Sakshi News home page

మోదీతో ఏం మాట్లాడారో వెల్లడించాలి: బొత్స

Published Sun, Jan 14 2018 1:55 AM

chandrababu naidu should clarify on modi meeting, say botsa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు 45 నిమిషాలపాటు ఏయే అంశాలను చర్చించారో వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. 20 అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు మీడియాతో చెప్పారని, అవన్నీ నాలుగేళ్లుగా అడుగుతున్నవేనని గుర్తుచేశారు. బొత్స సత్యనారాయణ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి పాత అంశాలే తప్ప కొత్తగా అడిగిందేమీ లేదని విమర్శించారు. మోదీ వేటికి ఆమోదం తెలిపారో కూడా చంద్రబాబు చెప్పలేదన్నారు. 

రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? 
దేశంలో అందరి కంటే సీనియర్‌ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాలుగేళ్లుగా కేంద్రం నుంచి సాధించిందేమిటో బయటపెట్టాలని బొత్స డిమాండ్‌ చేశారు. ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అందులో సాగునీటి ప్రాజెక్టులపై రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. మిగిలిన డబ్బు ఏం చేశారో లెక్కలు చూపించాలన్నారు. దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రెండు ఎకనామిక్‌ జోన్లు ఇవ్వాలని కోరే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని నిలదీశారు. 

Advertisement

What’s your opinion

Advertisement