Sakshi News home page

త్రీడీ పుర్రె మార్పిడి!

Published Sat, Jul 18 2015 12:23 AM

త్రీడీ పుర్రె మార్పిడి! - Sakshi

చైనాలో మూడేళ్ల బాలికకు ఆపరేషన్ సక్సెస్
* 3డీ ప్రింటెడ్ లోహపుర్రె మార్పిడి
* ప్రపంచంలో ఇదే తొలిసారి

బీజింగ్: ప్రపంచ వైద్యరంగంలోనే కీలకమైన సరికొత్త పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చైనా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హైడ్రోసెఫలస్(తలలో నీరు చేరడం) అనే సమస్య బారిన పడిన ఓ మూడేళ్ల బాలికకు వారు త్రీడీ(3డీ) ప్రింటెడ్ లోహపు పుర్రెను మార్పిడి చేశారు.

ఇలా 3డీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన పుర్రెను అమర్చడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. శస్త్రచికిత్స విజయవంతం అయిందని, బాలిక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. చైనాలోని హునాన్ రాష్ట్రంలో గల సెకండ్ పీపుల్స్ హాస్పిటల్‌లో బుధవారం జరిగిన ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స వివరాల్లోకెళితే... హునాన్ రాష్ట్రానికి చెందిన మూడేళ్ల బాలిక హాన్ హాన్‌కు పుట్టుకతోనే హైడ్రోసెఫలస్ సమస్య వచ్చింది. ఫలితంగా తలలో నీరు చేరి క్రమంగా ఉబ్బిపోవడం మొదలైంది.

మూడేళ్లు వచ్చేసరికి ఆమె బరువు 32 కిలోలకు చేరితే.. అందులో 20 కిలోలు తల బరువే అయింది. తల విపరీతంగా ఉబ్బిపోవడం, నీరు అధికం కావడంతో నేత్రనాడిపై ఒత్తిడి పెరిగి చూపు పోయింది. మెదడుకు రక్త సరఫరా కూడా తగ్గింది. ఇప్పటికే పలుచబడిపోయిన పుర్రె మరింత ఆలస్యం చేస్తే.. ఏ క్షణమైనా పగిలిపోవచ్చని వైద్యులు గుర్తించారు. ఆమెకు 3డీ ప్రింటెడ్ పుర్రెను మార్పిడి చేసి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించారు.
 
17 గంటల్లో ఆపరేషన్...: వైద్యులు తొలుత హాన్ హాన్  పుర్రె పైభాగాన్ని సీటీస్కాన్ చేసి, 3డీ రూపాన్ని డిజైన్ చేశారు. డిజైన్ మేరకు టైటానియం లోహ మిశ్రమంతో 3డీ ప్రింటర్ ద్వారా పుర్రెను 3 భాగాలుగా ముద్రించారు. తర్వాత బాలిక తలపై చర్మాన్ని, పుర్రె పైభాగాన్ని తొలగించి, అదనపు నీటిని మొత్తం తీసేశారు. అనంతరం మెదడును సరిగ్గా ఉంచి, దానిపై 3డీ ప్రింటెడ్ పుర్రె ఇంప్లాంట్లను కలిపి అమర్చి, తల చర్మాన్ని అలాగే ఉంచి కుట్లు వేశారు. బాలిక ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

కొన్నేళ్లలో ఆమె తలలో అమర్చిన ప్రస్తుత ఇంప్లాంట్ల మీదుగా అసలైన పుర్రె ఎముక పెరిగి కొత్త పుర్రె తయారవుతుందని వెల్లడించారు. కాగా, మొత్తం చికిత్స పూర్తయ్యేసరికి రూ. 40-50 లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో పేదవాడైన హాన్ హాన్ తండ్రి ఆన్‌లైన్‌లో విరాళాల కోసం అభ్యర్థించగా ఇప్పటిదాకా రూ. 10 లక్షలు పోగయ్యాయి. ఇంకా విరాళాలు అందుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement