Sakshi News home page

ఇది దీపికా పదుకొనే సర్వీస్!

Published Sun, Oct 11 2015 11:13 PM

ఇది దీపికా పదుకొనే సర్వీస్! - Sakshi

అందంగా, నాజూగ్గా ఉండడం వేరు. అద్భుతమైన అభినయం ప్రదర్శించడం వేరు. ఈ రెండు వేర్వేరు అంశాలూ కలబోసిన బాలీవుడ్ నటి అంటే, ఇప్పుడున్న తారల్లో దీపికా పదుకొనే పేరే ముందు చెప్పుకోవాలి. ‘గోలియోం కీ రాస్‌లీలా... రామ్‌లీలా’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ - ఇలా ఏ రకమైన సినిమా అయినా తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచారు - దీపిక. అయితే, ఇంత అందం, ఆదరణ, పేరు, డబ్బు ఉన్న నటి కూడా ఒకానొక టైమ్‌లో డిప్రెషన్‌కు లోనయ్యారు. ఒంటరితనం, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన ఆమె ఆ తరువాత కుటుంబ సభ్యుల సహాయంతో, వైద్యుల సహకారంతో తొందరగానే బయటపడ్డారు.
 
 ‘నా లాగా ఎందరో...’ అని భావించిన దీపికా పదుకొనే ఇప్పుడు అలాంటివారందరికీ అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ‘లివ్... లవ్... లాఫ్ ఫౌండేషన్’ పేరిట అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీవో)ను స్థాపించారు. ముంబయ్‌లో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో ఇటీవలే ఈ సంస్థను ప్రారంభించారు. ప్రముఖులతో పాటు తన తల్లితండ్రులు ప్రకాశ్, ఉజ్జ్వల సమక్షంలో, ఈ ప్రయత్నం గురించి దీపికే స్వయంగా వివరించారు. ‘‘ఈ ప్రయత్నం నా మనసుకు ఎంతో సన్నిహితమైనది. ఒకప్పుడు డిప్రెషన్‌లో కూరుకుపోయిన నాకు అలాంటి పరిస్థితుల్లోని వారు ఎంత బాధలో ఉంటారో తెలుసు. అందుకే, నా వ్యక్తిగత అనుభవాన్ని ఆసరాగా చేసుకొని, అందరికీ సాయపడదలిచా’’ అని దీపిక చెప్పారు.
 
 ‘‘శారీరక అనారోగ్యం గురించి మాట్లాడినంత ఈజీగా మనం మాట్లాడడానికి ఇష్టపడని మానసిక సమస్య గురించి అందరిలో అవగాహన కలిగించడానికే ఈ ప్రయత్నం’’ అని ఆమె అన్నారు. డిప్రెషన్‌కు లోనై, దానిలో నుంచి ఎలా బయటపడాలో తెలుసుకొనే క్రమంలో తాను మరింత మెరుగైన వ్యక్తిగా మారినట్లు ఈ అందాల భామ చెప్పారు. జీవితాన్ని అంతం చేసుకోవాలనేంత డిప్రెషన్‌లోకి వెళ్ళే వారందరికీ కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగించడం ఈ ఎన్జీవో లక్ష్యం. ఈ సంస్థ తాలూకు వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. మొత్తానికి, దీపిక సినిమాలతో సరిపెట్టుకోకుండా సమాజానికి ఉపయోగపడే పనిలోనూ దిగిందండోయ్! స్టార్స్ స్వయంగా ఇలాంటి సర్వీస్ చేపడితే... విషయం జనంలోకి తొందరగా వెళుతుంది కదూ!
 

Advertisement

What’s your opinion

Advertisement