Sakshi News home page

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి..

Published Thu, Mar 24 2016 4:11 AM

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. - Sakshi

హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే.

ఏమిటీ ఎల్ నినో?

సూర్యుడి తాపానికి భూమధ్య రేఖా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్న పరిస్థితిని ‘ఎల్‌నినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలుడు’ అని దీనికి అర్థం. ఇది నాలుగున్నరేళ్లకోసారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు కురిస్తే... కొన్నిచోట్ల తీవ్రమైన వర్షాభావం, కరువు పరిస్థితులకు కారణమవుతుంది.

ఎల్‌నినో కారణంగా బ్రెజిల్ సహా దాని చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. అదే భారత్‌లో, దక్షిణాసియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్‌నినో కారణంగా వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గత పదేళ్లలో లేనంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 50 ఏళ్లలో సంభవించిన ఎల్‌నినో రికార్డుల ప్రకారం కరువు, వర్షాభావ పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. 2002, 2004, 2009, 2014లలో ఎల్‌నినో రావడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 1953, 1969, 1997 సంవత్సరాాల్లో ఎల్‌నినో ఉన్నా సాధారణ వర్షాలే నమోదయ్యాయి.

లానినో అంటే..
భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉన్న పరిస్థితిని ‘లానినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలిక’ అని దీనికి అర్థం. ఎల్‌నినో క్రమంగా బలహీనపడితే.. ఆ ప్రాంతంలో లానినా ఏర్పడుతుంది. దీంతో దక్షిణాసియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ఎంత తీవ్రంగా ఉంటే.. లానినా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ లెక్కన ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు జూలై తొలి వారం నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎందుకు ఏర్పడుతాయి?
కాలుష్యం పెరగడం, రకరకాల కారణాలవల్ల అడవులు, చెట్ల సాంద్రత తగ్గి పచ్చదనం తగ్గిపోవడమే వాతావరణలో పెను మార్పులకు కారణం. దీనికితోడు వివిధ రసాయనాలు, క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర మందం తగ్గిపోతోంది. భూమిపై పడిన సూర్యరశ్మి కాలుష్య మేఘాల కారణంగా తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందడం తగ్గిపోతోంది. దీంతో భూమి విపరీతంగా వేడెక్కుతోంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎల్‌నినో, లానినో వంటి విపరీతమైన మార్పులకు ఇదే కారణం.

ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావం, మరో ప్రాంతంలో భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు వంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. 1961 నుంచి 1990 వరకున్న సరాసరి ఉష్ణోగ్రత కంటే 2015 నాటికి భూమిపై 0.73 డి గ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని  వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సు తేల్చింది. 0.73 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడమనేది అసాధారణం. ఇటీవల చెన్నైలో ఒకేరోజు 50 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురవడానికి, ఆంధ్రప్రదేశ్‌లోనూ కుండపోత వర్షాలకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement