ఉగ్ర మూలాలు  ఆందోళనకరం | Sakshi
Sakshi News home page

ఉగ్ర మూలాలు  ఆందోళనకరం

Published Sat, Jun 1 2019 12:52 AM

Sakshi Special Interview With Central Minister Kishan Reddy

సాక్షి, న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో జరిగే ఉగ్రవాద దాడుల మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నట్లు వార్తలు వస్తుండటం, ఉగ్ర దాడుల కుట్రలు, ప్లానింగ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డికి ప్రధాన మోదీ కీలకమైన కేంద్ర హోంశాఖ కేటాయించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ముఖాముఖిలో ఆయన వివిధ అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ చొరబాట్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇవీ.. 

సాక్షి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి లభించడాన్ని ఎలా చూస్తారు? 
కిషన్‌రెడ్డి: వాస్తవానికి నేను శాసనసభకు పోటీ చేశాను. దేవుడి మహిమనేమో తెలియదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 65 వేల మెజారిటీతో గెలిచాను. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయా. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగడం, పార్టీ  అధిష్టానం నన్ను సికింద్రాబాద్‌లో పోటీ చేయించడం, అక్కడి ప్రజల ఆశీస్సులతో గెలుపొందడం, ఇప్పుడు కేంద్ర మంత్రి కావడం, అందులోనూ హోంశాఖ దక్కడం, హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం దక్కడం, ఇవన్నీ ఒకరకంగా నాకు రాజకీయంగా మంచి అనుభవం. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్నా. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా. శాసనసభాపక్ష నేతగా ఉన్నా. బీజేవైఎంలో దశాబ్దకాలానికిపైగా అనేక పదవులు నిర్వహించా. ఈ పదవి మరింత అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నా. 
 
హోంశాఖ ద్వారా ఎలాంటి సేవ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు? 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశమంతటా సమగ్రత, సమైక్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రపంచంలో ఎవరు ఏ దేశానికి వెళ్లినా అక్కడ రికార్డు ఉంటుంది. ఎవరైనా అమెరికా వెళ్తే అమెరికన్లు ఎవరు? నాన్‌ అమెరికన్లు ఎవరు? రికార్డు ఉంటుంది. ఇంగ్లాండ్‌ వెళ్లినా ఇంగ్లాండ్‌ వాళ్లెవరు? నాన్‌ ఇంగ్లాండ్‌ వారెఎవరు అనే రికార్డు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ఎవరు భారతీయులు, ఎవరు కాదు అనే రికార్డు ఏదీ మనకు లేదు. అందుకే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్సీ) రికార్డు తయారు చేయాలనుకుంటోంది. భారతీయులు ఎవరు, కాని వారెవరో రికార్డుల్లో పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని మతపరంగానో, ఓట్లపరంగానో చూడరాదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఒక మంచి విషయానికి మద్దతు ఇవ్వాలి.

భారతీయులంతా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. మన దేశమేమీ ధర్మ సత్రం కాదు.. ఏదేశం వారైనా రావొచ్చు.. పోవచ్చన్న ఆలోచన ఎవరికీ ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే విదేశీయులను ఓటు బ్యాంకుగా మలుచుకొని దేశంలో రాజకీయాలు చేయాలనుకుంటున్న దుర్మార్గపు వ్యవస్థ, దిగజారిన వ్యవస్థ, దివాలాకోరు వ్యవస్థ దేశంలో ఉంది. కాబట్టే ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయులకు సంబంధించిన రిజిస్టర్‌ ఉండాలి. మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనాభా పెరుగుదల. సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు పెడుతున్నాం. కానీ జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత జనాభా పెరుగుదల మన దేశంలో ఉందంటే అందుకు అక్రమ చొరబాట్లు కూడా ఒక కారణం. ఈ రకమైన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, దేశ రక్షణకు సంబంధించి అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఈ విషయాలపై నేను అధ్యయనం చేస్తా. 
 
ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నాయన్న వార్తలపై మీ స్పందన ఏమిటి? 
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా లేక పొరుగు దేశాల్లో జరిగినా కూడా దానికి ప్లానింగ్, కుట్ర హైదరాబాద్‌లో జరుగుతోంది. దేశ, విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వచ్చి సేఫ్‌ జోన్‌గా భావించి స్లీపర్‌ సెల్స్‌లా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిసారీ జాతీయ స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు రావడం, హైదరాబాద్‌లో అనుమానితులను అరెస్టులు చేయడం చూస్తున్నాం. మరోవైపు ఐసిస్‌ కార్యకలాపాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించేవి. మయన్మార్‌ నుంచి వేలాది మంది చొరబాటుదారులు (రోహింగ్యాలు) హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్నారు. వారికి కొన్ని సంస్థలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

కానీ మన దేశ ప్రజలకే మనం పూర్తిగా సౌకర్యాలు కల్పించలేనప్పుడు విదేశీయులకు ఎందుకు ఇవ్వాలి? వాళ్లను వలసవాదుల కింద మనం గుర్తించలేదు. వాళ్లు శరణార్థులు కాదు. వాళ్లు అక్రమ చొరబాటుదారులు. ఈరోజు హైదరాబాద్‌లో రోహింగ్యాల పేరుతో, బర్మా బస్తీల పేరుతో కొన్ని బస్తీలు నెలకొన్నాయి. వారందరినీ వెనక్కి పంపాలి. వీటన్నింటిపై బీజేపీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునేందుకు చర్చించాల్సి ఉంది. నేను ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంది. నాకు ఇచ్చే బాధ్యతలను కచ్చితంగా విజయవంతంగా నిర్వర్తిస్తా. ఆ శక్తి భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. 
 
యువజన విభాగంలో పనిచేసినప్పుడు కౌంటర్‌ టెర్రరిజం పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించిన మీకు ఇప్పుడు అదే శాఖ రావడం ఎలా ఉంది? 
గతంలో నేను యువజన విభాగంలో పనిచేసినప్పుడు రెండు ప్రధాన కార్యక్రమాలు చేశా. సీమా సురక్షా జాగరణ యాత్ర చేశా. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా 45 రోజులపాటు యాత్ర చేపట్టా. దీనిపై సవివరంగా ఒక పుస్తకం కూడా రాశా. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. 60 దేశాలకు సంబంధించి 191 ప్రతినిధులతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరిగింది. అనేక అంశాలపై నాకు అవగాహన ఉంది. పెద్దల సలహా మేరకు ముందుకు సాగుతాను.  
 
తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? 
అక్రమ చొరబాట్లు, ఉగ్రవాదులు మన దేశ సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు పాకిస్తాన్‌ శక్తులు, అక్కడి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిత్యం సరిహద్దు గ్రామాలపై కాల్పుల ఉదంతాలు చూస్తున్నాం. అందువల్ల పోలీసు, రక్షణ వ్యవస్థను ఆధునీకరించాల్సి ఉంది. ఈ రోజు మన పోలీసులు దేశం కోసం బలి అవుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల వారిని మనం ఎంత మేర రక్షించుకుంటాం? ఎంత మెరుగైన వసతులు సమకూర్చుకుంటాం అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో రివాల్వర్‌ నుంచి మొదలు అన్నీ విదేశాల నుంచి సమకూర్చుకునేవాళ్లం. ఈరోజు మేకిన్‌ ఇండియా ద్వారా తయారు చేసుకునే ఆలోచన చేస్తున్నాం. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ప్రజలకు అన్ని రకాల వసతులు, భద్రత కల్పిస్తాం. నేను ఈ రోజు సికింద్రాబాద్, అంబర్‌పేట ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలుగు ప్రజలందరూ గర్వపడేలా పనిచేస్తా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినా బీజేపీ కార్యకర్తగా అందరూ గర్వపడేలా పనిచేస్తా తప్ప ఏ ఒక్కరూ తలదించుకునేలా ప్రవర్తించను.  
 
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆర్థికశాఖ ద్వారా తెలుగు రాష్ట్రాలకు అధిక నిధులు సాధించగలరా? 
తప్పనిసరిగా సాధిస్తా. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రావడం ఆనందకరం. డబ్బును లక్ష్మీదేవిగా చూస్తాం. ఆ శాఖకు మహిళ రావడం గర్వకారణం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నా. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఏది చెప్పినా తొందరపాటే అవుతుంది. నేను ఇంకా తెలుసుకోవాల్సి, చేయాల్సింది చాలా ఉంది.  
 
పార్టీ అభివృద్ధికి మీ పదవి ఎలా దోహదపడుతుందని భావిస్తున్నారు? 
మా పార్టీ ఇంకా చర్చించలేదు. చర్చించుకొని ఒక కార్యాచరణతో ముందుకెళ్తాం. కేవలం పదవి ద్వారానే పార్టీ విస్తరణ సాధ్యమవుతుందని నేననుకోను. స్థానికంగా ఉన్న కార్యకర్తల శ్రమ, పట్టుదల, రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ పథకాలను మిళితం చేస్తేనే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. 
 
కొందరు టీడీపీ, ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది బీజేపీ బలోపేతానికి సంకేతమా?  
ఏదో ఆకాశం ఊడిపడుతుందని చెప్పను గానీ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తాం. రానున్న రోజుల్లో బీజేపీ బలపడాలని ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టం చేశారు. ఆ దిశగా బలపడాలని మేం కోరుకుంటున్నాం.   

Advertisement
Advertisement