Sakshi News home page

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

Published Mon, Apr 16 2018 1:19 AM

Congress will retain in power  - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ డోర్నకల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాటోతు రాంచందర్‌నాయక్‌ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఉత్తమ్‌ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో బ్యాంక్‌ల ద్వారా రుణమాఫీ చేస్తామన్నారు.

రైతులను ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాట తప్పారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తుంటే అమాయక గిరిజన రైతులకు సంకెళ్లు వేసి వీధుల్లో నడిపించి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రుణ మాఫీతోపాటు ఒక్కో డ్వాక్రాగ్రూప్‌నకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలందిస్తామన్నారు.

అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌పాలనలో అభయహస్తం పింఛన్లు ఇచ్చామని, అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అవి తొలగించారని విమర్శించారు. అప్పుడు రూ.500 పింఛన్‌ ఇచ్చామని కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దానిని రూ.1000కి పెంచుతామని చెప్పారు. కాగా, వచ్చే ఎన్నికల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను మట్టి కరిపించడం ఖాయమని పార్టీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, నేతలు బలరాంనాయక్, షబ్బీర్‌ అలీ, హన్మంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దొంతు మాధవరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ప్రసంగించారు.

సత్యం సేవలు చిరస్మరణీయం: కుంతియా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీకి అయితం సత్యం చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. ఆదివారం ఖమ్మంజిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుంతియా మాట్లాడుతూ..సత్యం కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేశారని పేర్కొన్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మాట్లాడుతూ.. సత్యం తనకున్న అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారన్నారు. పార్టీలోని ప్రతిఒక్కరికీ సహకరించేవారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్యం సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం ఆయన విశేషంగా కృషి చేశారన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement