Sakshi News home page

ఒన్ అండ్ ఓన్లీ రజినీకాంత్!

Published Sun, Jan 12 2014 1:57 AM

ఒన్ అండ్ ఓన్లీ రజినీకాంత్!

 విశ్లేషణం

 అతనో మరాఠీ... పుట్టింది కన్నడసీమలో... నటించింది తమిళ సినిమాల్లో... అయినా భారతదేశం మొత్తం మెచ్చింది... అంతేనా... జపాన్, టర్కీ, జర్మనీ, తదితర విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న రియల్ సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆ పేరు చెప్తే చాలు అభిమానులు పొంగిపోతారు... ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆనందతాండవం చేస్తారు... ఆయనకు ఎందుకంత క్రేజ్? ఏమిటాయన స్పెషాలిటీ?
 
 అసమాన్య వ్యక్తిత్వం...
 పరిసరాలు, ప్రవర్తన, నైపుణ్యాలు, విలువలు, విశ్వాసాలు, ఐడెంటిటీ, జీవితాదర్శం... వీటిలో దేనిపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడుతున్నాడో దాని  ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. రజినీ బలం, రజినీ ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వంలో ఉంది. దేశవిదేశాలు ఆయనను సూపర్‌స్టార్‌గా చూస్తున్నా... తనను తాను ఒక సామాన్యుడిగా ఐడెంటిఫై చేసుకోవడంలో ఉంది. ఆయన నమస్కరించేటప్పుడు గమనించండి... ఒక స్టార్‌లా స్టైల్‌గా చేతులూపరు, చాలా వినయంగా నమస్కరిస్తారు. తనకన్నా చిన్నవారైనా సరే చాలా గౌరవిస్తారు. అదే ఆయన స్పెషాలిటీ. తానెంత ఎదిగినా తన మూలాలను మరిచిపోకపోవడం, స్నేహాలను, స్నేహితులను విస్మరించకపోవడం... సినిమా ఫ్లాప్ అయితే పంపిణీదారులకు డబ్బు వెనక్కుతిరిగి ఇవ్వడం... రజినీ ఆచరించే విలువలకు నిదర్శనం. దైవం, గురువుల పట్ల అచంచల విశ్వాసం, ఆధ్యాత్మిక సాధనలో అనురక్తి రజినీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఈ జీవితానికి మించిన సత్యమేదో ఉందని, దానిని తెలుసుకోవాలని నిరంతర యోగసాధన చేస్తుంటారు. ఆయనో సూపర్‌స్టార్ అనే కంటే, సూపర్ హ్యూమన్ బీయింగ్ అనడం కరెక్ట్.
 
 స్టైల్ ఈజ్ ద సీక్రెట్
 రజినీ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్. ఆయన మాట్లాడేటప్పుడు కళ్లు అప్పుడప్పుడూ పైకి చూస్తుంటాయి. ఆయనది ఎడమచేతివాటం. అందుకేనేమో తనకంటూ ఒక  క్రియేటివ్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. మాట్లాడే మాటలు, చేతుల కదలికల మధ్య ఒక లయ ఉంటుంది... అంటే మనసులో ఉన్నదే చెప్తున్నారన్నమాట. అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గడ్డం కింద చేయి ఉంచుకుని చాలా శ్రద్ధగా ఉంటారు. అప్పుడప్పుడూ వారి మాటల్లో నిజమెంతో విశ్లేషిస్తుంటారు కూడా.
 
 సుభాషితాల్లాంటి మాటలు...
 నా దారి... రహదారి, నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే, దేవుడు ఆదేశిస్తాడు నేను పాటిస్తాను, నేను చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను, మన జీవితం మన చేతుల్లోనే ఉంది... కష్టపడనిదే ఏదీ రాదు... అలా వచ్చింది నీతో ఉండదు... ఇవన్నీ రజినీ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్. అందరూ ఆచరించదగిన సుభాషితాల్లాంటి డైలాగ్స్. రజినీ డైలాగ్స్ ఆధారంగా ఒక మేనేజ్‌మెంట్ పుస్తకమే వచ్చిందంటే ఆ మాటల్లోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
 
 సినిమాల్లోనే కాదు... నిజజీవితంలో కూడా రజినీ ఇలాంటి పాజిటివ్ విషయాలే చెప్తుంటారు. ‘‘ఎవరు తన గురించి తాను ఎక్కువ చెప్పుకుంటారో, తెలియనిది తెలిసినట్లు చెప్తారో.. వారు కమెడియన్. ఎవరు సెల్ఫిష్‌గా థింక్ చేసి నేను బాగుండాలి, ఇంకెవరూ బాగుండకూడదని చెప్పి నెగెటివ్‌గానే థింక్‌చేసి నెగెటివ్ ఎనర్జీని ఇస్తారో... వారు విలన్. ఎవరు నేను బాగుండాలి, అందరూ బాగుండాలని పాజిటివ్‌గా ఆలోచించి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ ఫీలింగ్‌ని ఇస్తారో... వారు హీరో’’ అని చెప్పే రజినీకాంత్... నిజమైన హీరో. నిజజీవితంలో కూడా హీరో!
 
 - విశేష్, సైకాలజిస్ట్

Advertisement

What’s your opinion

Advertisement