మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు | Sakshi
Sakshi News home page

మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు

Published Thu, Dec 18 2014 1:11 PM

మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు

బాగ్దాద్ : ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. కానీ ఆ నరమేధం ఈ సారి సభ్యసమాజం తలదించుకునేలా సాగింది. తమ లైంగికవాంఛ తీర్చలేదని... మహిళలపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణరహితంగా కాల్చారు. ఆ కాల్పుల్లో ఒకరా ఇద్దరా.. ఏకంగా 150 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. అందుకు అడ్డు వచ్చిన 91 మంది పురుషులను అతి కిరాతికంగా చంపిశారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం.  

ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్‌ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు.

ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు తట్టుకోలేక ఫాజుల్లా ప్రాంత ప్రజలు ఇళ్లు విడిచి ఎడారి ప్రాంతాలకు తరలిపోతున్నారని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా వెళ్లిన వారిలో చిన్నారులు చలి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారని మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement