Sakshi News home page

ఏబీ డివిలియర్స్ విశ్వరూపం

Published Mon, Apr 10 2017 9:52 PM

ఏబీ డివిలియర్స్ విశ్వరూపం

ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఏబీ డివిలియర్స్ పరుగుల మోత మోగించాడు. సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. 46 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగి ఆడి 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు బెంగళూరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో డివిలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ బౌలర్లపై డివిలియర్స్ విరుచుకుపడ్డాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయి ఆడి అభిమానులకు పండుగ చేశాడు. బౌలర్ ఎవరైనా తన సహజసిద్ధమైన ఆట తీరుతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు డివిలియర్స్. ఏబీ బ్యాటింగ్ విన్యాసాలకు కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 18 పరుగులకే ఓపెనర్లు షేన్ వాట్సన్(1), విష్ణు వినోద్(7) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ.. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కేదర్ జాదవ్(1)వికెట్ ను నష్టపోయింది. దాంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఆపై మన్ దీప్ సింగ్(28) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు కుదుటపడింది. అయినప్పటికీ ఆర్సీబీ రన్ రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అయితే ఆపై ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు మరీ మందగించింది. 15 ఓవర్లలో నాలుగు వికెట్లకు 71 పరుగులు చేసి అత్యల్ప రన్ రేట్ తో ముందుకు సాగింది.

కాగా, డివిలియర్స్ క్రీజ్ లో ఉన్నాడనే ప్రేక్షకుల ధీమాను అతను వమ్ము చేయలేదు. చివరి ఓవర్లలో డివిలియర్స్ బ్యాట్ కు పని చెప్పాడు. బంతి వేయడం సిక్స్ కు తరలించడం అన్న చందంగా సాగింది డివిలియర్స్ బ్యాటింగ్. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకాన్నిసాధించాడు ఏబీ.  ఏబీ హాఫ్ సెంచరీ చేసే సమయానికి 17.0 ఓవర్లు పూర్తవ్వగా, అప్పటికి ఆర్సీబీ స్కోరు 96/4.  ఆ తరుణంలో ఏబీ విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఏబీ దూకుడుతో ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అతనికి స్టువర్ట్ బిన్నీ(18 నాటౌట్) సహకారం అందివ్వడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 

Advertisement

What’s your opinion

Advertisement