Sakshi News home page

మీ దోస్త్ ల నల్లధనం తెచ్చె దమ్ముందా

Published Mon, Feb 24 2014 12:20 AM

మీ దోస్త్ ల నల్లధనం తెచ్చె దమ్ముందా - Sakshi

 మోడీకి కేజ్రీవాల్ సవాల్
 దేశాన్ని నడిపిస్తున్నది అంబానీయే
 హర్యానా నుంచి ఆప్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

 
 రోహ్తక్ (హర్యానా): అధికారంలోకి వస్తే విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానంటున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘‘ఒకవేళ ప్రధాని పదవి చేపట్టాక నీ మిత్రులైన పారిశ్రామికవేత్తలు స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆదివారం హర్యానాలోని రోహ్తక్‌లో హుంకార్ ర్యాలీ పేరుతో ఆప్ ఎన్నికల ప్రచారాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పారి శ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని తెరవెనక నుంచి ఆయనే నడుపుతున్నారని ఆరోపించారు. ఒక జేబులో మోడీని మరో జేబులో రాహుల్‌గాంధీని పెట్టుకున్నారని, ఆయన కావాలనుకున్నప్పుడు మోడీకి ఐదేళ్లు, రాహుల్‌కు మరో ఐదేళ్లు పాలనా పగ్గాలు ఇవ్వగలరని దుయ్యబట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన 49 రోజుల పరిపాలనలో నెరవేర్చిన హామీలు, మీడియాలో ఓ వర్గం అనుసరిస్తున్న పక్షపాత ధోరణి, అవినీతిపై పోరు తదితర అంశాల గురించి తన 45 నిమిషాల ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.
 
 కేజ్రీవాల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
     అవినీతిలో మోడీ, రాహుల్ దొందూ దొందే. వారిద్దరూ పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తారు.
 
     అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమో లేక బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమో ముకేశ్ అంబానీకి ముందే తెలుస్తుంది. ఆయనకు ఏ ప్రభుత్వం వచ్చినా లాభమే. దీనికి మనమంతా తెరదించాలి.
 
     రిలయన్స్‌కు అనుకూలంగా సహజ వాయువు ధర పెంపులో కేంద్రం తీరుపై స్పందించాలంటూ మోడీ, రాహుల్ కు లేఖ రాసినా నోరుమెదపలేదు.
 
     {పచారానికి రాహుల్, మోడీ భారీగా ఖర్చు చేస్తున్న సొమ్ము ఎక్కడి నుంచి వస్తోందో వారు చెప్పగలరా?
 
     హర్యానా సీఎం భూపిందర్‌సింగ్ హూడాను స్థిరాసి డీలర్‌గా అభివర్ణిస్తున్నా. ఎందుకంటే ఆయన రైతుల నుంచి భూములు లాక్కొని రిలయన్స్ వంటి కంపెనీలతోపాటు సోనియా అల్లుడైన రాబర్ట్ వాద్రా వంటి వ్యాపారవేత్తలకు కారుచౌకకు కట్టబెట్టారు.
 
     మీడియాలోని ఒక వర్గం కూడా పక్షపాత ధోరణి అవలంబిస్తోంది. స్వార్థ ప్రయోజనాలుగల బడా పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో నడుస్తోంది.
 
     లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో పెట్టనివ్వకుండా కాం గ్రెస్, బీజేపీలు కుమ్మక్కై అడ్డుకున్నందుకు పార్టీ సిద్ధాంతాలపై రాజీపడకుండా సీఎం పదవికి నేను రాజీనామా చేస్తే పరిపాలన చేతగాక పారిపోయినట్లు కొన్ని పత్రికలు, చానళ్లు విమర్శించాయి.
 
     మీడియా ఒపీనియన్ పోల్స్ ఫలితాల వెనక పెద్ద మొత్తం చేతులు మారుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 2-3 సీట్లే వస్తాయని సర్వేలు చెప్పగా అవి తప్పని నిరూపిస్తూ 28 సీట్లు గెలుచుకున్నాం.
 
     ఓ టీవీ చానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ శనివారం నన్ను కలిశారు. చానల్‌లో రాహుల్, మోడీలను మాత్రమే చూపించాలంటూ వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక, అది నచ్చక పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.
 

Advertisement

What’s your opinion

Advertisement