని మెడికల్ స్టూడెంట్ సిండ్రోమ్, మెడికల్ స్టూడెంట్ డిజార్డర్, మెడికల్ స్కూల్ సిండ్రోమ్, థర్డ్ ఇయర్ సిండ్రోమ్, సెకండ్ ఇయర్ సిండ్రోమ్, ఇంటర్న్ సిండ్రోమ్ అంటూ రకరకాలుగా పిలుస్తారు. 
 
 -నిర్వహణ: యాసీన్
 
 

Advertisement

What’s your opinion

Advertisement