Sakshi News home page

‘కారు చక్రం దారుస్సలాంలో బందీ’

Published Tue, Mar 12 2019 5:13 PM

BJP Telangana Chief Laxman Slams Both TRS And Congress In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: బీజేపీ అభ్యర్థుల గుర్తింపు పక్రియ మొదలైందని, 17 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ చరిష్మాతో మెజారిటీ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. 15వ తేదీన పార్లమెంటు బోర్డు సమావేశంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, 16న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వివరించారు. ఈ సారి 300 పైచిలుకు సీట్లను గెలుస్తామని జోస్యం చెప్పారు. బీజేపీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసం ఉందన్నారు. మొన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. 15 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఇన్ని రోజులు చక్రం తిప్పారా లేక బొంగరం తిప్పారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నామని వ్యాక్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఏముంటుందని సూటిగా అడిగారు. రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా తేల్చిందేమీ లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణా సాధించామని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ వల్ల తెలంగాణా రాలేదని, టీఆర్‌ఎస్‌ అధికార దాహంతో ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు.  ఫోటోలు, ట్వీట్లు తప్పితే టీఆర్‌ఎస్‌ సాధించిందేమీ లేదని వ్యాక్యానించారు. 

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే..
టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనని, అలాగే కాంగ్రెస్‌కు ఓటేసినా టీఆర్‌ఎస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. కారు చక్రం దారుస్సలాంలో బందీ అయిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఒక కుటుంబానికి బానిసలుగా ఉంటున్నారని, మోదీ ప్రధాని అయితే కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉంటారా అని సవాల్‌ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు తనతో రెండు గంటలు చర్చించినట్లు వెల్లడించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని, మోదీ అవసరం దేశానికి కావాలని నాదెండ్ల కోరినట్లు వ్యాఖ్యానించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement