Sakshi News home page

కమాన్ కొలకేషియా!

Published Fri, Jan 27 2017 11:50 PM

కమాన్ కొలకేషియా!

చామదుంప ఇంగ్లిష్‌ స్కూల్‌కెళితే ఏమౌతుంది?... టీచర్‌ పేరు మార్చి ‘కొలకేషియా’ అని పిలుస్తుంది. ఏషియా ఒక్కటేంటి వరల్డ్‌ మొత్తంలో కొలకేషియా చాలా ఫేమస్‌. ఇవ్వాళ మీ పిల్లలకి, మీ ఆయనకి కొలకేషియాని వడ్డించండి... దుంపని మర్చిపోయి చమ చమ లాగించేస్తారు... మమ్మీ ఇంగ్లిషు వంట చేసిందని... కాలనీ అంతా చెప్పుకుంటారు.... వాట్‌ ఆర్‌ యూ వెయిటింగ్‌... కమాన్‌ కొలకేషేయండి.
మలేషియా చామదుంపల రోస్ట్‌
కావల్సినవి: కొలకేషియా (చామదుంప) – 250 గ్రాములు, శనగపిండి – 2 టేబుల్‌ స్పూన్లు, కారం – టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఆమ్చూర్‌ పౌడర్‌ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావుట ఈ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్‌ స్పూన్ల
పోపు: నూనె – టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు
తయారీ: ∙చామదుంపల పై ఉన్న నలుపురంగును గీకి, కడిగాలి. వాటిని ప్రెషర్‌ కుకర్‌లో వేసి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి వేసి ఒక విజిల్‌ వచ్చేవరకు ఉంచి దించాలి. చల్లారాక దుంపలపై పొట్టు తీసి, ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ∙వెడల్పాటి బేసిన్‌లో కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, అమ్చూర్, జీలకర్రపొడులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌చేసిన చామదుంపలపై వేసి కలపాలి. ∙కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కలిపి ఉంచిన చామ దుంపలను కొద్ది కొద్దిగా వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. నూనె అయిపోతే మరికొంత కలుపుకోవాలి. వేయించిన చామదుంపలపై శనగపిండి చల్లాలి. ∙కడాయిలో మరో టీ స్పూన్‌ నూనె వేసి జీలకర్ర, వాము వేయించాలి. దీంట్లో శనగపండి కలిపిన చామదుంపలను వేసి వేయించాలి. నిమ్మరసం పిండి దించాలి. పెరుగన్నం, సాంబార్, రసం అన్నంలోకి వేడి వేడిగా వడ్డించాలి.

చామదుంప మటన్‌ కావల్సినవి:
చామదుంపలు – పావు కేజీ, మటన్‌ – 350 గ్రాములు, చింతపండు గుజ్జు – 1 1/2 టేబుల్‌ స్పూన్, నీళ్లు – కప్పు, ఉల్లిపాయలు – 2
తయారీ: ∙మటన్‌ని శుభ్రపరిచి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి పక్కనుంచాలి. చామదుంపలపై ఉన్న నలుపును తీసేసి, కడగాలి. (రెండు రెండు దుంపల చొప్పున కడిగితే పై జిగట అంటుకోదు) ∙ప్రెజర్‌ కుకర్‌ పొయ్యి మీద పెట్టి నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన మటన్‌ వేసి ఉడికించాలి. మటన్‌లోని నీళ్లన్నీ ఇగిరిపోయాక 4 కప్పుల నీళ్లు పోసి పైన మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత దీసి, దీంట్లో చామదుంపలు వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు పోసి, గరం మసాల, ధనియాలపొడి, కొత్తిమీర వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడకనిచ్చి దించాలి.
గరం మసాలాకు: 4 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, 8 మిరియాలు, 8 తొకమిరియాలు కలిపి పొడి చేయాలి.

చామ ఆకు పప్పు కావల్సినవి:
చామ ఆకులు – 30, పప్పు – పావు కేజీ, ఉల్లిపాయలు – 1 , పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 6, టొమాటో – 1 (తరగాలి), నూనె – టేబుల్‌స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఆవాలు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – టీ స్పూన్, ఉప్పు – తగినంత
తయారీ: ∙చామ ఆకులను కడిగి, సన్నగా తరిగి పక్కనుంచాలి. కుకర్‌లో పప్పు కడిగి అరలీటర్‌ నీళ్లు పోసి, చిటికెడు పసుపు, స్పూన్‌ నూనె వేసి, మూత పెట్టి 3–4 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి. తర్వాత పప్పుగుత్తితో మెత్తగా రుబ్బాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం కలపాలి. 2 నిమిషాల తర్వాత టొమాటో వేసి మెత్తగా ఉడికించాలి. దీంట్లో చామ ఆకులు, ఉప్పు వేసి కలిపి,  3 నిమిషాల సేపు మూత పెట్టాలి. తర్వాత దీంట్లో ఉడికించిన పప్పు, చింతపండు గుజ్జు, కొత్తిమీర చల్లి మరో నిమిషం ఉంచి దించాలి.

బెంగాలీల చామదుంపల రొయ్యల కూర
కావల్సినవి: చామదుంపలు – 5 (ముక్కలుగా కట్‌ చేయాలి)
బంగాళదుంప – 1 (ముక్కలుగా కట్‌ చేయాలి), రొయ్యలు – 12, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌
టొమాటో – 1 (సన్నగా తరగాలి), «ధనియాలపొడి – టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌
పసుపు – అర టీ స్పూన్, కారం – టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కారం – టీ స్పూన్‌
బిర్యానీ ఆకు – 1, ఆవనూనె – పావు కప్పు, నెయ్యి – టీ స్పూన్, పంచదార – టీ స్పూన్, ఉప్పు – తగినంత

తయారీ: ∙చామదుంపల పై పొట్టు తీసి, కడిగి, పెద్ద పెద్ద ముక్కలు కట్‌ చేసి, ఉడికించి పక్కనుంచాలి. ∙రొయ్యలకు పసుపు, ఉప్పు కలిపి కొద్దిగా నూనె వేసి, వేయించి పక్కనుంచాలి. ∙విడిగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక చామదుంప, బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. ∙విడిగా కడాయిలో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేయించాలి. పొడి చేసి ఈ మసాలాను ఉడుకుతున్న ముక్కలలో వేసి కలపాలి. అలాగే ఉప్పు, పంచదార వేసి 4–5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ కోసం 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసి చిక్కగా అయ్యేలా ఉడికించాలి. 7–8 నిమిషాల తర్వాత వేయించిన రొయ్యలను వేసి కలపాలి. దీంట్లో గరం మసాలా, టీ స్పూన్‌ నెయ్యి కలిపి, మూత పెట్టి, మంట తీసేయాలి. అన్నం, చపాతీలోకి ఈ కూరను వడ్డించాలి.

తమిళనాడుచామదుంప పులుసు
కావల్సినవి:  కొలేకేషియా(చామదుంప) – అర కేజీ (ఉడికించి, పై తొక్క తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి), ఉల్లిపాయలు – 1, దాల్చిన చెక్క– 2, టొమాటోలు – 3, కారం – టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి  టీ స్పూన్, జీలకర్ర పొడి – టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, చింతపండు గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ∙కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, దాల్చిన చెక్క వేయించాలి. దీంట్లో టొమాటో ముక్కలు వేసి, కొద్దిగా మగ్గాక చింతపండు రసం కలపాలి. ఉప్పు వేసి, మిశ్రమం బాగా చిక్కబడ్డాక ఉడికించిన చామదుంపలు వేసి కలపాలి. మిగతా అన్ని పదార్థాలు వేసి, కొద్దిగా నీళ్లు కూడా కలిపి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.

కేరళ మసాలా చామదుంప కర్రీ
కావల్సినవి: చామదుంపలు/చెంబు – 10, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత
గ్రైండ్‌ చేయడానికి:  కొబ్బరినూనె/వంటనూనె – 2 టేబుల్‌ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు – 6 (ఒక్కొక్కటి రెండు ముక్కలుగా కట్‌ చేయాలి), కొబ్బరి తురుము – ముప్పావు కప్పు, కారం – 2 టీ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు – 4 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
పోపుకి: కొబ్బరినూనె – 2 టేబుల్‌ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు – 10, కరివేపాకు – రెమ్మ
తయారీ: ∙చామదుంపల పైన నల్లటి పొడి లేకుండా చాకుతో శుభ్రం చేయాలి. తర్వాత నీళ్లతో కడగాలి. స్టౌమీద ప్రెజర్‌ కుకర్‌ పెట్టి దాంట్లో చామ దుంపలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కప్పు నీళ్లు పోసి ఉడికిస్తూ ఉండాలి. ∙విడిగా మరో పొయ్యి మీద కడాయి పెట్టి, దాంట్లో నూనె వేసి వేడియ్యాక ఉల్లిపాయలు వేయించాలి. అలాగే కొబ్బరి తురుము, కరివేపాకు వేయాలి. ఇవి బాగా వేగాక కారం, ధనియాల పొడి మసాలా కలపాలి. మంట తీసేసి, చల్లారాక దీనిని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఈ మిశ్రమం మెత్తగా అయ్యేందుకు వీలుగా 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు కలుపుకోవాలి. ∙మెత్తగా ఉడికిన చామదుంపలలో గ్రైండ్‌ చేసిన మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు పోసి 2–3 నిమిషాలు ఉంచి, ఉడకనివ్వాలి. తర్వాత మంట తీసేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ పోపును మసాలా కర్రీలో కలపాలి. ఇది రైస్, ఇడ్లీ, దోసెలలోకి వడ్డించాలి.

Advertisement

What’s your opinion

Advertisement