Sakshi News home page

స్పీడ్‌ కిల్స్‌!

Published Wed, May 10 2017 11:52 PM

స్పీడ్‌ కిల్స్‌!

సిటీలో వాహనాల సరాసరి వేగం: గంటకు 18 కి.మీ
నిశిత్‌ నారాయణ నడుపుతున్న కారు స్పీడు: గంటకు 205 కి.మీ...
మెర్సిడెస్‌ బెంజ్‌ జీ 63 ఏఎంజీ మోడల్‌ వాహనం గరిష్ట వేగం: గంటకు 230 కి.మీ

అతివేగం..ర్యాష్‌ డ్రైవింగ్‌లతోనే ప్రమాదాలు
నగరంలో ఏటా వేల కేసులు నమోదు
నగర రోడ్లకు–వాహనాలకు పొంతనే లేదు
అడ్డుకోవడానికి అవసరమైన నిబంధనలు కరవు

సిటీబ్యూరో: వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్‌ నారాయణ బుధవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తేలింది. ఈనేపథ్యంలో నగరంలో వాహనాల వేగంపై మరోసారి చర్చ తలెత్తింది. కేవలం ఈ సమయాల్లో, ఈ మార్గాల్లోనే కాదు... సిటీలో ఎక్కడ చూసినా ఓవర్‌ స్పీడింగ్, డేంజరస్‌ డ్రైవింగ్, ర్యాష్‌డ్రైవింగ్స్‌ కనిపిస్తాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారు సైతం 20–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు.  

అదో ప్యాషన్‌గా మారిపోయి...
స్పీడ్‌ థ్రిల్స్‌... బట్‌ కిల్స్‌ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్‌ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. అధికారులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదాన్ని చేకూర్చేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదకరమైనవి. ఓవర్‌ స్పీడింగ్, డేంజరస్‌ డ్రైవింగ్, ర్యాష్‌డ్రైవింగ్‌ ఉల్లంఘనలు మూడో కోవకు చెందుతాయి. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా వాహనచోదకుడినే కాదు అనేక సందర్భాల్లో ఏ పాపం ఎరుగని ఎదుటి వారినీ మింగేస్తాయి. అయినప్పటికీ రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా... ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు.

ఆ రెంటికీ పొంతనే ఉండదు...
నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటకు 18 కి.మీగా ఉంటే...ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిరోధించే చట్టాలు, నిబంధనలు అంటూ మచ్చుకైనా కనిపించవు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్థాయిలో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ చేడుతున్న దాఖలాలు లేవు. ఇవన్నీ సైతం పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.

‘బెల్ట్‌’ అంటే నిర్లక్ష్యం...
ద్విచక్ర వాహనచోదకుడికి హెల్మెట్‌ ఎలానో.. తేలికపాటి వాహనం నడిపే వారికి సీటుబెల్ట్‌ అలానే తప్పనిసరి. అయితే వీటిని ధరించి కార్లు నడుపుతున్న వారి సంఖ్య ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలను డ్రైవ్‌ చేసే వారు మాత్రమే కాదు.. వాటిలో ప్రయాణించే వారు సైతం సీటుబెల్టులు ధరించాల్సిందే. కానీ పాటిస్తున్న దాఖలాలు తక్కువే. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లో జరిగిన నిశిత్‌ నారాయణ ప్రమాదంలో ప్రాణనష్టానికి సీటుబెల్ట్‌ వాడకపోవడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు...
సిటీ ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవలే రేసింగ్స్, ర్యాష్‌డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిని కట్టడి చేయడానికి ‘ఆర్‌ఆర్‌ డ్రైవ్‌’ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. వీటిలో చిక్కిన వారికి జరిమానాతో సరిపెట్టకుండా వాహనాలు స్వాధీనం చేసుకోవడం, కౌన్సిలింగ్‌ వంటి చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement