Sakshi News home page

బీజేపీ గుప్పిట్లో ‘మ్యాజిక్‌ ఫిగర్‌’

Published Mon, Jul 8 2019 2:08 PM

BJP Reaches Magic Figure in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ వ్యూహం ఫలిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ను తగ్గించి.. తనకున్న సొంత బలంతోనే మెజారిటీ నిరూపించునేకుందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపిన సంగతి తెలిసిందే. బీజేపీ అమలు చేసిన వ్యూహం పక్కాగా ఫలించినట్టు కర్ణాటకలో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మ్యాజిక్‌ ఫిగర్‌కు 106కు చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 ఎమ్మెల్యేల బలముంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి.. బీజేపీకి అండగా నిలబడేందుకు సై అన్నారు. దీంతో బీజేపీ గుప్పిట్లోకి ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ వచ్చినట్టయింది. అయితే, చేజారిన ఎమ్మెల్యేలను ‘మంత్రి పదవి అస్త్రం’తో తిరిగి దక్కించుకోవాలని సంకీర్ణ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి.

కర్ణాటకలో మొత్తం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225. ఇందులో ఒకరు నామినేటెడ్‌ ఎమ్మెల్యే కాగా, మరొక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో 223 మంది సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారు. ఇందులో 10 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి 69 మంది సభ్యుల బలముంది. కాంగ్రెస్‌ మిత్రపక్షం జేడీఎస్‌ వద్ద ముగ్గురు రెబెల్స్‌ రాజీనామా తర్వాత 34మంది ఎమ్మెల్యేల బలముంది. బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరి మద్దతు సంకీర్ణ కూటమికి ఉంది. దీంతో ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 104కు చేరుకుంది. మరోవైపు బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికి తోడు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే సంకీర్ణ కూటమి నుంచి తప్పుకొని.. బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి.. ముంబైలోని రెబెల్‌ ఎమ్మెల్యేల క్యాంపునకు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ చేరుకున్నారు. దీంతో కమలదళం బలం ‘మ్యాజిక్‌ ఫిగర్‌’  అయిన 106కు చేరుకుంది. రెబెల్స్‌ రాజీనామాల తర్వాత స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కలుపుకొని బీజేపీ కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీని సాధించింది. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే, గవర్నర్‌ ఆయనను బలపరీక్షకు సిద్ధపడేలా ఆదేశించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సంకీర్ణ నేతలు కొత్త వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చి ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. మంత్రి పదవుల గాలానికి రెబెల్‌ ఎమ్మెల్యేలు దిగివస్తారని, సాయంత్రానికి రెబెల్‌ క్యాంపులోని ఐదారుగురు ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకుంటారని కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు చెప్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement