Sakshi News home page

అదనపు జడ్జీల పదవీకాలం 3 నెలల పొడిగింపు

Published Wed, Oct 21 2015 8:28 PM

3 months extension of additional judges

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తులకు అదనపు జడ్జీలుగా పొడిగింపు లభించింది. దీంతో వారు అదనపు జడ్జీలుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

పొడిగింపు లభించిన వారిలో జస్టిస్ బి.శివశంకరరావు, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, జస్టిస్ ఎస్.రవికుమార్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, జస్టిస్ ఎ.శంకర నారాయణ, జస్టిస్ అనిస్‌లు ఉన్నారు. మరో మూడు నెలల పాటు వీరు అదనపు జడ్జీలుగా కొనసాగుతారు.

జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారికి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా ఇచ్చేందుకు కొలీజియం సమావేశమై చర్చించి, తగిన నిర్ణయం తీసుకునేంత వ్యవధి లేకపోవడంతో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న వారికి మరో మూడు నెలల పాటు అదనపు జడ్జీలుగా పొడిగింపునిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల తరువాత వీరికి శాశ్వత న్యాయమూర్తి హోదా లభించే అవకాశం ఉంది.


 

Advertisement

What’s your opinion

Advertisement