కొనసాగుతున్న అనిశ్చితి | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అనిశ్చితి

Published Wed, Oct 29 2014 10:56 PM

Delhi LG to talk to parties on govt formation, meets Rajnath

 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించడం కోసం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు రోజులకొద్దీ కొనసాగే అవకాశముంది కనుక గురువారం సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ విచారణ కొచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొంత వెసులుబాటు లభించవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై జాప్యం చేయడాన్ని సుప్రీం కోర్టు ఎల్జీని, కేంద్రాన్ని మందలించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి విదేశీ యాత్ర నుంచి తిరిగివచ్చిన నజీబ్‌జంగ్ బుధవారం ఉదయం హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.
 
 రాజధానిలో సర్కారు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేముందు తాను అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలనుకుంటున్నట్లు జంగ్ హోమ్ మంత్రికి తెలిపారు. ఆ తరువాత ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను అన్వేషించేందుకు రాష్ట్రపతి అనుమతించిన దృష్ట్యా లెఫ్టినెంట్ గవర్నర్ రానున్న రోజులలో రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తారని ఈ ప్రకటన పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ మొదట అసెంబ్లీలో అతి పెద్ద పార్టీఅయిన బీజేపీని చర్చలకు ఆహ్వానిస్తారని, ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లతో సంప్రదింపులు జరుపుతారని ఎల్జీ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. అయితే లెఫ్టినెంట్ గవర్నర్  తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే అవకాశముందని రాజకీయ పండితులు అంటున్నారు.
 
 ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేక ఎన్నికలకు వెళ్లాలా అన్న మీమాంస నుంచి బీజేపీ ఇంకా బయటపడలేదు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం మాట మార్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ తమ పార్టీని ఆహ్వానించినట్లయితే ఆ విషయాన్ని పరిగణిస్తామని చెప్పారు. బీజేపీలో ఊగిసలాటకు వెంకయ్య నాయుడు మాటలు అద్దం పట్టాయి. పార్టీ ఎమ్మెల్యేలలో పలువురితో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంవైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అయితే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడానికి, తన వైఖరి స్పష్టం చేయడానికి జంకుతోందని రాజకీయపండితులు అంటున్నారు.
 
 ఎల్జీది కాలయాపనే: ఆప్, కాంగ్రెస్
 ప్రభుత్వం ఏర్పాటు కోసం అన్ని పార్టీల నేతలతో చర్చలు జరపాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విమర్శించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ బుధవారం నాడే అన్ని రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించి సాయంత్రం వరకు తుది నిర్ణయం తీసుకుని దానిని గురువారం కోర్టుకు తెలియచేయవచ్చని ఆమ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ పట్ల పక్షపాతం చూపుతున్నారని ఆయన ఆరోపించారు. నజీబ్ జంగ్‌తో కుమ్మక్కైన బీజేపీ తెరవెనుకనుంచి ప్రభుత్వం నడుపుతోందని ఆయన ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగాన్ని సంరక్షించడానికి బదులు బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని పార్టీలను పిలిచి ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై చర్చలు జరపాలని తాము ఎనిమిది నెలలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇన్నాళ్లు ఆ పని చేయని ఎల్జీ ఇప్పుడు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని అంటున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎన్నికలకు వెనుకాడుతోందని, అందుకే లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గురువారం సుప్రీంకోర్టులో విచారణను మరో నెలరోజుల పాటు వాయిదా వేయించుకోవడానికే ఎల్జీ చర్చలంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
 
 ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌పై ధ్వజమెత్తింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలుచేయడానికి ఎల్జీ బీజేపీకి సమయం ఇస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీలో సంఖ్యా బలం లేని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. కేంద్రంలోనున్న వారిని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మెప్పించడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తాత్సారం చేస్తూ ఇతర పార్టీల శాసనభ్యులకు వలవేయడానికి బీజేపీకి తగిన సమయం ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ ఆరోపించారు.
 

Advertisement
Advertisement