సీజేఐగా జస్టిస్‌ ఖేహర్‌ | Sakshi
Sakshi News home page

సీజేఐగా జస్టిస్‌ ఖేహర్‌

Published Thu, Jan 5 2017 2:47 AM

సీజేఐగా జస్టిస్‌ ఖేహర్‌ - Sakshi

న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ జగదీష్‌ సింగ్‌ ఖేహర్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 64 ఏళ్ల జస్టిస్‌ ఖేహర్‌ ఆంగ్లంలో దేవుని పేరిట ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ పదవీ కాలం జనవరి మూడుతో ముగియడం తెలిసిందే. తన స్థానంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ ఖేహర్‌ పేరును గత నెలలో జస్టిస్‌ ఠాకూర్‌ సిఫార్సు చేయడమూ విదితమే. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు జస్టిస్‌ ఖేహర్‌ సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్‌ ఖేహర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పలు కీలక ధర్మాసనాల్లో..
జస్టిస్‌ ఖేహర్‌ సుప్రీంకోర్టులో కీలక తీర్పులు వెలువరించిన పలు ధర్మాసనాల్లో పాలుపంచుకున్నారు. జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ)ను రద్దు చేయడమేగాక.. అత్యున్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వం వహించడం తెలిసిందే.

Advertisement
Advertisement