బైరవా ఆడియో నేరుగా మార్కెట్లోకి | Sakshi
Sakshi News home page

బైరవా ఆడియో నేరుగా మార్కెట్లోకి

Published Tue, Dec 20 2016 1:54 AM

బైరవా ఆడియో నేరుగా మార్కెట్లోకి

ఇలయదళపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బైరవా ఆడియోను ఎలాంటి హంగామా లేకుండా నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర సమర్పకుడు బీ.నాగిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పాతాళబైరవి, మాయాబజార్, మిస్సమ్మ, ఎంజీఆర్‌ హీరోగా నటించిన ఎంగవీట్టు పిళ్‌లై, నమ్మనాడు, రజనీకాంత్‌ నటించిన ఉళైప్పాళి, పడిక్కాదవన్, కమలహాసన్ నటించిన నమ్మవర్‌ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు ఇటీవల తామిరభరణీ, వేంగై, వీరం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన విజయాప్రొడక్షన్స్  సంస్థ ద్వారా తాజాగా బీ.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో తాము నిర్మిస్తున్న చిత్రం భైరవా అని పేర్కొన్నారు.

విజయ్, కీర్తీసురేష్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. సంతోష్‌ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం వడపళినిలోని ప్రసాద్‌ స్టూడియో, కోయంబేడులోనూ లక్షలాది రూపాయల ఖర్చుతో 200 బస్సులు, 300కి పైగా దుకాణాలతో ఒక పెద్ద బస్టాండ్‌ను కళ్లముందుకు తెచ్చే విధంగా సెట్‌ వేసి విజయ్‌ 1,000 మంది సహాయ ఆర్టిస్టులు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అదే విధంగా స్థానిక బిన్ని మిల్లులో ఒక బ్రహ్మాండమైన భైరవ ఆలయ సెట్‌ వేసి చిత్రీకరించినట్లు చెప్పారు. స్విడ్జర్లాండ్‌లో విజయ్, కీర్తీసురేష్‌లపై 12 రోజుల పాటు ఒక పాటను చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను గ్రాండ్‌గా నిర్వహించాలనుకున్నట్టు  తెలిపారు.

అయితే ఇటీవల ముఖ్యమంత్రి జయలలిత మరణం కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. కారణం అమ్మ తాము నిర్మించిన నమ్మనాడు చిత్రంలో నటించారని, ఆమెను తాము తమ కుటుంబంలో ఒకరిగా భావించామని అన్నారు. ఇదే అభిప్రాయాన్ని నటుడు విజయ్‌ వ్యక్తం చేస్తూ భైరవా చిత్ర ఆడియో వేడుకను భారీగా నిర్వహించవద్దని కోరారన్నారు. అందువల్ల ఈ చిత్ర ఆడియోను ఈ నెల 23న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement