Sakshi News home page

ఆధార్‌ లక్ష్యంగా సైబర్‌ క్రైమ్‌!

Published Wed, Jan 10 2018 1:19 AM

Cyber crime targets Aadhaar - Sakshi

న్యూఢిల్లీ: 115 కోట్ల మంది ఆధార్‌ సమాచార భద్రతపై సందేహాలు తలెత్తుతున్న వేళ, భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అనుబంధ సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక మరింత ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌ నేరగాళ్లకు, దేశం బయటి శత్రువులకు ఏకైక లక్ష్యంగా ఆధార్‌ మారగలదనీ, వారి చేతుల్లోకి ఆధార్‌ సమాచారం వెళితే ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల వ్యక్తిగత గోప్యతకు కలిగే నష్టాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదని ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ’ (ఐడీఆర్‌బీటీ) పేర్కొంది.

ఐడీఆర్‌బీటీలో అధ్యాపకుడిగా పనిచేసే ఎస్‌.అనంత్‌... ‘బయోమెట్రిక్, భారత్‌లో దాని ప్రభావం’ పేరుతో గత అక్టోబర్‌లో ఓ నివేదికను రూపొందించారు. ఇందులో ఆధార్‌ సమాచార భద్రత, ఎదుర్కొనాల్సిన సవాళ్లను ఆయన పొందుపరిచారు. రూ.500కే దేశంలో ఎవరి ఆధార్‌ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఈనెల 3న ‘ద ట్రిబ్యూన్‌’ ఆంగ్ల పత్రిక బయటపెట్టడం, తర్వాత ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం కేసు నమోదు చేయించి విమర్శలపాలవుతున్న నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


భద్రత తొలి సవాల్‌: ‘అనేక రకాల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సవాళ్లను ఆధార్‌ ఎదుర్కొంటోంది. బయోమెట్రిక్‌ సహా ఆధార్‌ సమాచారాన్ని భద్రంగా కాపాడటం, ఎవరు పడితే వారు ఆ సమాచారాన్ని పొందకుండా నిరోధించడం మొదటి సవాల్‌. బ్యాంకింగ్‌ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పథకాలకు బయోమెట్రిక్‌ విధానం ఇప్పుడు విస్తరించింది. దేశంలో తరచూ సైబర్‌ దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో 115 కోట్ల మంది బయోమెట్రిక్‌ సమాచారాన్ని కాపాడటమే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ–యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ముందున్న ప్రధాన సవాల్‌’ అని అనంత్‌ ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆధార్‌ కార్డు కలిగిన 115 కోట్ల మంది బయోమెట్రిక్‌ వివరాలు జాతీయ ఆస్తి అనీ, బయోమెట్రిక్‌ లేదా ఇతర ఆధార్‌ సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే ఆ నష్టాన్ని మనం ఊహించడం కూడా సాధ్యం కాదని ఆయన అంటున్నారు. ఆధార్‌ను ఉపయోగించడం పట్ల ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అనంత్‌ సూచించారు.
 

లాభమో కాదో కాలమే చెప్పాలి
ఆధార్‌తో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదని అనంత్‌ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో బోగస్‌లను ఏరివేసి అసలైన లబ్ధిదారులకే ఫలాలు అందేలా, నేరుగా బ్యాంకు ఖాతాలోకే సబ్సిడీలు చేరేలా చేయడమే ఆధార్‌ ప్రధాన ఉద్దేశం.

ఆధార్‌ వల్ల రూ.14,672 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం చెబుతుండగా, దీనిపై పరిశోధించిన కెనడా సంస్థ మాత్రం ఆధార్‌ వల్ల ప్రభుత్వానికి రూ.97 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఆధార్‌కు చేస్తున్న ఖర్చు కన్నా ఎక్కువ డబ్బును ప్రభుత్వం ఆదా చేసుకోగలదో లేదో భవిష్యత్తులో కాలమే చెబుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని నివేదికలో అనంత్‌ పేర్కొన్నారు. కాగా, ఆధార్‌ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 17 నుంచి విచారించనుంది.

Advertisement

What’s your opinion

Advertisement