Sakshi News home page

పోలీస్‌ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు

Published Thu, Dec 15 2016 11:33 PM

పోలీస్‌ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు

సైదాబాద్‌: నగరంలో పోలీస్‌స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మోడల్‌ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటులో భాగంగా గురువారం ఆయన సైదాబాద్‌ పోలీస్‌స్టేన్ నూతన భవనానికి నగర పోలీస్‌కమిషనర్‌ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 23 పోలీస్‌స్టేషన్లను రూ.75 కోట్లతో  మోడల్‌ పీఎస్‌లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో 16 శాంతిభద్రతలు, 6 ట్రాఫిక్, 1 మహిళా పోలీస్‌స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. నేరాలపై కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు.
ప్రజల పోలీస్‌స్టేషన్లు: కమిషనర్‌ మహేందర్‌రెడ్డి
ఇది మా పోలీస్‌స్టేషన్లు అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్‌కమిషనర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌స్టేషన్ను సర్వీస్‌ సెంటర్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు  హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో చీటింగ్, డ్రగ్స్, కల్తీని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్,  ఐజీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, అధికారులు మురళీకృష్ణ, ప్రేమ్‌కుమార్, ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సుధాకర్, కాట్న సత్తయ్య, డీఐ కోరుట్ల నాగేశ్వర్‌రావు, సిబ్బంది,  కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, సామ స్వప్నరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
స్టేషన్ కు రూ.75 వేలు  
కాచిగూడ: రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతున్నామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాచిగూడ పోలీస్‌ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రతి నెలా పోలీస్‌ స్టేషన్లకు రూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో దొంగతనాలు, క్రైమ్‌రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్‌. ప్రభాకర్, కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, కాలేరు పద్మవెంకటేష్, గరిగంటి శ్రీదేవి రమేష్, పోలీస్‌ అధికారులు మల్లారెడ్డి, రవీందర్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement