Sakshi News home page

‘సుందరం’... సుమధురం

Published Wed, May 17 2017 12:45 AM

‘సుందరం’... సుమధురం

ఐపీఎల్‌ ఫైనల్లో రైజింగ్‌ పుణే
చెలరేగిన సూపర్‌ జెయింట్‌
20 పరుగులతో ముంబై చిత్తు
రాణించిన సుందర్, శార్దుల్‌
 ఆకట్టుకున్న ధోని,  రహానే, తివారి


పుణే సూపర్‌ ఆటతో ఐపీఎల్‌–10 ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత ఏడాది అవమానకర రీతిలో ఏడో స్థానంలో నిలిచిన జెయింట్‌ టీమ్‌ ఈసారి అదరగొట్టే ప్రదర్శనతో టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రత్యర్థి వేదికపై 162 పరుగుల సాధారణ స్కోరు చేసి కూడా  జెయింట్‌ అద్భుత ఆటతీరుతో ఆ స్కోరును కాపాడుకోగలిగింది. భారీ బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా ముంబై ఇండియన్స్‌ ఛేదనలో బోర్లా పడింది. ఫలితంగా రెండు మరాఠా జట్ల పోరులో వరుసగా మూడోసారీ పుణేదే పైచేయి అయింది.

బ్యాటింగ్‌లో రహానే, తివారి అర్ధ సెంచరీలు... ఆపై తన ఫ్రాంచైజీ యజమానులు మునివేళ్లపై నిలబడి చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉండగా ధోని మెరుపు సిక్సర్ల ప్రదర్శన పుణేను మెరుగైన స్థితిలో నిలిపాయి. అనంతరం 17 ఏళ్లు కుర్రాడు వాషింగ్టన్‌ సుందర్‌ ముగ్గురు ముంబై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసి మ్యాచ్‌ను పుణే చేతుల్లోకి తెచ్చేశాడు. లీగ్‌లో రెండో ఏడాదే ఫైనల్‌ చేరి సత్తా చాటిన స్మిత్‌ సేన, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధించగా, ముంబైకి రెండో క్వాలిఫయర్‌ రూపంలో టైటిల్‌ పోరుకు చేరేందుకు మరో అవకాశం ఉంది.

ముంబై: సంచలన ఆటతో పుణే సూపర్‌ జెయింట్‌ ఐపీఎల్‌–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పుణే 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్‌ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఎమ్మెస్‌ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్‌; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. పార్థివ్‌ పటేల్‌ (40 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. వాషింగ్టన్‌ సుందర్‌ (3/16), శార్దుల్‌ ఠాకూర్‌ (3/37) ప్రత్యర్థి పని పట్టారు. నేడు జరిగే ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచే జట్టుతో ముంబై 19న రెండో క్వాలిఫయర్‌ ఆడుతుంది.

ఆ రెండు ఓవర్లు...
ఫామ్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠి తొలి ఓవర్లోనే డకౌట్‌... రెండో ఓవర్లో స్మిత్‌ (1) డగౌట్‌కు... పవర్‌ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు కేవలం 33 పరుగులు. ఇలాంటి స్థితిలో రెండు కీలక భాగస్వామ్యాలు పుణేకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. ముందుగా రహానే, తివారి మూడో వికెట్‌కు 65 బంతుల్లో 80 పరుగులు జోడించగా, ఆ తర్వాత తివారి, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 73 పరుగులు జత చేశారు.

ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో రహానే, తివారి చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో పరుగులు రావడం గగనంగా మారిపోయింది. ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బౌండరీలు పూర్తిగా ఆగిపోయాయి. హార్దిక్‌ వేసిన ఒక ఓవర్లో పుణే 15 పరుగులు రాబట్టినా, ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే, ఐపీఎల్‌లో 3 వేల పరుగులు కూడా దాటాడు. అయితే చక్కటి బంతితో రహానేను అవుట్‌ చేసి కరణ్‌ ఈ జోడీని విడదీశాడు. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ధోని భారీ సిక్సర్‌ బాదినా... తివారి మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఒక దశలో 32 బంతుల వ్యవధిలో కేవలం ఒక ఫోర్, ఒక సిక్సర్‌ మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థమవుతుంది.

18 ఓవర్లు ముగిసేసరికి పుణే స్కోరు 121 పరుగులు మాత్రమే. అయితే చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు రాబట్టడం విశేషం. మెక్లీనగన్‌ వేసిన 19వ ఓవర్లలో ధోని 2 భారీ సిక్సర్లు బాదగా, తివారి 6, 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ధోని మరో 2 సిక్సర్లు కొట్టడంతో పుణే 15 పరుగులు సాధించింది.

పార్థివ్‌ మినహా...
లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ ఆరంభం నుంచే తడబడింది. ఒకవైపు పార్థివ్‌ దూకుడుగా ఆడగా, మరో ఎండ్‌లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఉనాద్కట్‌ ఒక పరుగే ఇవ్వగా... తర్వాతి మూడు ఓవర్లలో పార్థివ్‌ ఒక్కో సిక్సర్‌ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే దురదృష్టకర రీతిలో సిమన్స్‌ (5) అవుట్‌ కావడంతో ముంబై పతనం ప్రారంభమైంది. పార్థివ్‌ కొట్టిన షాట్‌ బౌలర్‌ శార్దుల్‌ చేతికి తగిలి నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను పడేసే సమయంలో సిమన్స్‌ క్రీజ్‌ బయటే ఉన్నాడు.

తర్వాతి ఓవర్లో సుందర్‌ ముంబైని పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి బంతికి రోహిత్‌ (1)ను అవుట్‌ చేసిన అతను, నాలుగో బంతికి అంబటి రాయుడు (0) ఆట ముగించాడు. తన తర్వాతి ఓవర్లోనే పొలార్డ్‌ (7)ను సుందర్‌ వెనక్కి పంపించగా, కొద్ది సేపటికి హార్దిక్‌ (14) కూడా అవుటయ్యాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పార్థివ్‌ క్రీజ్‌లో ఉండటంతో ముంబై విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే శార్దుల్‌ వేసిన ఓవర్‌తో ముంబై పూర్తిగా విజయావకాశాలు కోల్పోయింది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఈ ఓవర్‌ మూడో బంతికి కృనాల్‌ పాండ్యా (15), చివరి బంతికి పార్థివ్‌ లాంగాఫ్‌లో క్రిస్టియాన్‌కే క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత ముంబై  ఆట నామమాత్రమే అయింది.

Advertisement

What’s your opinion

Advertisement