50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్‌ నేర్చుకుంది.. | Sakshi
Sakshi News home page

గయ్యాళి కాదు ఉత్త బోళా మనిషి

Published Wed, Mar 18 2020 7:52 AM

Suryakantham Son Padmanabha Murthy Special Interview - Sakshi

గళ్ల లుంగీ, బుగ్గ మీద గాటు ఉన్న రౌడీని చూసిన దాని కంటే సూర్యకాంతమ్మను చూస్తే ప్రేక్షకులకు దడుపు ఎక్కువ.ఎవరిని ఏం బాధలు పెడుతుందో. ఎవరిని రాచిరంపాన పెడుతుందో.ఆమె తలుచుకుంటే ఎవరి జీవితమైనా నాశనం అయిపోతుంది.అందుకే తెలుగువారు తమ ఆడ పిల్లలకు‘సూర్యకాంతం’ అనే పేరే పెట్టడం మానేశారు.తెరమీద ఇంతగా నమ్మించగలిగిందంటేఆమె ఎంత గొప్ప నటి అయ్యుండాలి. ఎంతో సౌమ్యురాలు, అమాయకురాలు, స్నేహశీలి అయినసూర్యకాంతం గురించి ఆమె కుమారుడు పద్మనాభమూర్తి పంచుకున్న జ్ఞాపకాలివి.

అమ్మకు ఆరేళ్ల వయస్సులోనే మా తాతయ్య చనిపోవడంతో వాళ్ల పెద్దక్క, బావల దగ్గర పెరిగింది. అమ్మ అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు పెద్దగా ఒంట పట్టలేదు. సినిమాల మీద మక్కువ కలిగింది. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి, పృథ్వీరాజ్‌ కపూర్‌ నటించిన హిందీ చిత్రాలు చూసేదట. సినిమాల మీద వ్యామోహంతో, పెద్దక్క ఒప్పుకోకపోయినా అమ్మమ్మతో కలిసి మద్రాసు వచ్చేసిందట. నారదనారది (1946) అమ్మ మొదటి చిత్రం. మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకుందట. కాని ఒకసారి అమ్మ పడిపోవటంతో, మ¬క్కు మీద మచ్చ పడిందట. క్లోజప్‌లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక నాయిక పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయిందట. 1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ చిత్రంతో అమ్మ గయ్యాళి పాత్రలకు చిరునామాగా మారిపోయింది. ఒక్కసారి డైలాగ్‌ వింటే చాలు వెంటనే వచ్చేసేది. ఒకే టేక్‌లో ఓకే అయిపోయేదట. డైలాగ్‌ పలకడంలో విచిత్రమైన మాట విరుపు, ఎడమ చేతివాటం...ఈ రెండు ప్రత్యేకతలూ అమ్మను గొప్ప నటిని చేశాయి.

పది భాషలు వచ్చు..
అమ్మ స్కూల్‌ చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే గానీ పది భాషలు అవలీలగా మాట్లాడగలదు. మద్రాసు వచ్చాక ఇంగ్లిషు, 50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్‌ నేర్చుకుంది. బెంగాలీ అంటే అమ్మకు చాలా ఇష్టం. దిన పత్రికలు, పుస్తకాలు, నవలలు, పురాణేతిహాసాలు బాగా చదివేది. ఆంధ్రపత్రిక పేపరు ఆలస్యం అయితే చాలు పేపరు బాయ్‌ను నిలదీసేది.

క్రమశిక్షణతో ఉండేది..
తెల్లవారుజామునే నిద్రలేవడం, పూజ చేసుకోవడం, వంట పూర్తిచేసి, మాకు క్యారేజీలు పెట్టి, తన కోసం సిద్ధం చేసుకున్న క్యారేజీలతో షూటింగ్‌కు వెళ్లడం ఆవిడ దినచర్య. ఇంటికి వచ్చే బంధువుల కోసం నిమిషాల్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసేది. అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో కూడా అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చేది.ఉన్నంతలో దానధర్మాలు చేసింది. చిన్న చిన్నపత్రికలకు ఆర్థికంగా సహాయపడింది.

పద్మనాభ మూర్తి
చిన్నతనంలోనే..
మా అమ్మ (సూర్యకాంతం) నాకు స్వయానా పిన్ని. నేను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తతు తీసుకుని మద్రాసులోనే బారసాల చేసిందట.కాకినాడ సమీపంలో ఉన్న వెంకటరాయపురం అమ్మ పుట్టిల్లు. మా తాతయ్యను నాలో చూసుకునేందుకే నాకు అనంత పద్మనాభమూర్తి అనే పేరు పెట్టి, నన్ను ‘నాన్నా’ ‘నానీ’ అని పిలిచేది. నాన్నగారు పెద్దిభొట్ల వెంకట చలపతిరావు. నన్ను కన్న తల్లి (సత్యవతి) ఇంటి పేరును నిలపడం కోసం ‘దిట్టకవి’ ఇంటి పేరునే కొనసాగించింది. నేను స్కూల్‌కి ప్రతిరోజూ కారులోనే వెళ్లేవాడిని. డ్రైవర్‌ రాకపోతే ఇంట్లో పనివాళ్లు సైకిల్‌ మీద స్కూల్‌లో దింపేవారు. ఆ స్కూల్‌లో ఒక ల్యాబ్‌ కట్టడానికి అమ్మ పదిహేను వేల రూపాయలు డొనేషన్‌ ఇచ్చింది. నేను ఎం. కామ్‌ చదువుకున్నాను. చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాని దూరమని పంపలేదు. ఆ తరవాత చెన్నై మైలాపూర్‌ ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దగ్గరగా ఉండటంతో అమ్మఅనుమతితో చేరాను.

శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని ఆదరించి అన్నం పెట్టేది. లైట్‌ కలర్స్‌ బాగా ఇష్టపడేది. నలుపు రంగంటే అస్సలు ఇష్టం లేదు అమ్మకు. ఒకసారి లైట్‌ బ్లూ కలర్‌ కారు బుక్‌ చేస్తే వాళ్లు బ్లాక్‌ కలర్‌ ఇచ్చారు. అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది అమ్మ. అమ్మే స్వయంగా కారు డ్రైవ్‌ చేసేది. 1994లో అమ్మ కన్నుమూసింది. అమ్మ కాలం చేసి పాతికేళ్లు దాటినా సూర్యకాంతం గారి అబ్బాయిగా నేను పొందే ప్రేమాభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు ఎవ్వరూ అపహరించేందుకు వీలులేని తరగని ఆస్తి. అమ్మను పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా, తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తిప్రతిష్టలతో ఆమెను వారి గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు.

భయస్తురాలు..
అమ్మ ఎవరిని ఏ వరసలో పిలిస్తే, నేనూ అలాగే పిలిచేవాడిని. అమ్మ వాళ్ల అక్కయ్యలను.. దొడ్డమ్మ అనకుండా దొడ్డక్క అని పిలిచేవాడిని. అమ్మ ఎక్కడకు వెళ్లినా తన వెంటే నన్ను తీసుకువెళ్లేది. నాకు ఒంట్లో బాగా లేకపోతే ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కేది. దేవాలయాలకు వెళ్లినప్పుడు హుండీలో నా చేత డబ్బులు వేయించేది, నా పేరున అర్చనలు చేయించేది. అమ్మ దయ వల్ల చాలా బాగా ఉన్నాను. అమ్మకి ఎవరి మీద అభిమానం, గౌరవం ఉండేవో వాళ్లకి ఏదైనా అవుతుందేమోనని భయం ఎక్కువగా ఉండేది. జగపతి పిక్చర్స్‌ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారికి యాక్సిడెంట్‌ అయినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది అమ్మ. ఆయనకు తగ్గాక అందరికీ భోజనాలు పెట్టింది. ఎవరికి ఒంట్లో బావుండకపోయినా, వాళ్ల తరపున అర్చనలు చేయించేది, మొక్కులు తీర్చేది. మా పుట్టినరోజు నాడు గుడికి తీసుకెళ్లి, పూజలు చేయించి, ఇంటికి వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టేది. కేక్‌ కట్‌ చేయటం అమ్మకు ఇష్టం లేదు.

నెయ్యి అంటే చాలా ఇష్టం..
అందరం కలిసి అన్నం తినాలనేది అమ్మ. ఒక్కోసారి అమ్మ వండుకున్న కూర అమ్మకే నచ్చేది కాదు. వెంటనే ‘నాన్నా! నెయ్యి వేసి మాగాయి అన్నం కలిపి పెట్టరా’ అనేది నాతో. అమ్మకు నెయ్యి – మాగాయి, నెయ్యి – ఆవకాయ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కరోజు కూడా నెయ్యి లేకుండా అన్నం తినేది కాదు. ఎన్ని మానేసినా, నెయ్యి మాత్రం మానలేదు అమ్మ.

అన్నీ అమ్మే చూసింది..
నా వివాహం అమ్మే కుదిర్చి చేసింది. నా భార్య పేరు ఈశ్వరిరాణి. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సూర్య సత్య వెంకట బాల సుబ్రహ్మణ్యం చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అమ్మాయి జయలక్ష్మి ఎంబిఏ చదివి, గీతమ్‌ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తోంది. మా ఇంటి మొత్తానికి ఒక్క గదిలోనే ఏసీ ఉండేది. అందరం ఆ గదిలో చేరి కబుర్లు చెప్పుకునేవాళ్లం.

అమ్మ చేతి వంట... నోరూరేనంట..
అమ్మ చేతి వంట అమృతంలా ఉండేదనుకునేవారు సినిమా వారంతా. అమ్మకు బయట తిండి తినే అలవాటు లేదు. అందుకే షూటింగులకు వెళ్లేటప్పుడు తనకు మాత్రమే కాకుండా, షూటింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసమూ వంట చేసి తీసుకెళ్లేది. అమ్మ రాక కోసం అందరూ ఎదురు చూసేవారు. ఎన్‌టిఆర్‌ ‘అక్కయ్యగారూ! ఏం తెచ్చారు?’ అని అడిగి మరీ తినేవారు.

పెరుగన్నమే.. టిఫిన్‌ లేదు..
పొద్దున్నపూట టిఫిన్‌ కాకుండా పెరుగన్నమే తినాలి. నేను పదవీ విరమణ చేసేవరకూ ఉదయం పెరుగన్నమే తిన్నాను. ఇంటికి ఎవరు వచ్చినా ‘మజ్జిగ తాగుతారా! అన్నం తింటారా!’ అని అడిగేది. కాఫీ టిఫిన్లు ఇచ్చేది కాదు. ఆవిడ చాలా సింపుల్‌. జనసమ్మర్దంలోకి వెళ్లాలంటే అమ్మకి చాలా భయం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవాలయాలకు, బీచ్‌లకు రద్దీ లేని సమయంలో నన్ను తీసుకుని వెళ్లేది. అమ్మ చాలా రిజర్వ్‌డ్‌. అప్పట్లో సినిమా వారంతా టి నగర్‌లో ఉంటే, మేం మాత్రం సిఐటీ కాలనీలో ఉండేవాళ్లం.

అన్నీ చదివి వినిపించాలి..
అమ్మ నాకు తెలుగు నేర్పించింది. అన్ని రకాల పుస్తకాలు కొని తను చదివాక, నా చేత చదివించేది. నేను మూస ధోరణిలో చదువుతుంటే, ‘ఆడ మగ గొంతు మార్చి చదివితేనే బాగుంటుంది, అప్పుడే అర్థమవుతుంది’ అనేది. ఆవిడ మరణించాక అర్థమైంది పుస్తకాలు చదవటం వల్ల లోకజ్ఞానం వస్తుంది కాబట్టే చదివించిందని. అమ్మను ఎన్నటికీ మరువలేను.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై
– వైజయంతి పురాణపండ

Advertisement
Advertisement