Sakshi News home page

ఎందుకీ పనికిమాలిన క్యాబినేట్ భేటీలు?

Published Mon, Nov 30 2015 10:59 PM

ఎందుకీ పనికిమాలిన క్యాబినేట్ భేటీలు? - Sakshi

- ఏపీ మంత్రివర్గ సమావేశాల తీరుపై సీపీఐ మండిపాటు

హైదరాబాద్:
కేవలం తాను తలచిన పనులకు ఆమోదముద్ర వేయించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ క్యాబినెట్ మీటింగులు పెట్టి మంత్రుల్ని విసిగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పూటలు, గంటల తరబడి క్యాబినెట్ మీటింగులు పెట్టి సాధిస్తున్నది ఏమిటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ భేటీల్లో ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలేవీ తీసుకోవటంలేదని, ఆ మీటింగులన్నీ పక్కా బోగస్ అని టీడీపీ సర్కార్ పై రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఒక్కో సమావేశానికి ఎంత ఖర్చవుతుందో, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టి, ఎన్ని గంటల సమయం వెచ్చించారో చంద్రబాబు శ్వేత పత్రం విడుదలచేయాలన్నారు.

ఈ ఏడాది సీపీఐ 90వ వార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ నెలంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జాతీయ కార్యవర్గం నిర్ణయించిందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. వార్షికోత్సవాల ముగింపు రోజున (ఈనెల 26న) విజయవాడలో భారీ సదస్సు జరుగుతుందని, దేశంలో హెచ్చరిల్లుతోన్న అసహనం, కరవవుతున్న భావస్వేచ్ఛ, అధిక ధరలు వంటి వాటిపై మంగళవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈనెల 7న దేశరాజధాని ఢిల్లీలో మహాప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement