Sakshi News home page

బ్రాహ్మణులనూ మోసం చేశారు: కోన రఘుపతి

Published Thu, Mar 10 2016 2:03 AM

బ్రాహ్మణులనూ మోసం చేశారు: కోన రఘుపతి - Sakshi

సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది. కానీ తొలి ఏడాది రూ.25 కోట్లు, 2015-16లో రూ.35 కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రతినిధిగా తాను ఒక్కడినే ఈ సభలో ఉన్నానని, ఇందుకు సంతోషపడాలో, ఈ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. బ్రాహ్మణులంటే అందరూ పౌరోహిత్యం చేస్తున్నారనుకుంటున్నారు కానీ చాలామంది బ్రాహ్మణ యువతీ యువకులు అడ్వొకేట్‌ల వద్ద, ఆడిటర్ల వద్ద గుమాస్తాలుగా ఉన్నారన్నారు. సామాజిక సర్వే లేకుండా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, చట్టబద్ధత ఏముంటుందని ప్రశ్నించారు.

 దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం: ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మెట్ల సత్యనారాయణ, సత్యలింగనాయకర్, డి.సత్యనారాయణ రెడ్డికి శాసనసభ బుధవారం నివాళులు అర్పించింది. సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.

Advertisement

What’s your opinion

Advertisement