ఆవుల కన్నా మేం అధ్వాన్నమా? | Sakshi
Sakshi News home page

గోవులకన్నా మేము అధ్వాన్నమా: బీహెచ్‌యూ

Published Mon, Sep 25 2017 3:09 PM

police action in bhu

సాక్షి, న్యూఢిల్లీ : బనారస్‌ యూనివర్శిటీలో శనివారం నాడు తమకు తగిన భద్రత కల్పించాలంటూ నినదించిన విద్యార్థినలపై పోలీసులు పాశవికంగా దాడి జరపడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఆదివారం నాడు కూడా కొనసాగడంతో సోమవారం నుంచి యూనివర్సిటీకి ముందస్తు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీలో తాము ప్రశాంతంగా తిరగలేకపోతున్నామని, తమపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి రాక సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేయడంపై పోలీసులు తమ లాఠీ విన్యాసం చూపించిన విషయం తెల్సిందే. 

విద్యార్థినులను చితకబాదుతున్న చిత్రాలకు సంబంధించి వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో ఆగ్రహించిన  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాల్సిందిపోయి ఎవరు తమ సెల్‌ఫోన్‌లో ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారో పట్టుకొని బొక్కలో వేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదంతా జాతీయ వ్యతిరేకులు, నరేంద్ర మోదీ రాజకీయ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత మోదీ మొదటిసారి తన పార్లమెంట్‌ నియోజక వర్గంలో పర్యటించేందుకు వారణాసి వస్తున్న సందర్భంగానే బనారస్‌ హిందూ యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన చేయవచ్చు.

వారి ఉద్దేశం యూనివర్సిటీలో కూడా తమకు రక్షణ లేకపోతోందని, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయనే విషయాన్ని వారణాసి ఎంపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దష్టికి తీసుకెళ్లడం మాతమే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మోదీ పర్యటన బనారస్‌ యూనివర్శిటీ మీదుగా కొనసాగాల్సి ఉంది. అయితే యూనివర్సిటీలో శనివారం విద్యార్థులు ఆందోళన చేయాలని నిర్ణయించడంతో భారీ ఎత్తున యూపీ ప్రభుత్వం క్యాంపస్‌లో పోలీసులను మోహరించింది. పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించడంతో ప్రధాన పర్యటన రూటును మార్చారు. ఆదిత్యనాథ్‌ యోగి ఆదేశం మేరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు తమ లాఠీ ప్రతాపం చూపారు. 


పర్యవసానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి యూనివర్శిటీని దసరా సెలవులు ఉండగా, మూడు రోజుల ముందుగా, అంటే సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. విద్యార్థినీ విద్యార్థులను హాస్టళ్లను ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంత గొడవ జరుగుతున్న ప్రధాని మోదీ తమ భద్రత గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అన్యాయమని యూనివర్శిటీ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మోదీ మగాళ్ల ఆధిపత్యవాదనే విషయం దీనివల్ల నిజమేమోనని అనిపిస్తుందని వారన్నారు. శనివారమంతా ఆవుల ఆరోగ్య పరీక్షలను పర్యవేక్షిస్తూ మూగజీవుల హక్కులను పట్టించుకున్న మోదీ, నోరు విప్పి హక్కుల గురించి మాట్లాడుతున్న తమ గురించి ఎందుకు పట్టించుకోరని, ఓటు హక్కులేని ఆవులకంటే ఓటు హక్యు, రాజ్యాంగ హక్కులు కలిగిన తాము తీసిపోయామా? అని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఇజ్జత్‌ ఘర్‌ నినాదంతో మహిళల మానరక్షణకు మరుగుదొడ్లు అత్యవసరమంటూ చెబుతున్న మోదీ, తమ మాన, ప్రాణాల మీద జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోరని విద్యార్థి నాయకురాలు వందనా సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. విద్యార్థినులపై పోలీసులు జరిపిన పాశవిక దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ‘బీహెచ్‌యూ బజ్‌’ పేరిట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఆదిత్యనాథ్‌ యోగికి పరిపాలనలో పరిణితి లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్లనే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement