Sakshi News home page

ఇంకోసారి ఇలాగే చేస్తే.. నీ అంతు చూస్తా..

Published Sat, Aug 8 2015 10:27 PM

sadath crime in hyderabad city

జీడిమెట్ల: 'నాకు డబ్బులు ఇచ్చావని బయట ప్రచారం చేస్తున్నావట.. ఇంకోసారి ఈ విషయం తెలిస్తే నీ అంతు చూస్తా..' అంటూ బెదిరింపులకు దిగిన సాదత్ అహ్మద్‌ను, అతనికి సహకరించిన రబ్బానీని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్సై లింగ్యా నాయక్ కథనం ప్రకారం.. సూరారం కాలనీ పాండుబస్తీకి చెందిన సాదత్ అహ్మద్ గతంలో అక్రమ దందాలు, బెదిరింపులు, భూతగాదాల విషయంలో జోక్యం చేసుకోగా ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరులో జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా బెదిరింపులకు దిగుతూ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. గత నాలుగు నెలలుగా ఇంటినే అడ్డాగా చేసుకుని ఈ తతంగం నడుపుతుండటంతో పోలీసులు అతనిపై కన్నేశారు. ఇటీవల రోడా మేస్త్రీనగర్‌కు చెందిన అబ్దుల్ రజాక్ అనే వ్యక్తిని బెదిరించాడు. గతంలో అతని వద్ద వసూలు చేసిన రూ.1.50 లక్షల విషయాన్ని ఇతరులకు చెప్పాడంటూ తన అనుచరుడు రబ్బానీతో ఇంటికి పిలిపించి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బెదిరిపోయిన రజాక్ వారం క్రితం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సాదత్‌పై ఐపీసీ 384 (దౌర్జన్యం), 506 (బెదిరింపు)ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సాదత్ అహ్మద్, రబ్బానీ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి శనివారం రిమాండ్‌కు పంపారు.

Advertisement

What’s your opinion

Advertisement