Sakshi News home page

కనుమరుగైన ‘మారందాయి’

Published Fri, Jul 29 2016 12:54 AM

Lost ' marandayi '

‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో రేపు దేశమంతా అదే ఆలోచిస్తుంద’ని మన కొక నానుడి ఉండేది. బెంగాల్‌కు అంతటి కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల్లో చాలామంది ఇప్పుడు బంగ్లాదేశ్‌గా ఏర్పడిన గడ్డపై ప్రభవించినవారే. గురువారం కన్నుమూసిన సాహితీ మేరు నగం మహాశ్వేతా దేవి ఆ స్రవంతిలో అగ్రగణ్యురాలు మాత్రమే కాదు...తన ప్రతిభా వ్యుత్పత్తులన్నిటినీ అట్టడుగు వర్గాల కోసం వెచ్చించి, వారి కోసమే తుదివరకూ తపించిన అరుదైన వ్యక్తి. ప్రగతిశీల భావాలున్న ఇంట పుట్టడం వల్ల ప్రజాపక్షం వహించడం ఆమెకు సహజాతంగా వచ్చింది. అది దుర్గమారణ్యాల్లో దుర్భరమైన బతుకులీడుస్తున్న ఆదివాసీలను వెతుక్కుంటూ వెళ్లేలా చేసింది. వెలివేతలకు, వెట్టిచాకిరీకి గురవుతున్న కులాల కోసం గళమెత్తేలా చేసింది. వారి కోసం కలాన్ని ఆయుధంగా మలుచుకోవడాన్ని అలవాటు చేసింది. హృదయంలేని నగర జీవి తాల్లోని కృత్రిమత్వాన్ని ఎత్తిచూపింది. విలాసాల్లో మునిగి తేలుతూ, హోదాల కోసం అర్రులు చాచే అక్కడి జుగుప్సాకర ధోరణుల్ని బట్టబయలు చేసింది. మళ్లీ అలాంటివారి మధ్యే...అట్టడుగువర్గాలవారి కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ముందుకురికే యువతరం ఉండటాన్ని లోకానికి పరిచయం చేసింది.

మహాశ్వేతా దేవి ఏకకాలంలో పాత్రికేయురాలు, సంక్షేమ వ్యూహకర్త, రచ యిత్రి, ఉద్యమకారిణి. నాన్న మనీష్ ఘటక్ ఆధ్వర్యంలో వెలువడిన సాహిత్య త్రైమాసిక సారథ్యాన్ని ఆయన మరణానంతరం స్వీకరించి దాన్నొక గ్రామీణ పత్రికగా నడిపిన ఘనత ఆమెది. పెద్దగా చదువు సంధ్యల్లేని దళిత, ఆదివాసీ జనం తమ బతుకులనూ, తాము అనుదినం ఎదుర్కొంటున్న సమస్యలనూ చెబుతుంటే వాటిని ఆమె యధాతథంగా రాసి, అందులో ప్రచురించేవారు. వ్యవ సాయ కూలీలు, రైతులు, రిక్షావాలాలు తదితరులే ఆ పత్రికలో వ్యాసకర్తలు. వారి జీవి తాలనూ, వారి సమస్యలనూ, అందుకు వారు చూపించే పరిష్కారాలనూ వారి మాండలికంలోనే అచ్చేయడం ఆ పత్రిక విశిష్టత. పాత్రికేయురాలిగా ఇది ఆమె సాధించిన గొప్ప విజయం. ఇంగ్లిష్ లెక్చెరర్‌గా పనిచేస్తూ ఆమె ఈ పత్రిక నిర్వహణను చూడటమే కాక... బెంగాలీలో, ఇంగ్లిష్‌లో ఎన్నో వ్యాసాలు రాశారు. అట్టడుగు ప్రజలు, మహిళల జీవితాలే... వారు చేస్తున్న పోరాటాలు, సాహసాలు, త్యాగాలే ఆమె నవలల్లో, కథల్లో ప్రధాన వస్తువు. ఆమె రచనల ముడి సరుకంతా జీవితమే.

ఆ ముడిసరుకు నిండా తాను ప్రత్యక్షంగా వెళ్లి, చూసి తెలుసుకున్న అంశాలే. ఆమె ఎంత గొప్ప ఉపన్యాసకురాలో చెప్పడానికి సరిగ్గా పదేళ్లక్రితం ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ బుక్ ఫెయిర్‌కు వెళ్లిన సందర్భాన్ని మననం చేసుకుంటే సరిపోతుంది. అప్పుడామె చేసిన ప్రసంగాన్ని దేశదేశాలకూ చెందిన సభాసదులందరూ కన్నీటిపర్యంతమవుతూ విన్నారు. భారతీయ సంస్కృతి అంటే బహుళ మతాల, కులాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక రంగు... నెత్తుటి రంగుని పులుముకున్నదని ఆమె నిష్కర్షగా చెప్పారు. భిన్న సంస్కృతుల నాగరికత రూపుమాసిపోతున్నదని ఆవేదన చెందారు. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ మాటలు ఆమెను దేశద్రోహిగా మార్చేవేమో! ఈ పదేళ్ల కాలమూ మనకు వెనకనున్నదో, మనమే ఇంకా వెనక్కి పోయామో అర్ధంకాని స్థితి.

బ్రిటిష్ వలస పాలకులు నేరస్త జాతులుగా ముద్రేసి వెలివేసిన కొన్ని ఆదివాసీ తెగల బతుకులెలా ఉన్నాయో ఆమె ప్రపంచానికి తెలిపారు. ఎన్నడో 1871లో పాలకులు చేసిన ఈ నేరం తరతరాలుగా ఆ జాతుల్ని ఎలా పీడిస్తున్నదో, సహ ఆదివాసీలకు సైతం వారెలా అంటరానివారయ్యారో వివరించారు. 1952లో వీరిని డీ నోటిఫై చేశామని ఆనాటి ప్రభుత్వం ప్రకటించినా తరతరాలుగా వారిపై ఉన్న ముద్ర చెరగలేదు. పోలీసుల్లో వారిపై ఉన్న అనుమానాలూ పోలేదు. ఆ ఆదివాసీల ఇబ్బందుల్ని అందరి దృష్టికీ తెచ్చేందుకు డీనోటిఫైడ్, సంచార జాతుల హక్కుల సంస్థను  ఏర్పాటుచేసి వారి సమస్యలపై పోరాడారు. సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ పాలనలో సైతం ఈ జాతుల సమస్యలు పరిష్కారం కాకపోవడాన్ని  ఎత్తిచూపారు. దొంగలుగా, దోపిడీదార్లుగా ముద్రపడి వారంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకులీడుస్తున్న వైనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు తీసుకెళ్లారు.

 ఆదివాసీల్లోని ఆకలి, దారిద్య్రం, భయం, అమాయకత్వం పోగొట్టి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ఆమె అనేక రకాలుగా కృషిచేశారు. ఆదివాసీలు చేసే వ్యవసాయం, పాడి వగైరాలను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచేలా చేసి, వారి రాబడిని పెంచడం ఆమె సాధించిన విజయం. జాన పద గాథలుగా, పాటలుగా జనం నోళ్లలో నానుతున్న అంశాలపై పరిశోధించి, పల్లె సీమల జనంతో మాట్లాడి ఆమె ఝాన్సీ లక్ష్మిబాయి వీరగాథను నవలా రూపంలో అందించారు. ఆ తొలి రచనే మహాశ్వేతను అగ్రగామి రచయిత్రిగా పరిచయం చేసింది. అదే తరహాలో బ్రిటిష్ వారిపై పోరాడిన ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా సాహసగాథను అరణ్యఅధికార్ పేరుతో నవలగా మలిచినప్పుడు ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

విలాసవంతమైన జీవితాన్ని కాదని, ఇంటిపట్టున ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్లి చివరకు ఎన్‌కౌంటర్ పేరుతో హతుడైన కుమారుణ్ణి తలుచుకుంటూ... అతని సన్నిహితుల స్మృతుల్లో అతని జాడను వెదుక్కుంటూ వెళ్లిన ఒక తల్లికి వెల్లడైన చేదు వాస్తవాలను చిత్రించిన ఆమె రచన అందరినీ కదిలిస్తుంది. అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞాన్‌పీఠ్ తోపాటు సామాజిక సేవకిచ్చే మెగసెసె అవార్డు, పద్మవిభూషణ్ పురస్కారం లాంటివి ఆమెకొచ్చినా వాటిద్వారా లభించిన సమస్త ఆదాయాన్నీ ఆమె పేద జనం అభ్యు న్నతికే వెచ్చించారు. ఆదివాసీలు ఆమెను ‘మారందాయి’(పెద్దక్క) అని పిల్చే వారట. అదే ఆమెకు లభించిన అతి పెద్ద పురస్కారం. ఎంతో సాదాసీదా జీవితం గడిపి కన్నుమూసిన మహాశ్వేతాదేవి లాంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా చాలా అరుదు. అలాంటివారు కనుమరుగు కావడం ఎప్పటికీ పూడ్చలేని లోటు.

Advertisement

What’s your opinion

Advertisement