Sakshi News home page

Published Thu, May 17 2018 5:52 PM

WFI Ban Phogat Sisters From Asia Games - Sakshi

న్యూఢిల్లీ : నేషనల్‌ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఫోగట్‌ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ ఫోగట్‌ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్‌ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్‌ సిస్టర్స్‌ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్‌ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్‌ఐ వీరి మీద వేటు వేసింది.

ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘నేషనల్‌ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్‌ అయిన మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌తో చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీత కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూఎఫ్‌ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు.

డబ్ల్యూఎఫ్‌ఐ చర్యల వల్ల ఫోగట్‌ సిస్టర్స్‌ ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్‌ సిస్టర్స్‌ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చెప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్‌ సింగ్‌ తెలిపారు. ఫోగట్‌ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌ భర్త సత్యవర్త్‌ కడియాన్‌పైనా కూడా డబ్ల్యూఎఫ్‌ఐ నిషేధం విధించింది.

నిషేధం గురించి నాకేం తెలియదు : బబిత
అయితే ఈ విషయం గురించి బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్‌ఐ నాపై వేటు వేసిన సంగతి నాకు తెలియదు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు నాకు రాలేదు. నేను నేషనల్‌ కాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకాలి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యూఎఫ్‌ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే  రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్‌ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్‌ క్యంప్‌కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియద’ని చెప్పారు.

గీతా ఫోగట్‌ 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.

Advertisement

What’s your opinion

Advertisement