22 ఏళ్లకే ఇన్ని సాధిస్తే...

30 Aug, 2017 01:37 IST|Sakshi
22 ఏళ్లకే ఇన్ని సాధిస్తే...

ఇకపైనా సింధుకు తిరుగుండదు
♦  కోచ్‌ గోపీచంద్‌ ఆశాభావం


సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలతో మన జట్టు మరో మెట్టు ఎక్కిందని భారత చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. ఈ మెగా ఈవెంట్‌లో రజత, కాంస్యాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించగల సత్తా సింధులో ఉందని ఆయన అన్నారు. ఇంకా గోపీచంద్‌ ఏమన్నారంటే...

ఇలాంటి మ్యాచ్‌ జీవితంలో చూడలేదు...
సింధు వయసు కేవలం 22 ఏళ్లు. ఇప్పటికే 3 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు, ఒలింపిక్‌ మెడల్‌తో పాటు రెండు సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో విజేతగా నిలిచింది. ఇది చాలా పెద్ద ఘనత. ఇక ముందు ఆమె ఇదే తరహాలో కష్టపడితే పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరతాయి. సింధు ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌లాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కోచ్‌ స్థానంలో కూర్చున్న నాతో పాటు దేశంలో ఎంతో మంది ఈ మ్యాచ్‌ను ఊపిరి బిగబట్టి చూడటమే ఈ మ్యాచ్‌ గొప్పతనం గురించి చెబుతోంది.  

షెడ్యూల్‌ను సాకుగా చూపించలేము...
అంపైర్‌ నిబంధనల ప్రకారమే సింధును ఎల్లో కార్డుతో హెచ్చరించారు. మ్యాచ్‌ల సందర్భంగా ఇలాంటివి చిన్న విషయాలే. మ్యాచ్‌ సమయాలను ప్రసారకర్తలు నిర్ణయించడం సరైంది కాకపోయినా... భారత్‌లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోవడం వల్ల కొన్ని సార్లు ఇది తప్పదు. అయితే మ్యాచ్‌ తుది ఫలితానికి దీనిని సాకుగా చూపించలేము.  

ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెంచుకోవాలి...
ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఫిట్‌నెస్‌ ప్రమాణాలు ఎంతో పెరిగాయి. ఆ స్థాయికి చేరడంపై మనం కూడా దృష్టి పెట్టాం. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించకపోయినా శ్రీకాంత్, సాయిప్రణీత్‌ చక్కటి ప్రదర్శన కనబర్చారు. మొత్తంగా మన షట్లర్ల ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను.  

మెరుగైన స్థితిలో ఉన్నా...  
ప్రస్తుత భారత క్రీడారంగం గతంలోకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. భారత ప్రధాన మంత్రి ఒకరు క్రీడల గురించి, క్రీడలను ప్రోత్సహించడం గురించి ఇంత తరచుగా మాట్లాడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అత్యున్నత స్థాయి అధికారులు ఆటలు, సౌకర్యాల గురించి ఇంత ఎక్కువగా చర్చించడం కూడా ఇప్పుడే కనిపిస్తోంది. ఇది మన ఆటలకు మేలు చేసే అంశం. ఇప్పటి వరకైతే క్రీడలు సరైన దిశలో సాగుతున్నాయి. ఇక ముందు ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

>
మరిన్ని వార్తలు