Sakshi News home page

మగ్గాల రోదన ఇంకెన్నాళ్లు ?

Published Fri, May 9 2014 1:20 AM

మగ్గాల రోదన ఇంకెన్నాళ్లు ?

అంతరించి పోతున్న చేనేతకు రాయితీలూ, సబ్సిడీలూ వ్యర్థమని ప్రభుత్వాల అభిప్రాయం. ఇలాంటి విధానాలతో చేనేతను నొప్పి తెలియకుండా, నిశ్శబ్దంగా పూర్తిగా చంపేయవచ్చని వారంతా భావిస్తున్నారు.  రాజ్యాంగం ప్రసాదిస్తున్న విద్య, వైద్యం, కనీసం గృహవసతి లాంటి సౌకర్యాలు చేనేతలకు లేవు.
 
 చేనేత పరిశ్రమ నానాటికీ జవజీవాలు కోల్పోతోంది. చేనేతే జీవనోపాధిగా బతుకుతున్న కార్మికులను ప్రభుత్వాలు తమ విధానాలతో దుర్భర పరిస్థితుల లోకి నెట్టివేస్తున్నాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు దేశ చరిత్రలో చేనేతది గర్వించదగిన పాత్రే. జాతీయ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఆ పరిశ్రమకు ఉంది.  మన జాతీయ పతాకంలోని రాట్నంతో అనుబంధం ఆ పరిశ్రమకే సొంతం. కానీ ఇప్పుడు అదంతా గతం.
 
మరమగ్గాలతో మరణ మృదంగం
 వర్తమానం విసురుతున్న సవాళ్లకు చేనేత పరిశ్రమ తల్లడిల్లిపో తున్నది. ఉపాధి కోల్పోతున్న కార్మికులు ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఏఒక్కటీ కార్మికుల కడగండ్లు తీర్చలేదు. మారుతున్న కాలం, యంత్రయుగం చేతివృత్తులకు మరణశాసనం లిఖించాయి. ముఖ్యంగా చేనేత రంగంలో ఆకలిచావులు, అనారోగ్య చావులు, అప్పుల ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా మారాయి. మర మగ్గాలు మొత్తం ధ్వంసం చేశాయి.  
 
చేనేత సృష్టించుకున్న డిజైన్లను ఏఒక్కటీ వదిలిపెట్టకుండా రాష్ట్రంలో పవర్‌లూమ్స్ కబ్జాచేసి, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌లను ఖాతరు చేయకుండా, నకిలీ వస్త్రాలను మార్కెట్‌లోకి తెచ్చి చేనేతను చావుదెబ్బ తీస్తున్నా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు.  రిజర్వేషన్ పవర్‌లూమ్ లాబీ మీద వీరోచిత పోరాటాలు చేసి కొంత కాలం పవర్‌లూమ్స్ ఆడకుండా ఆటకట్టంచి, పోలీసు కేసుల నిర్బంధాల నెదిరించి నిలిచిన ప్రాంతాలు అనంతపురం, ధర్మవరం. అలాంటి చోట్ల కూడా యథేచ్ఛగా చేనేత రకాల తయారీలో పవర్‌లూమ్ వారిదే విజయం అయింది. అంటే అది ఎంత బలమైన లాబీనో అర్థమవుతుంది. కేంద్ర, రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రులుగా ఎందరు వచ్చినా ఈ రంగానికి ఒరిగినదేమీ లేదు. వారందరికీ మరమగ్గాల మీద మమకారమే తప్ప, సమస్యలపై దృష్టి లేదు. కావూరి సాంబశివరావు వ్యవహార శైలి ఇందుకు మంచి ఉదాహరణ.
 
కనీస అవగాహన లేనివారే మంత్రులు
 కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినదే తడవుగా కావూరి  హైదరాబాద్ వచ్చి  చేనేతల ప్రతినిధులను, అధికారులను, మంత్రి, ముఖ్యమంత్రులను సమావేశపరిచి కొత్త కొత్త వాగ్దానాలు చేశారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పథకాలు తెచ్చిపెడతామన్నారు. చివరికి ‘స్వల్పకాలిక’ మంత్రిగా నిలిచారు. రాష్ట్ర సహకార వ్యవస్థలో పెద్ద సంస్థ ‘ఆప్కో’కు కిందటేడాది చైర్మన్‌గా ఎన్నికైన మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు,  కావూరిని మంగళగిరి తీసుకువచ్చి అట్టహాసంగా చేనేత మగ్గాల షెడ్ల దగ్గరకు తిప్పి చూపించారు. అంతా చూసిన మంత్రిగారు తీవ్రంగా స్పందించి, ‘కాలం మారుతోంది, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది, పెరిగిన సాంకేతిక నైపుణ్యంతో చేనేత బతుకు సాధ్యం కాదు, ఇన్నాళ్లు బతికించిన చేనేత కార్మికులను అభినందించాలి’ అని ప్రకటించారు. మీ కష్టాలు తీర్చే మార్గాలు చూస్తామని హామీ ఒకటి ఇచ్చారు. యంత్ర పరిజ్ఞానం పెరిగిన ఈ దశలోనే చేనేతకు కేటాయించిన రిజర్వేషన్ చట్టం గట్టిగా అమలు జరపాల్సిన అవసరం ఉంది. చేనేతలు ఎప్పుడు నోరుతెరిచినా, చేయెత్తి నినదించినా  రిజర్వేషన్ చట్టం కోసమే కదా! ఇంత ముఖ్యమైన చట్టాన్ని అమలు చేయడం, ఇన్ని అనర్థాలకు కారణమైన నకిలీ వస్త్రాలు నిరోధించడం వంటి అంశాలపై అవగాహన లేకుండా ఎన్ని చెప్పినా చేనేతకు ఒరిగేది ఏం ఉంటుంది? చేనేత పరిశ్రమతో, చేనేత కార్మికుల ప్రమేయంగానీ, ఏమీ లేకుండానే  ఆ పరిశ్రమను  సమూలంగా సర్వనాశనం చేసే అనేక పథకాలు తెచ్చి పెట్టారు. టెక్స్‌టైల్ పార్కులు, క్లస్టర్ పథకాలకు కోట్ల రూపాయలు కుమ్మరించి, అది కూడా చేనేతకు చేస్తున్న మేలేనంటున్నారు.
 
 రాష్ట్రంలో లక్షల్లో ఉన్న మగ్గాలు వేలల్లోకి ఎందుకు జారిపోతున్నాయో, ఎంతో యోచించి ప్రవేశపెట్టినట్టు చెబుతున్న పథకాల కారణంగానే చేనేత పరిశ్రమ ఎందుకు పతనమైపోతోందో ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పరు. హద్దు, అదుపులేకుండా నిబంధనలను ఉల్లంఘించి చిలపల నూలు ధర లనూ, నూలు తయారీని (యాంకీయారన్ ఆబ్లికేషన్) శాసిస్తున్న మిల్లులను ప్రభుత్వాలు పల్లెత్తు మాట కూడా అనలేవు. చేనేతకు అవసరమయ్యే జరీ, రంగులు, రసాయనాలు, పట్టు వంటి సామగ్రి ధరలను అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.
 
ఇవి చేతకాక పోయినా, కార్మికులలో ఆశలు రేకెత్తించే విధంగా ‘లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని’ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించి సంవత్సరం దాటింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల వెతలు చూసి రూ.312 కోట్లతో రుణ మాఫీ పథకం  ప్రారంభించారు. ఆ పథకం కూడా ఈ పాలకులకు ఆట వస్తువైంది. నూలు మీద ఎన్‌డీఏ ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని వైఎస్ రద్దు చేయించడమేకాదు, చేనేత కార్మికులకు యాభై సంవత్సరాల వారికే వృద్ధాప్య పింఛన్‌లు  ఇచ్చి ఆదుకున్నారు. అందరితో పాటు చేనేత వారికి పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేశారు. విచిత్రమేంటంటే, ఆ రుణ మాఫీకి కేటాయించిన రూ.312 కోట్లనే నాలుగు సార్లు చేనేత బడ్జెట్‌లో చూపించి నేటి పాలకులు తమ పబ్బం గడుపుకొన్నారు.
 
 మార్పు పేరుతో విధ్వంసం
 ఇంత బాగోతం జరిగినా ఇప్పటికీ చేనేతల బతుకులు మారుస్తామనే నాయ కులు ప్రకటిస్తున్నారు.  చేనేత అనే పదాన్నీ, మగ్గం స్వరూపాన్నీ మార్చడానికి పూనుకున్నారు. కానీ పాలకుల నోట ‘మార్పు’ అనే మాట వింటేనే చేనేతల నరాల్లో వణుకు పుడుతున్నది. చేనేతను తుడిచి పెట్టడానికి గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు ‘మార్పు’ పేరుతోనే చేశారు. ప్రస్తుతం ఉన్న గుంట మగ్గానికి ‘మరలు’ బిగించి శ్రమను తగ్గించాలనీ, తద్వారా ఉత్పత్తి పెంచా లనీ, నైపుణ్యం తగ్గకుండా చూడాలనీ తీయగా వల్లిస్తున్నారు. అంటే చేనేత ఉత్పత్తిని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో భాగంగానే పరిగణించాలన్న తమ ఆంత ర్యం ఇలా బయటపెట్టారు.
 
 ఈ మాటలు సాధారణంగానే కనిపించినా రిజర్వే షన్ల గోల లేకుండా, చేనేతకు ప్రత్యేక కేటాయింపులు లేకుండా, మరమగ్గాల మీద, మిల్లుల మీద తయారైన నకిలీ వస్త్రాలను చేనేత బట్టలుగానే మార్కెట్ చేయాలన్న దురుద్దేశం ఉంది. ఈ విధానాన్ని చేనేత వర్గాలు తీవ్రంగానే ప్రతిఘటించాయి. ‘హ్యాండ్లూమ్’ విధానాన్ని మార్చడానికి కేంద్రం నియ మించిన ఉన్నతస్థాయి కమిటీలో చేనేత నిపుణులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ లేకుండా అచ్చంగా అధికారులే ఉన్నారంటేనే కుట్ర అర్థమవుతుంది.
 
 చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి వేరువేరుగా నిధులు కేటాయించ మనీ, వేరువేరు శాఖలుగా నిర్వహించమనీ, చేనేత తన బతుకు తాను బతు కుతుందనీ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు వినిపించుకో వడం లేదు. అంతరించి పోతున్న చేనేతకు రాయితీలూ, సబ్సిడీలూ వ్యర్థ మని ప్రభుత్వాల అభిప్రాయం. ఇలాంటి విధానాలతో చేనేతను నొప్పి తెలి యకుండా, నిశ్శబ్దంగా పూర్తిగా చంపేయవచ్చునని వారంతా భావిస్తున్నారు.  
 
 రాజ్యాంగం ప్రసాదిస్తున్న విద్య, వైద్యం, కనీసం గృహవసతి లాంటి సౌక ర్యాలు చేనేతలకు లేవు. ఉపాధి హక్కును కాలరాసి, సంక్షేమ పథకాల పేరుతో దీర్ఘకాలం నుంచి వారిని మభ్యపెడుతున్నారు. చేనేత వర్గాల మౌలిక సమస్యలను తెలుసుకుని, మగ్గమ్మీదే జీవనోపాధి పొంది, కనీస వేతనం లభించే విధంగా విధానాలు రూపొందించే ప్రభుత్వాలు రావాలి. చేనేత పరిశ్రమ నిలవాలి.    
 - (వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పూర్వ అధ్యక్షుడు)
 అందె నరసింహారావు

Advertisement

What’s your opinion

Advertisement