Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్ ‘మొబైల్ మనీ’

Published Thu, Jul 9 2015 3:57 AM

బీఎస్‌ఎన్‌ఎల్ ‘మొబైల్ మనీ’

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల తరహాలో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా సెల్‌ఫోన్‌తో మరిన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టింది. టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు డబ్బును బదిలీ చేసే విధానాన్ని సెల్‌ఫోన్ ద్వారా జరిపే కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్‌ఎన్‌ఎల్... దీన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.
 
రూ.లక్షల లోపు పరిమితితో...
ఈ సేవలు పొందాలనుకునేవారికి బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్‌తో పాటు ఆంధ్రాబ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఈ సేవ కావాలనుకున్న వినియోగదారులకు ఆంధ్రాబ్యాంకు ప్రత్యేకంగా వీసా సర్టిఫైడ్ ప్రీపెయిడ్ కార్డును ఇస్తుంది. దీనికి ప్రత్యేకంగా నంబర్ ఉంటుంది. ఈ కార్డుకు మొబైల్ నంబరును అనుసంధానిస్తారు. ఈ కార్డు గరిష్ట నగదు పరిమితి రూ.లక్ష. వినియోగదారు ఖాతా నుంచి ప్రీపెయిడ్ కార్డులోకి రూ.లక్షకు లోబడి అతను కోరుకున్న మొత్తాన్ని లోడ్ చేసుకోవచ్చు.

అవసరం లేదనుకుంటే అతనే తిరిగి దాన్ని బ్యాంకు ఖాతాలోకి మార్చుకోవచ్చు. షాపింగ్ చేసినప్పుడు బిల్లులను దుకాణదారు దగ్గరుండే ఈ తరహా కార్డుకు మొబైల్ ఫోన్ ద్వారా జమ చేయొచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో ఈ కార్డు నంబరు ద్వారా డబ్బు చెల్లించొచ్చు. బస్సు, రైలు, సినిమా టికెట్ల బుకింగ్, ఫోన్, డీటీహెచ్ సర్వీస్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ చెల్లింపు దీని ద్వారా చేయొచ్చు. ఇక ఇలాంటి కార్డులు ఉన్నవారికి రూ.లక్షకు లోబడి డబ్బును కూడా బదిలీ చేయొచ్చు. ఇలాంటి కార్డు లేనివారికి చెల్లిం చాల్సి వస్తే... సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ రిటైలర్‌కు బదిలీ చేస్తే అక్కడి నుంచి ఆ వ్యక్తి డబ్బు పొందే వీలుంటుంది.

మరో ఐదారు నెలల తర్వాత వేరే బ్యాంకు ఖాతాలకు కూడా చెల్లించే వసతి అందుబాటులోకి తేనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో బ్యాంకు ఖాతాతో సంబం ధం లేకుండా నేరుగా బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నుంచి మరో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌కు నేరుగా నగదు బదిలీ చేసే విధానం కూడా ప్రారంభిస్తామని,

అయితే ఈ మొత్తాన్ని నగదు రూపం లో పొందే అవకాశం ఉండదని.. షాపింగ్, ఇతర అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుం దన్నారు.  కాగా, ఈ సేవలను పొందేవారు 0.30 నుంచి 1 శాతం వరకు కమీషన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. తన బ్యాంకు నుంచి తన కార్డుకు కమీషన్ లేకుండానే నగదును మార్చుకోవచ్చు. కానీ, షాపింగ్ బిల్స్, నగదు బదిలీలకు మాత్రం కమీషన్ చెల్లించాలి.

Advertisement

What’s your opinion

Advertisement