Sakshi News home page

సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Published Mon, Feb 5 2018 1:29 AM

Somu Veerraju Allegations on TDP Leaders - Sakshi

సాక్షి, కర్నూలు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపైనా పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. కర్నూలు అసెంబ్లీ పరిధిలో బూత్ స్థాయి బీజేపీ నేతల సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ‘మేము నిప్పులాంటి వాళ్లం. మీరు అవినీతికి వారసులు.  రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. నాకు సొంత ఎజెండా లేదు. రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ’ని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదని వాపోయారు. కరెంటు సమస్యలు తీర్చడానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్రానికి 9 యూనివర్సిటీలు ఇస్తే, ప్రస్తుతం ఏపీకి 16 యూనివర్సిటీలను కేటాయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. స్వచ్ఛ భారత్‌ పథకంలో భాగంగా రాష్ట్రానికి రూ.100 కోట్లు కేటాయించింది మోదీ కాదా అని సూటిగా ప్రశ్నించారు.

Advertisement

What’s your opinion

Advertisement